హీరోయిన్ త్రిష నిన్నటికి నిన్న ఒక్క ట్వీట్ తో కాస్త కలకలం రేపింది. మెగాస్టార్-కొరటాల శివ సినిమాలో తాను చేయడం లేదంటూ ట్వీట్ చేసింది త్రిష. చేయడం లేదని ట్వీట్ చేయడం మాత్రమే కాదు, ముందు ఒక మాట తరువాత ఒక మాట అంటూ ఓ కామెంట్ కూడా యాడ్ చేసింది. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ గా మారింది.
మెగాస్టార్ స్వంత బ్యానర్ మీద నిర్మాణమవుతున్న సినిమా ఇది. అందువల్ల అసలు ముందు ఏమని మాటిచ్చారు?తరువాత ఏం మార్చారు?అన్నది అసలు పాయింట్. ముందుగా చెప్పని అభ్యంతరకరమైన సీన్లు ఏమైనా వున్నాయా? అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది కొరటాల శివ సినిమా. అలాంటి పిచ్చి వ్యవహారాలు వుండవు.
రెమ్యూనిరేషన్ విషయంలో ముందు ఓకె అని తరువాత, అంత ఇవ్వలేమని, వర్క్ త్వరగా, వీలయినంత తక్కువ కాల్ షీట్లలో ఫినిష్ చేస్తామని, అందువల్ల పారితోషికం కాస్త తగ్గించుకోమని అడిగి వుంటారని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా నయనతార, త్రిష, వీళ్లంతా రెమ్యూనిరేషన్ దగ్గర అస్సలు రాజీపడరు. అందువల్ల అదే పాయింట్ తో ప్రాజెక్టు నుంచి త్రిష తప్పుకుని వుంటుందని వినిపిస్తోంది.
ఇదే సమయంలో ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ కూడా వినిపిస్తోంది. కథను మొదట నెరేట్ చేసినపుడు, ఒక్క హీరోయిన్ నే వుంటదని చెప్పారని, ఇప్పుడు రామ్ చరణ్ పాత్ర ను ఇంప్రూవ్ చేసినపుడు, అతనికి మరో హీరోయిన్, ఓ డ్యూయట్ యాడ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఎప్పుడయితే యంగ్ హీరోయిన్ ను తీసుకుస్తే, ఆమె ముందు త్రిష పాత్ర కాస్తయినా డౌన్ అయ్యే అవకాశం వుంది. ఈ మార్పు తెలిసే త్రిష ప్రాజెక్టు నుంచి తప్పుకుందని మరో మాట వినిపిస్తోంది.
ఏమయినా మెగాస్టార్ ప్రాజెక్టుకు ఇది చిన్న బ్రేక్ నే అనుకోవాలి.