బాసర కాదు బాసూ.. అగ్నిపథ్ సంగతి చెప్పు పవనూ!

పవన్ కల్యాణ్ నుంచి నిన్న రెండు ప్రెస్ నోట్లు వెలువడ్డాయి. రెండూ తెలంగాణకు సంబంధించినవే. ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల గురించి, రెండోది బాసర ట్రిపుల్ ఐటీ గొడవ గురించి. రెండింటిలోనూ విద్యార్థులు…

పవన్ కల్యాణ్ నుంచి నిన్న రెండు ప్రెస్ నోట్లు వెలువడ్డాయి. రెండూ తెలంగాణకు సంబంధించినవే. ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల గురించి, రెండోది బాసర ట్రిపుల్ ఐటీ గొడవ గురించి. రెండింటిలోనూ విద్యార్థులు కామన్. ఈ రెండు సమస్యలపై ట్విట్టర్లో స్పందించిన పవన్.. నాలుగైదు వాక్యాలతో ప్రెస్ నోట్లు విడుదల చేశారు. అయితే రెండింటినీ తరచి చూస్తే పవన్ కల్యాణ్ మనస్తత్వం ఏంటో స్పష్టమవుతుంది.

బాసరలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వారి కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలి. ట్రిపుల్ ఐటీలను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రభుత్వం సహకరించాలి. తెలంగాణ ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలి. ఆ దిశగా కృషి చేయాలంటూ సుద్దులు చెప్పారు పవన్.

కట్ చేస్తే నిన్న సికింద్రాబాద్ గొడవల వ్యవహారంలో.. ఆ ఘటన తననెంతో కలచి వేసిందని, ఆవేదన చెందానని మాత్రమే రాసుకొచ్చారు. అలాంటి ఘటనలు దురదృష్టకరం అన్నారు. మృతిచెందిన యువకుడి కుటుంబానికి నా సానుభూతి, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ మూడు ముక్కల్లో ముగించారు. ఇదెక్కడి రెస్పాన్స్.

రెండిట్లో ఎంత తేడా..

బాసర విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత సలహాలిచ్చిన పవన్, సికింద్రాబాద్ అల్లర్లకు కారణమైన అగ్నిపథ్ పథకాన్ని ఏమాత్రం తప్పుబట్టలేదు. ఆ పథకం విషయంలో కేంద్రానికి కనీసం పునరాలోచించాలన్న సూచన కూడా చేయలేదు. నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తే బుల్లెట్ల వర్షం ఎందుకు కురిపించారంటూ నోరు మెదపలేదు. 

ఏం.. సికింద్రాబాద్ వ్యవహారంలో బాధితులపైకి దూసుకొచ్చిన తూటాలు, కేంద్ర బలగాలవనేసరికి పవన్ కి నోరు పడిపోయిందా..? శ్రీశ్రీ సాహిత్యం గుర్తు రాలేదా, తిలక్ మాటలు ఉటంకించాలని అనిపించలేదా..? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా..?

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అల్లాడిపోతున్నారు, వారిని కాపాడండి అంటూ బయటకొచ్చిన పవన్.. అగ్నిపథ్ పై తన స్టాండేంటో చెప్పాలి కదా..? కనీసం ఇలాంటి వ్యవహారాల్లో అయినా కేంద్రాన్ని ఎదిరించకపోతే.. ఇక పవన్ కల్యాణ్  ఎందుకు..? పాతికేళ్ల పోరాటం ఎందుకు..? అన్ని సమస్యలపైనా ఒకేలా స్పందించలేని లక్షణం ఉన్నవారెవరూ నాయకులు కాలేరు. అది పవన్ విషయంలో మరోసారి రుజువైంది. ఆయన ఎప్పటికీ నాయకుడు కాలేరు.