‘‘గుండమ్మ కథ’’ సినిమా రిలీజై 60 ఏళ్లు అయిన సందర్భంగా వ్యాసాలు, వాట్సాప్ మెసేజిలు వస్తున్నాయి. అన్నీ సినిమా ఎంత గొప్పగా ఉందో చెప్పేవే. హాస్యం కారణంగా సినిమా హాయిగా సాగిపోతుంది, తారాగణమంతా వాళ్ల ప్రైమ్‌లో ఉన్నారు కాబట్టి చూడడానికి చాలా ఆహ్లాదంగా కనబడతారు. పాటలు సరేసరి, అద్భుతంగా ఉంటాయి. పదేపదే చూసి ఎంజాయ్ చేసినవాళ్లలో నేను కూడా ఉన్నాను. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలంటే యీ సినిమాలో ప్రధానమైన విషయంలోనే లాజిక్ మిస్సయింది. కె కామేశ్వరరావు, డివి నరసరాజు, చక్రపాణి వంటి దిగ్దంతులు పని చేసిన ‘‘విజయా’’ సినిమాలో యిలాటి పొరపాటును ఎలా అనుమతించారో అర్థం కాదు. దాని తమిళ, హిందీ వెర్షన్లు ఫెయిలయినా మన తెలుగు వాళ్లం మాత్రం దాన్ని ఆడిస్తూనే వచ్చాం. షష్టిపూర్తి అయినా ఆదరంగా నెమరేసుకుంటున్నాం.
సినిమా కథలో నాకు అర్థం కాని విషయమేమిటంటే నాగేశ్వరరావు ఎల్. విజయలక్ష్మికి అన్నగారవుతాడని జమునకు, సూర్యకాంతానికి తెలుసు. అసలు ఆమె ద్వారానే నాగేశ్వరరావు బట్టలషాపులో జమునకు పరిచయమయ్యాడు. డబ్బు తిరిగి యివ్వడానికి విజయలక్ష్మి యింటికే జమున వెళ్లింది. జమున పెళ్లి సందర్భంగా విజయలక్ష్మి సూర్యకాంతానికి సేవలు చేసి మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. పైగా రామారావు వచ్చి ‘ఇల్లరికం అడుగుతున్నావు కదా, మరో అమ్మాయి అయితే ఆడపడుచు పుట్టింట్లో వుంటే ఏడ్చిపోతుంది. నాగేశ్వరరావు, విజయలక్ష్మి అన్నా చెల్లెలు వరుస కాబట్టి గొడవలు రావ’ని నచ్చచెప్పడంతో హరనాథ్, విజయలక్ష్మిల పెళ్లికి సూర్యకాంతం ఒప్పుకుంది.
పెళ్లి తర్వాత నాగేశ్వరరావు తాగి పేల్తున్నట్టుగా 'నేను దొంగని, నీ నగలు దొంగిలించాను' అని చెప్తూనే 'నేను రామభద్రయ్య కొడుకునని అబద్ధం చెప్పా' అని కూడా అన్నాడు. జమున పరిగెట్టుకుని వచ్చి సూర్యకాంతంతో ఆ విషయం చెప్పింది. ఇది వినగానే సూర్యకాంతం హరనాథ్‌ని నిద్రలేపి 'వాడు దొంగ, తాగుబోతు. వాడి చెల్లెల్ని నువ్వు చేసుకోవద్దు' అంది. ఇది అర్థం లేని మాట. నాగేశ్వరరావు రామభద్రయ్య కొడుకు కాదని నమ్మితే విజయలక్ష్మితో చుట్టరికం వుందని ఎలా అనగలరు? తమాషా ఏమిటంటే నాగేశ్వరరావు ఎల్.విజయలక్ష్మి కజిన్ అని అందరికీ తెలుసు. పోనీ అతను రామభద్రయ్య కొడుకు కాకపోతే మరెవరు? నీకెలా తెలుసు? వాడి ఆనుపానులేమిటి? అని వీళ్లెవరూ అడిగిన పాపాన పోరు. ఇది స్టోరీలో చాలా పెద్ద వీక్ పాయింట్.
సినిమాలో హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల పాత్రలు శుద్ధ వేస్ట్. హరనాథ్ పాత్రను చూస్తే మనకు చికాకు వేస్తుంది. అతను మంచివాడో, చెడ్డవాడో చెప్పలేం. ఒట్టి స్వార్థపరుడు అనిపిస్తుంది. సవతి అక్కగార్ని తల్లి రాచి రంపాన పెడుతూంటే ఏమీ చెయ్యడు. చెల్లెల్ని పెళ్లిచేసుకున్నవాడు దొంగై పారిపోతే అతనికి చీమ కుట్టినట్లు వుండదు. తన భార్య తరఫు బంధువే కదా, వెతికి పట్టుకుందామన్న ఆలోచనే వుండదు. తన భార్యన్నా, భార్య తరఫు బంధువులన్నా ఆదరిస్తాడు. తల్లి మాటెత్తితే చిరాకు పడతాడు కానీ ఆవిడ డబ్బు కావాలి. చెల్లెలు ఎక్కడున్నాడో తెలియని మొగుడి కోసం ఇంట్లోంచి వెళ్లిపోతే ఎక్కడ అష్టకష్టాలు పడుతోందోనన్న చింతే లేదు. తనూ, పెళ్లం వెళ్లి బెంగుళూరులో కూచుంటారు. ఇంత హోప్‌లెస్‌గా పాత్రను తీర్చిదిద్దారు. ఆ పాత్ర వల్ల సాధించినదేమిటో తెలియదు. విజయావారి సినిమాల్లో ప్రతీ పాత్రకూ ఓ అర్థం వుంటుంది, ఓ ప్రయోజనం వుంటుంది. కానీ ఈ సినిమాలో ఇంత ముఖ్యపాత్ర సన్నాసి రకంగా తయారయింది.
అతని చర్యలను సమర్థించడం ఏ రచయిత వల్లా కాదు, ఏ డైరక్టరు వల్లా కాదు. అందుకే దీన్ని హిందీలో తీసినపుడు ఈ పాత్రను ఎత్తేశారు. అతనితో బాటు అతని ప్రేయసి పాత్ర కూడా. విజయలక్ష్మి అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఓ నృత్యసన్నివేశం అనుకున్నారు. పాట ఏదీ సరిగ్గా కుదరకపోతే ఘంటసాలతో 'పాట వద్దులే, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వేసుకో' అన్నారు చక్రపాణి. డాన్సు షూటింగు అయ్యాక 'పిక్చర్ అంతా అయిన తరువాత చూసుకుని ఎక్కడ బోర్ కొడుతూంటే అక్కడ పెట్టుకుందాం లెండి' అన్నారు. డాన్సు ఇంత అనవసరంగా, అసందర్భంగా వచ్చింది కాబట్టే హఠాత్తుగా ప్రేక్షకులమీద పడుతుంది. ఆడియన్సులో నాగేశ్వరరావు, జమున ఓ సోఫాలో కూచుని చూస్తున్నట్టు కనబడుతుంది. అది కూడా వేరే షూట్ చేసినట్టు తెలిసిపోతుంది. స్టేజ్‌ని, ఆడియన్సుని కలిపి తీసిన షాటు లేదు. డాన్సు ముందు గానీ, తర్వాత గానీ వీరు ఆమెను అభినందించినట్టు వుండదు. పైగా ఆడియన్సులో నాగేశ్వరరావు, జమున కనబడతారు గానీ విజయలక్ష్మి తల్లిదండ్రులు గానీ, ప్రేమించినవాడు కానీ ఎవ్వరూ కనబడరు.
డాన్సు ఘట్టం వలన కథకు ప్రయోజనం ఏమీ సిద్ధించలేదు. మామూలు స్థాయి సినిమాల్లో కూడా ఇలాటి పొరబాట్లు జరగవు కదా, విజయావంటి సంస్థ తీసిన సినిమాల్లో కీలకమైన సన్నివేశాల్లో కూడా ముఖ్యపాత్రధారులు కనబడలేదేం అన్న అనుమానం వస్తోందా? దానికో కారణం వుంది. గుండమ్మకథలో వేసినవారందరూ ఒకప్పుడు విజయా నెలజీతగాళ్లయినా, పోను పోను బిజీ ఆర్టిస్టులయిపోయారు. వారందరి దగ్గరా కాంబినేషన్ కాల్షీట్లు తీసుకుని షెడ్యూల్ చేయాలంటే షూటింగు చాలా లేటవుతుంది. స్క్రిప్టు రెడీ అయ్యాక అంతకాలం వెయిట్ చేయడమంటే చక్రపాణిగారికి యిష్టంలేదు. స్టూడియో వాళ్లదే కదా. అందుకని స్టూడియో ఫస్ట్‌ఫ్లోర్‌లో గుండమ్మ యిల్లు, హాలు, హాలులో మెట్లు, మెట్లపైన పై అంతస్తుకు పోయే వరండా సెట్టు వేసి పెట్టుకున్నారు. ఆ ఫ్లోర్ వేరే వాళ్లకు ఎవరికీ అద్దెకు యివ్వకుండా అట్టేపెట్టుకున్నారు. సినిమాలో చాలాభాగం ఆ హాల్లోనే తీసేశారు. ఏ కారెక్టరు వచ్చినా ఆ హాల్లోనే. కాల్షీట్లు ముందు తీసుకోలేదు కదూ. అందువల్ల ప్రతీరోజూ పొద్దున్నే అందరికీ ఫోన్లు కొట్టి ఎవరు ఖాళీగా వున్నారో చూసుకోవడం, వాళ్లని వచ్చేయమనడం. ఇలా ఎవరు దొరికితే వాళ్ల కాంబినేషన్‌తో సీన్లు షూట్ చేసేశారు.
పూర్తి స్క్రిప్టు చేతిలో వుంది కాబట్టి, స్టూడియో వాళ్లదే కాబట్టి యిది సాధ్యపడింది. ఇలా చేసినా 1961 ఫిబ్రవరిలో కథా చర్చలు ప్రారంభమైన ఈ సినిమా ఆ ఏడాది డిసెంబరు పాటికి సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కుంటినడక నడిచింది. కారణం మరేమీ లేదు, కాంబినేషన్ ఆర్టిస్టులు దొరకలేదు. ఈ కారణాలవల్లనే ముఖ్యమైన సీన్లలో ముఖ్యపాత్రధారులు మిస్సవుతారు. పెళ్లిళ్లు జరిగినప్పుడు కుటుంబసభ్యులు సైతం ఎక్కడా కానరారు. కెవి రెడ్డిగారికి గుండమ్మకథ అస్సలు నచ్చలేదుట. హిట్ కావడంతో 'జనం ఆ సినిమా ఎలా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు' అని అంటూండేవారట. విజయా వారి అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ తమిళ వెర్షన్లు హిట్ అయ్యాయి కానీ గుండమ్మ కథ మాత్రం తమిళంలో ఫెయిలయింది.
ఈ సినిమా తమిళ వెర్షన్ ‘‘మనిదన్ మారవిల్లయ్’’ను సైమల్టేనియస్‌గా తీసి దీనితో పాటే రిలీజ్ చేశారు. సావిత్రి, జమున, రంగారావు, విజయలక్ష్మి, నాగేశ్వరరావు, హరనాథ్ (రాజు పేరుతో) వాళ్ల పాత్రలు వాళ్లే వేసుకున్నారు. ఎన్టీయార్ పాత్ర జెమినీ గణేశన్‌కు, సూర్యకాంతం పాత్ర సుందరీబాయికి, రమణారెడ్డి పాత్ర సారంగపాణికి యిచ్చారు. చక్రపాణి తెలుగు వెర్షన్‌కి డైరక్టరుగా కమలాకర వారి పేరు వేయించి, తమిళ వెర్షన్‌కి ఆయన పేరు వేసుకున్నారు. ఇంతా చేసి తమిళ వెర్షన్ ఫెయిలయింది. చక్రపాణిగారు డైరక్ట్ చేసిన గుణసుందరి కథ తమిళ వెర్షనూ ఫెయిలే! ఈ గుండమ్మకథలో వున్న తెలుగు నేటివిటీ తమిళంలో మిస్సయిందనుకోవాలి.
18 ఏళ్ల తర్వాత విజయా వాళ్లే హిందీలో ‘‘స్వయంవర్’’ (1980) పేరుతో సంజీవ్ కుమార్, శశి కపూర్, విద్యా సిన్హా, మౌసమీ చటర్జీలతో తీశారు. హిందీలో తీసినపుడు డైరక్టరు పి. సాంబశివరావు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పైన చెప్పినట్లు హరనాథ్ పాత్ర ఎత్తివేశారు. జమున వెళ్లిపోయాక, గుండమ్మను ఏడిపించడానికి ఛాయాదేవి పాత్రను విజయలక్ష్మి బంధువుగా తీసుకుని వచ్చే బదులు రమణారెడ్డి, అతని భార్యనే వాడుకున్నారు. వాళ్లే యింట్లో తిష్టవేస్తారు. ఇక మిక్కిలినేని వగైరాలను కూడా తీసేశారు. శశి కపూర్ ఆ వూళ్లో ఉన్న ఒక స్నేహితుడు, అతని భార్య ద్వారా మౌసమీ చటర్జీని బుట్టలో పెడతాడు. స్నేహితుడి భార్య మౌసమీకి క్లాస్మేట్. శశి కపూర్ ఎవరో తనకు తెలియనట్లుగానే నటిస్తుంది. ఆ విధంగా అతను మాయమైనప్పుడు మౌసమీకి వాళ్ల ద్వారా తెలుసుకునే అవకాశం లేకుండా చేశారు. ఆ విధంగా తెలుగులో మిస్సయిన లాజిక్‌ను హిందీలో సరిచేశారు. చక్రపాణి మరణం తర్వాత విజయా వాళ్లే ఆ సినిమాను తీశారు. ఇంత జాగ్రత్తలు తీసుకున్నా, హిందీ సినిమా కూడా ఆడలేదు. మూల కథ అందించిన కన్నడ ‘‘మనె తుంబిద హెణ్ణు’ (1958) కూడా మరీ హిట్టేమీ కాదు. గుండమ్మ కథను తెలుగువాళ్లే సొంతం చేసుకున్నారని చెప్పుకోవాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)