పెగాసస్ అనే కొండ తవ్వకాన్ని అధికార పార్టీ వైసీపీ స్టార్ట్ చేసింది. కనీసం ఎలుకనైనా పట్టుకుంటుందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పెగాసస్‌పై ఏపీ స్పీకర్ హౌస్ కమిటీ వేయడం అంతా నాటకీయంగా జరిగింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఫోన్లను ట్యాప్ చేసే పెగాసస్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కొన్నట్టు, సంబంధిత ఏజెంట్లు తనకు చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు. తననూ కొనాలని కోరారని ఆమె చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.
అప్పటికే దేశ వ్యాప్తంగా పెగాసస్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. పలువురు ప్రముఖులు వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా పెగాసస్‌ను వినియోగించడంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.
మమతాబెనర్జీ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని, అదేదో ఇప్పుడే బయటపడ్డట్టు జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టింది. గతంలో తాము ప్రతిపక్షంలో వున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌లతో ఎలా ఇబ్బంది పడ్డామో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు చట్టసభ దృష్టికి తీసుకెళ్లారు. సభ్యులందరి కోరిక మేరకు ఫోన్ ట్యాపింగ్ నిగ్గు తేల్చేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో హౌస్ కమిటీ వేశారు.
ఏపీ శాసనసభా సంఘం (హౌస్ కమిటీ) బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్‌రావు, మద్దాళి గిరిధర్ సమావేశమై ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
డేటా చోరీకి సంబంధించి సమాచారాన్ని కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో సేకరిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మీడియా మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సాధికార సర్వే ద్వారా సమాచారం సేకరించి అప్రజాస్వామిక విధానాలు అవలంభించారన్నారు. దోషులను ప్రజల ముందు నిలబెడతా మన్నారు. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగిందన్నారు.
వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. చంద్రబాబునిర్వాకాన్ని ఎత్తి చూపుతామన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఆరోపణలు చేసిన విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. జూలై 5 న కమిటీ మళ్ళీ సమావేశం అవుతుందన్నారు. మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సభ ముందు పెడతామని హెచ్చరించారు.
వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై చాలా ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ఇంత వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా నిరూపించి దాఖలాలు లేవు. దీనికి అనేక కారణాలున్నాయి.
పెగాసస్ వ్యవహారం పూర్తిగా ఇల్లీగల్. ఇందులో సాక్ష్యాలు దొరికే అవకాశాలే లేవు. అలాంటప్పుడు ఏ విధంగా నిరూపిస్తుందనేది భేతాళ ప్రశ్న. హౌస్ కమిటీ వేసి, చివరికి ఎలుకనైనా పట్టుకోగలుగుతుందా? అని ప్రతిపక్షాల వెటకారం చేస్తున్నాయి.