ఇన్నాళ్లకు తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నాయకుడనే సినిమా డైలాగ్ ని అక్షరాలా ఆచరణలో పెట్టారు పవన్ కల్యాణ్. నిన్నమొన్నటి వరకూ తిరుపతి ఉప ఎన్నికలో సీటు మాకే కావాలంటూ మంకు పట్టిన…

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నాయకుడనే సినిమా డైలాగ్ ని అక్షరాలా ఆచరణలో పెట్టారు పవన్ కల్యాణ్. నిన్నమొన్నటి వరకూ తిరుపతి ఉప ఎన్నికలో సీటు మాకే కావాలంటూ మంకు పట్టిన పవన్ కల్యాణ్ ఎట్టకేలకు ఆ భారాన్ని దించేసుకున్నారు. సీటు కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన పవన్, ఇప్పుడు అలాంటి బెదిరింపులు, అలకలు, బతిమాలుకోవడాలు ఏదీ లేకుండానే ఆ సీటు వదిలేసుకున్నారు. తెలివిగా బీజేపీపై ఆ భారాన్ని పెట్టేసి పక్కకు తప్పుకున్నారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సీటుని బీజేపీ వదిలిపెట్టబోదని, జనసేన ఒత్తిడి పనిచేయదనే విషయం ఊహించిందే. అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంతో బీజేపీపై ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగింది. బడ్జెట్ కేటాయింపుల్లో విభజన హామీల్లో ఒక్కదాన్ని కూడా పట్టాలెక్కించకపోవడం మరో పెద్ద మైనస్. అన్నిటికీ మించి గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వంపై కసి ఎలా తీర్చుకోవాలా అని జనం ఆలోచిస్తున్న సందర్భం ఇది.

ఈ టైమ్ లో తిరుపతిలోనే కాదు, ఏపీలో ఇంకెక్కడ పోటీ చేసినా బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు. బీజేపీ జనసేనను వెంట బెట్టుకున్నా, ఇంకెవర్ని ప్రచారానికి దింపినా ఫలితం అదే. అందుకే పవన్ కల్యాణ్, ఈసారి తెలివిగా వ్యవహరించారు. సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన పాజిటివ్ ఫలితాలతో బీజేపీ మాత్రం వాపో, బలుపో తెలియకుండానే ఏపీ బరిలో దిగుతానంటోంది. ఏపీలో పార్టీపై పూర్తిగా వ్యతిరేకత పెరుగుతున్న ఈ దశలో బీజేపీ బరిలో దిగుతామనడం దుస్సాహసమేనని చెప్పాలి. అయితే పరువు దక్కించుకోవడం ఒక్కటే ప్రస్తుతం ఆ పార్టీ ముందున్న ఏకైక ఆప్షన్. కనీసం టీడీపీని వెనక్కు నెట్టినా బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థి గెలిచినంత సంబరపడుతూ పండగ చేసుకోవచ్చు.

పవన్ పై సెటైర్లు, ప్రశంసలు..

తిరుపతి పోటీలో జనసేనకు ఛాన్స్ లేకుండా, బీజేపీ అభ్యర్థి బరిలో దిగుతారని ప్రకటన వచ్చిన వెంటనే పవన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. త్యాగరాజు ఖాతాలో మరో నియోజకవర్గం అంటూ జోకులు పేలాయి. బీజేపీ దగ్గర పవన్ కల్యాణ్ పరపతి ఏమీ లేదని, వాళ్లు ఏది చెబితే దానికి తల ఊపేస్తారని విమర్శలు మొదలయ్యాయి.

జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే.. తిరుపతి అభివృద్ధే ముఖ్యమంటూ పవన్ స్టేట్ మెంట్ ఇవ్వడం జనసైనికులకు పుండుమీద కారం చల్లినట్టుగా ఉంది. రేపు రాష్ట్ర అభివృద్ధికోసం అంటూ రాష్ట్రం మొత్తం బీజేపీకే అప్పగిస్తారా అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. 2014లో పవన్ చేసింది అదే కదా అని సర్ది చెప్పుకున్నవారు కూడా ఉన్నారు.

ఇక పవన్ తెలివైన నిర్ణయం తీసుకున్నారని, పోటీలో లేకుండా తప్పుకుని పరువు నిలుపుకున్నారని మరికొంతమంది ప్రశంసిస్తున్నారు. ఏపీలో వైసీపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే విషయం స్థానిక ఎన్నికలతో రుజువైపోయిందని, అందుకే పవన్ వెనకడుగేశారని చెబుతున్నారు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ మాత్రం ఇన్నాళ్లకు ఓ మంచిపని చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. 

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జోగి బ్రదర్స్… జాతి రత్నాలు రివ్యూ