నామినేషన్లు దాఖలు అయ్యే నాటికే కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో చాలా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి నియోజకవర్గాల్లో ఎంపీటీసీల ఏకగ్రీవాలు గణనీయంగా ఉన్నాయి. అక్కడ చాలా ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే నామినేషన్లు చోటు చేసుకున్నాయి. అయితే కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన దాఖలాలూ ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంతో ఏకగ్రీవాలపై మరింత స్పష్టత వస్తున్నట్టుగా ఉంది.
ఈ క్రమంలో..ఏకగ్రీవాల్లో ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం టాప్ పొజిషన్లో ఉంటూ వచ్చింది. అక్కడ 65 ఎంపీటీసీ సీట్లు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యాయి. 71కి గానూ 65 సీట్లలో ఒకే నామినేషన్ దాఖలు కావడంతో.. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం అయ్యాయి.
అయితే మాచర్ల ను మించింది చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉండేది ఈ నియోజకవర్గం పరిధిలోనే. అయితే అక్కడ ఏకంగా 76 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 95 ఎంపీటీసీలున్నాయట ఈ నియోజకవర్గంలో. వీటిల్లో 76 సీట్లకు సంబంధించి ఒకే ఒక నామినేషన్ మిగిలాయట. ఈ నేపథ్యంలో అత్యధిక ఏకగ్రీవాల విషయంలో చంద్రగిరి టాప్ పొజిషన్లో నిలుస్తోంది. ఇక శనివారం కూడా నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఏకగ్రీవాలు ఉండవచ్చునేమో!