ఆడలేక మద్దెల ఓడు అన్నది ఏపీలోని విపక్ష నేతలకు బాగా వర్తిస్తుందేమో. ఓ వైపు వెల్లువలా నామినేషన్లు దాఖలు అవుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కలతో సహా చెబుతోంది. మరో వైపు అన్ని పార్టీలూ పోటీలో ఉన్నాయి.
విషయం ఇలా ఉంటే మా నామినేషన్లు తీసుకోవడంలేదంటూ నానా యాగీ చేస్తూ అధికార పార్టీ మీద ఏడుస్తున్న టీడీపీ పక్కన బీజేపీ కూడా చేరిపోయింది. అసలు ఆ పార్టీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్లు నోటా కంటే తక్కువ. పైగా ఒక్క సీటూ రాలేదు. అటువంటి బీజేపీ నామినేషన్లను ఎవరు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డుకుంటారు. లాజిక్ కి కూడా అందకుండా ఆరోపణలు చేయాలి కాబట్టి చేస్తామన్న తీరులో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు.
ఏపీలో ఎన్నికల సంఘం పూర్తిగా వైసీపీకి దాసోహం అయిందంట. అందువల్ల ఎన్నికలు సజావుగా జరవవు, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కన్నా వారు కోరుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆద్వర్యంగా స్థానిక ఎన్నికలు జరిపించాలని మరో వింత డిమాండ్ ని ముందు పెట్టారు.
దేశంలో లోక్ సభ ఎన్నికలు జరిపించే ఎన్నికల సంఘం ముందు లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరిపించాలని కోరడం విచిత్ర రాజకీయ డిమాండే. మరి రాజ్యాంగంలోనే అలా సవరణలు తెస్తే సరిపోతుందేమో. దేశంలో 28 రాష్ట్రాలు, అనేక కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏడాది పొద్దూ ఇలా గల్లీ ఎన్నికలు జరిపించడమేనా కేంద్ర ఎన్నికల సంఘం పని అన్నట్లుగా కన్నా వారి తీరు ఉంది.
మరి రాష్ట్రాలు ఎందుకు, వాటి అధికారాలు ఎందుకు. దీనికి కూడా జవాబు ఆయన చెబితే బాగుంటుందేమో. ఏది ఏమైనా టీడీపీ వారు గోల చేస్తున్నారు కాబట్టి మేము కూడా వైసీపీ మీద అరచి గోల పెడితే ఓ పని అయిపోతుందన్నది కన్నా రాజకీయంగా కనిపిస్తోంది. పైగా ఎటూ ఓడితే ఆ నిందను వారి మీదనే తోసేయవచ్చు అన్న స్వార్ధ రాజకీయమూ ఇందులో ఉంది.