అంటే సుందరానికి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ జనాలు రాలేదు. మేజర్ సినిమా కూడా హిట్టన్నారు. కానీ వసూళ్లు లేవు. అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా బాగుందని అంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమాకు లెక్షన్లు లేవు. తాజాగా విడుదలైన విరాటపర్వం సినిమా కూడా బాగుందంటున్నారు. కానీ ఆ మూవీకి వచ్చిన మొదటి రోజు వసూళ్లు చాలా తక్కువ.
థియేటర్లలో కనిపిస్తున్న ఈ డౌన్ ట్రెండ్ ను టాలీవుడ్ నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఓవైపు టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ, ఆడియన్స్ థియేటర్ల వైపు రావడం లేదనే విషయాన్ని టాలీవుడ్ జనాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నారు. తమ సినిమాలు సక్సెస్ అయ్యాయని ఓవైపు గొప్పగా చెప్పుకుంటూనే.. మరోవైపు ఆర్థికంగా నష్టపోయినందుకు లోలోపల కుమిలిపోతున్నారు.
తిలా పాపం.. తలా పిడికెడు..
టాలీవుడ్ లో కనిపిస్తున్న ఈ విపరీత పోకడకు ఓ విధంగా పరిశ్రమే కారణం అని చెప్పాలి. కరోనా/లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయామంటూ పెద్ద సినిమాల కోసం రేట్లు పెంచుకున్నారు.
తీరా పెద్ద సినిమాల కోటా ముగిసి, చిన్న, మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చే టైమ్ కు ప్రేక్షకులు మొహం చాటేశారు. టికెట్ రేట్లు తగ్గించినా అవి మాత్రమే చేస్తే సరిపోవంటున్నారు.
ఓవైపు టికెట్ రేట్ల ఇష్యూతో పాటు ఆడియన్స్ టేస్ట్ కూడా మారిన విషయాన్ని టాలీవుడ్ గమనించాలి. ఎంతో బజ్ ఉంటే తప్ప, ప్రేక్షకుడు ఇల్లు విడిచి థియేటర్ లోకి రావడం లేదు.
థియేటర్ కు వెళ్లి ఓ సినిమా చూడాలంటే లార్జర్ దేన్ లైఫ్ మూవీ అయినా అయ్యుండాలి, లేదా ఫుల్ లెంగ్త్ వినోదమైనా ఉండాలి. ఈ రెండూ లేని సినిమాల వైపు సగటు ప్రేక్షకుడు కన్నెత్తి చూడడం లేదు. కొంతమంది స్టార్ హీరోల సినిమాలు వీటికి మినహాయింపు.
నిర్మాతలు ఇప్పుడే చేయాలి..
మన టాలీవుడ్ నిర్మాతలు అంత అమాయకులేం కారు. ఇప్పటికే ఈ దిశగా ఎవరి రీసెర్చ్ వాళ్లు చేసుకున్నారు. దిల్ రాజు అయితే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ను పూర్తిగా అర్థం చేసుకొని, తన అప్ కమింగ్ సినిమాలకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించబోతున్నాడు. అటు మరో పెద్ద నిర్మాత అల్లు అరవింద్ కు కూడా విషయం పూర్తిగా అర్థమైంది. అందుకే ఆయన గోపీచంద్ సినిమాకు భారీగా టికెట్ రేట్లు తగ్గించేశారు.
తమ సినిమాలకు లాభాలు రాకపోయినా ఫర్వాలేదు. ముందు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలనే కసి టాలీవుడ్ నిర్మాతల్లో కనిపిస్తోంది. అయితే ఈ కసి దిల్ రాజు, అరవింద్ లాంటి ఒకరిద్దరు నిర్మాతల్లో ఉంటే సరిపోదు. అందరిలో ఉండాలి. అంతా తలో చేయి వేయాలి. అదే టైమ్ లో అంతా టికెట్ రేట్లు తగ్గించేసినా పని జరగదు.
తమ సినిమా థియేటర్లలో కచ్చితంగా ఆడుతుందనే నమ్మకం ఉంటేనే టికెట్ రేట్లు తగ్గించి మరీ ఆడియన్స్ ను ఆహ్వానించాలి. ఏమాత్రం అనుమానం ఉన్నా, అస్సలు మొహమాటపడకుండా ఓటీటీకి ఇచ్చేయాలి. ఆమధ్య రిలీజైన శేఖర్, నిన్న రిలీజైన గాడ్సే సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి.
సో.. ఇప్పుడు టాలీవుడ్ ఉమ్మడి ఎజెండా ఒకటే ఉండాలి. ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలి. వీలైతే కుటుంబాలు కదిలి వచ్చేలా ఆఫర్లు ప్రకటించాలి. అలా జరగాలంటే టికెట్ రేట్లు తగ్గించడంతో పాటు, మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని విడుదల చేయాలి. అప్పుడు మాత్రమే పదేళ్ల కిందటి కళకళలాడే సినీవాతావరణం మళ్లీ కంటికి కనిపిస్తుంది.
లేదంటే.. టాలీవుడ్ థియేట్రికల్ వ్యవస్థ కొన్ని పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితమౌతుంది. చిన్న-మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితి గాల్లో దీపంగా మారుతుంది.