అన్యాయంపై పోరాడేందుకు ఒకొక్కరిది ఒక్కో మార్గం. మరీ ముఖ్యంగా ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయిలు వివిధ రీతుల్లో తమ పోరాటాన్ని సాగిస్తుండటం నిత్యం చూస్తుంటాం. కొందరేమో ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్షకు దిగితే, మరికొందరమో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ యువతి స్థానిక సంస్థల ఎన్నికలను అస్త్రంగా ప్రయోగించింది.
తనను ప్రేమించి మోసగించిన వైఎస్సార్‌సీపీ నేత కుమారుడి తీరును నిరసిస్తూ ఓ యువతి వినూత్న పంథా చేపట్టింది. అమలాపురం పురపాలక సంఘంలో కీలకంగా వ్యవహరించే ఆ నేత కుమారుడు తనను ప్రేమించి మోసగించాడని, దాన్ని ఆ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు మున్సిపల్ ఎన్నికల్లో ఆ యువతి పోటీకి దిగింది.
అమలాపురంలోని సూర్యానగర్‌కు చెందిన బైరిశెట్టి రేణుక తన తల్లి ధనలక్ష్మితో కలిసి బీసీ మహిళకు కేటాయించిన 15వ వార్డులో నామినేషన్ వేశారు. పోలీసులు, వైసీపీ నేతల నుంచి తనకు న్యాయం జరగకపోవడం వల్లే, చివరికి ఎన్నికల మార్గం పట్టాల్సి వచ్చిందని ఆ యువతి తెలిపింది. ఎంబీఏ చదువుకుంటున్న రేణుక స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగింది. తనకు జరిగిన అన్యాయం గురించి గడపగడపకూ వెళ్లి వివరించి ప్రేమికుడికి బుద్ధి చెబుతానని ఆ యువతి హెచ్చరిస్తోంది.
ఈ వార్డు నుంచి వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి కోడలు సత్యశైలజ పోటీకి దిగారు. ఆడకూతురు ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లి వైసీపీ నేత కుమారుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని చెబుతుండడం…సత్యశైలజ విజయావకాశాలపై ప్రభావం పడుతుందనే భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది.