ఇటీవలే రాయలసీమలో నారా లోకేష్ పాదయాత్ర ముగిసింది. చిత్తూరు జిల్లాలో పాదయాత్రను మొదలుపెట్టిన లోకేష్.. చాన్నాళ్ల పాటు రాయలసీమ జిల్లాల్లోనే పాదయాత్రను కొనసాగించాడు. ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపురం, కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాల మీదుగా సాగి.. లోకేష్ కోస్తా జిల్లాలోకి వెళ్లారు. మరి లోకేష్ సీమ జిల్లాల్లో చాలా ఫీట్లే చేశారు.
తన పేరు నారా లోకేష్ రెడ్డి అని చెప్పుకున్నంత పని చేశాడు. కడప జిల్లాలో రెడ్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాడు. ఆ కార్యక్రమంలో ఎవరో రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ తన పేరును లోకేష్ రెడ్డిగా చెప్పుకోవాలని కోరాడు!
తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో కూడా లోకేష్ పాదయాత్ర హైలెట్ కాలేదు కానీ, ఆయన కడప జిల్లాలో రెడ్లతో సమావేశాలు మాత్రం ఆసక్తిని రేకెత్తించాయి! మరి లోకేష్ అలా కడప జిల్లా రెడ్లను అంతలా పొగిడి, పొగిడి.. తను, వారు వేర్వేరు కాదన్నట్టుగా చెప్పి వెళ్లిన కొన్ని రోజులకే.. ఇప్పుడు చంద్రబాబు రాయలసీమలో తిరుగుతున్నారు! మరి లోకేష్ పర్యటనల జరిగిన చోట చంద్రబాబు కాస్తైనా గ్యాప్ ఇవ్వాల్సిందేమో!
అయితే స్థూలంగా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల పర్యటనలు ఒకరు తిరుగుతున్న చోట మరొకరు తిరగకూడదని ఒప్పందం చేసుకున్నట్టుగా ఉన్నారనేది మొదటి నుంచి నడుస్తున్న కథే. పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో తిరుగుతున్నారు కాబట్టి.. అటు వైపు చంద్రబాబు వెళ్లరు.
లోకేష్ పాదయాత్ర జరుగుతున్న వైపుకు పవన్ కల్యాణ్ రారు. మరి వారిద్దరూ తిరుగుతుంటే చంద్రబాబు ఊరికే కూర్చోలేరుగా! అందుకే.. ఇక చేసేది లేక పవన్ కల్యాణ్ ను టూరుకు డిస్ట్రబెన్స్ లేకుండా లోకేష్ ఇటీవలే వెళ్లి వచ్చిన చోట్లకు తను వెళ్తున్నట్టుగా ఉన్నారు!