ఈ కథ ఇప్పటిది కాదు.. గత ఐదారేళ్లుగా జగన్ ను ఫాలో కావడమే చంద్రబాబు నాయుడి విజన్ గా మారింది. మాటెత్తితే తనది 40 యేళ్ల అనుభవం అని, జగన్ కు ఎలాంటి అనుభవం లేదని.. ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం అధినేత. తనను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలంటూ చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు ఓటు అడగడానికి తన అనుభవమే అర్హతగా చెప్పుకున్నారు. తన ఐదేళ్ల పాలనను చూసి ఓటు వేయాలని అడగకుండా, తన 40 యేళ్ల అనుభవం చూసి ఓటేయాలని చంద్రబాబు నాయుడు అడుక్కోవడం ప్రహసనంగా నిలిచింది. దీంతో ప్రజలు తిరస్కరించేశారు కూడా!
కట్ చేస్తే.. ఇప్పుడు కూడా జగన్ నిర్ణయాలను కాపీ కొట్టడమే తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు నాయుడి విజన్ గా మారింది. అందుకు స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల అంశం కూడా ఒక ఉదాహరణగా నిలుస్తూ ఉంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించలేకపోతున్నందున, వీలైనంత త్వరగా ఎన్నికలను నిర్వహించాల్సి ఉందునా.. తన పార్టీ తరఫున వీలైనన్ని ఎక్కువ సీట్లను కేటాయించి బీసీలకు రిజర్వేషన్ల లోటును భర్తీ చేయబోతున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
బీసీలకు చట్టబద్ధంగా దక్కే రిజర్వేషన్లకు తోడు, పార్టీ తరఫున ప్రాతినిధ్యం కల్పించి వారికి 34 శాతం రిజర్వేషన్లను కల్పించబోతున్నట్టుగా జగన్ ప్రకటించారు. ఆ ఐడియా జగన్ ది. అయితే దీన్ని కాపీ కొడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రకటించారు! జగన్ ప్రకటన వచ్చిన 48 గంటలకు చంద్రబాబు నాయుడు దాని కాపీ ప్రకటన చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన చంద్రబాబు నాయుడు కూడా తన పార్టీ తరఫున బీసీలకు అదనపు ప్రాతినిధ్యం అని ఒక ప్రకటన చేసేశారు!
చంద్రబాబు నాయుడుకు సొంతంగా ఆలోచించడం తెలీదు, ఇన్నేళ్లూ పచ్చ కోటరీ ఆయనను ఏదోలా నడిపించింది, అయితే వైఎస్ ఉన్నప్పుడు, ఆయన తనయుడు ఊపు మీదకు వచ్చాకా.. వారిని బీట్ చేయడం పచ్చ కోటరికి కూడా చేత కావడం లేదు. ఈ నేపథ్యంలో వారిని కాపీ కొట్టడం మాత్రమే.. చంద్రబాబుకు, ఆయన కోటరికి చేతనవుతున్న విజన్ అనే అభిప్రాయాలను చంద్రబాబు తాజా ప్రకటన మరింత బలపరుస్తూ ఉంది.
తను అధికారంలోకి వచ్చాకా వైఎస్ ప్రారంభించిన పథకాలన్నింటినీ కొనసాగించినట్టుగా చంద్రబాబు నాయుడు ఇటీవల చెప్పుకున్నారు. అయితే జగన్ మాత్రం తను ప్రారంభించిన పథకాలను ఆపేస్తున్నాడని ఆయన వాపోయారు. మరి వైఎస్ ప్రారంభించిన పథకాల్లో సత్తా ఉంది కాబట్టి, వాటిని ఆపేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు వాటిని కొనసాగించారు. చంద్రబాబు ప్రారంభించినవి పప్పు బెల్లాల పథకాలు, ఓట్లకు నోట్ల పథకాలు.. కాబట్టి జగన్ వాటిని మరో ఆలోచన లేకుండా ఆపేయగలిగారు. అవి ఆగిపోయినా జగన్ ను ఎవరూ అడగడం లేదు, చంద్రబాబు తప్ప! ఏదేమైనా.. జగన్ ముందు చంద్రబాబు నాయుడు వెలవెలబోవడం మాత్రం అడుగడుగునా కొనసాగుతూ ఉంది. దీనికి బదులుగా క్రియాశీల రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోవడం మంచిదేమో! అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.