ఎన్టీఆర్ బయోపిక్ పై గత కొద్ది నెలలుగా బోలెడు గ్యాసిప్ లు, అనేక సందేహాలు. ముఖ్యంగా లక్ష్మీపార్వతి, రెండో ఆగస్టు సంక్షోభం, ఇంకా.. ఇంకా. ఇప్పుడు వీటన్నింటి మీదా బాలయ్య క్లారిటీ ఇచ్చేసారు. బాలయ్య మాటల ప్రకారం..
బయోపిక్ లో బాలయ్య క్యారెక్టర్ వుండదు. సంభాషణల్లో ప్రస్తావన మాత్రం వుంటుంది. కానీ బాలకృష్ణ చిన్నప్పటి క్యారెక్టర్ లో మాత్రం ఆయన మనవడు కనిపిస్తాడు. అందరూ అనుకున్నట్లు బోలెడు క్యారెక్టర్లు బాలయ్య వేయలేదట. పైగా కొన్ని క్యారెక్టర్లు చిత్రీకరించినా, కట్ చేసి పక్కన పెట్టారట.
సినిమా అన్నది మొదటి ఆగస్టు సంక్షోభం తరవాత ఎన్టీఆర్ గద్దె ఎక్కుడం వరకే వుంటుంది. రెండో ఆగస్టు సంక్షోభం వుండదట. అంటే చంద్రబాబు వెన్నుపోటు, వైశ్రాయ్ వంటి వ్యవహారాలు వుండవన్నమాట. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన భార్య బసవతారకం శివైక్యం అయ్యేవరకే సినిమా వుంటుందట.
సినిమాలోని కొన్ని సీన్లను బాలయ్య డైరక్ట్ చేసారట. ఆయనే అంగీకరించారు ఈ విషయాన్ని. ఇక బాలయ్య చెప్పిన నమ్మలేని నిజాలు కూడా కొన్ని వున్నాయి. దర్శకుడు తేజ ఆయన అంతట ఆయనే తాను ఈ భారం మొయలేను అని తప్పుకున్నారట.
నిజానికి తేజకు నిర్మాణ వ్యవహారాలు చూసే బాలయ్య తోడల్లుడికి గొడవలు జరిగి తప్పుకున్నారని వార్తలు అప్పట్లో వినవచ్చాయి. దర్శకుడు క్రిష్ ముంబాయిలో తనంతట తాను బయోపిక్ డైరక్ట్ చేస్తారని అడిగారట. నిజానికి తేజ తరువాత క్రిష్ ను పట్టుపట్టి బాలయ్యే ఒప్పించారని వార్తలు విన వచ్చాయి.
మొత్తంమీద ఎన్టీఆర్ బయోపిక్ బాగా వచ్చిందన్న హుషారులో బాలయ్య మీడియాతో హుషారుగా మాట్లాడారు.. పనిలో పనిగా ఆర్జీవీ తీసే బయోపిక్ ను లైట్ తీసుకోవాలన్నారు.