జనసేన గగ్గోలు: మమ్మల్ని కొడుతున్నారు మొర్రో.!

స్థానిక ఎన్నికల్లో గ్రూపు తగాదాలు స్పష్టంగా తెరపైకొస్తుంటాయి. పార్టీలకు సంబంధించిన గొడవల కంటే, స్థానికంగా వుండే గొడవలే.. ఈ గందరగోళానికి కారణమవుతుంటాయన్నది నిర్వివాదాంశం. ఓ పార్టీ మద్దతు దక్కకపోతే, అప్పటికప్పుడు పార్టీ మార్చేసి, ఇంకో…

స్థానిక ఎన్నికల్లో గ్రూపు తగాదాలు స్పష్టంగా తెరపైకొస్తుంటాయి. పార్టీలకు సంబంధించిన గొడవల కంటే, స్థానికంగా వుండే గొడవలే.. ఈ గందరగోళానికి కారణమవుతుంటాయన్నది నిర్వివాదాంశం. ఓ పార్టీ మద్దతు దక్కకపోతే, అప్పటికప్పుడు పార్టీ మార్చేసి, ఇంకో పార్టీ మద్దతు కూడగడ్తుంటారు. ఇలాంటివి స్థానిక రాజకీయాల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడీ రాజకీయాల్ని పట్టుకుని, జనసేన పార్టీ ‘సింపతీ’ పొందాలని చూస్తోంది స్థానిక ఎన్నికల్లో.

అసలు, జనసేన పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తోంది.? ఆ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరు.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావడంలేదు. స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా కొంతమంది సినీ అభిమానులు నామినేషన్లు దాఖలు చేసేస్తోంటే, పార్టీకి చెందిన నేతలు తలపట్టుక్కూర్చుంటున్నారు. మొబైల్‌ ఫోన్లలో స్థానికంగా వున్న గొడవల్ని చిత్రీకరించి.. ఆ పార్టీ దాష్టీకం.. ఈ పార్టీ దాష్టీకం.. అంటూ నానా యాగీ చేస్తున్నారు జనసేన కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు.

స్థానిక ఎన్నికల్లో జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తోన్న విషయం విదితమే. ఆయా స్థానాల్లో స్థానికంగా బీజేపీ – జనసేన ఓ అవగాహనతో ఓ అభ్యర్థిని నిలబెడితే, ఆ అవగాహనకు తూట్లు పొడిచి మరీ ఇరు పార్టీల నుంచీ కొందరు నామినేషన్లు దాఖలు చేస్తుండడంతో.. రెండు పార్టీల మధ్యా గందరగోళం మరింత ముదిరి పాకాన పడుతోంది.

నిజానికి, స్థానిక ఎన్నికలు జనసేన పార్టీకి మంచి అవకాశంగానే చెప్పుకోవాలి. ఈ సమయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇంకాస్త ఫోకస్‌ పెడితే, గెలుపోటముల సంగతి ఎలా వున్నా.. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఆస్కారమేర్పడుతుంది. అసలు జనసేన పార్టీకి ‘ముఖ్య నేతలు’ అనదగ్గవారెవరికీ జనంలోకి వెళ్ళి ఓట్లు సాధించేంత సీన్‌ లేదు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో బిజీగా వున్నారు.. ఆయనసలు స్థానిక ఎన్నికల గురించి గట్టిగా మాట్లాడటమే లేదు. నాగబాబు కేవలం సోషల్‌ మీడియాకి పరిమితమైపోయారు.. అక్కడా టైవ్‌ు పాస్‌ ట్వీట్లు మాత్రమే కన్పిస్తున్నాయి.

మొత్తమ్మీద, స్థానిక ఎన్నికల్లో కాస్తో కూస్తో జనసేనకు ఓట్లు పడితే.. అవి కూడా ‘మమ్మల్ని కొడుతున్నారు మొర్రో..’ అంటూ కొందరు చేస్తోన్న హడావిడి కారణంగా పడే సానుభూతి ఓట్లే అవుతాయేమో.!