ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికల ప్రక్రియపై హై కోర్టులో పిటిషన్ వేసిన తెలుగుదేశం పార్టీకి ఝలక్ తప్పలేదు. ఏవో సాకులు చెప్పి.. ఎన్నికల ప్రక్రియను సాగదీయాలని, వాయిదా వేయించాలని తెలుగుదేశం పార్టీ శతథా ప్రయత్నిస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు కాస్తా నవ్వులపాలవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా విమర్శించింది. దీని మీద కోర్టుకు కూడా వెళ్లింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంలో అధికారులు లేట్ చేశారని, దీంతో కొన్ని చోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారంటూ టీడీపీ తరఫున ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంలో కోర్టు సానుకూలంగా స్పందించలేదు.
ఆ పిటిషన్ ను కొట్టి వేయడంతో పాటు, రాజకీయాలకు కోర్టును వేదికగా మార్చొద్దు అంటూ బుద్ధా వెంకన్నకు చీవాట్లు పెట్టింది హై కోర్టు. అసలు ఈ పిటిషన్ ఎందుకు వేసినట్టు? ఈ విషయంలో బుద్ధా వెంకన్నకు ఏ సంబంధం? అని కోర్టు ప్రశ్నించిందట.
తమకు కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారని, దాని వల్ల తాము నామినేషన్ వేయలేకపోయినట్టుగా ఎవరైనా కోర్టుకు రావొచ్చని, అయితే రాజకీయ ఆరోపణలను కోర్టుకు తెచ్చి విచారించాలని అనడం ఏమటని ప్రశ్నించింది న్యాయస్థానం. నిజంగా అలా జరిగి ఉంటే, అభ్యర్థులు కోర్టుకు రావాలి తప్ప, ఏ అర్హతతో బుద్ధా వెంకన్న కోర్టుకు వచ్చినట్టు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు ఆయన తరఫు లాయర్ వద్ద సమాధానాలే లేకపోయినట్టుగా ఉన్నాయి. తమ ప్రతి రాజకీయ విమర్శకూ కోర్టుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీకి ఇది ఝలక్కే.