సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైమ్ లో బాలీవుడ్ నుంచి ఆఫర్ అందుకుంది రష్మిక. నిజానికి అందరు హీరోయిన్లలానే రష్మిక కూడా బాలీవుడ్ ఛాన్స్ వస్తే సినిమా చేయాలని అనుకుంది. ఆ దిశగా ప్రయత్నించి సక్సెస్ అయింది. అయితే మిషన్ మజ్ను అనే బాలీవుడ్ సినిమాలో రష్మికను మాత్రమే తీసుకోవాలని యూనిట్ నిర్ణయించుకోవడం వెనక ఓ చిన్న స్టోరీ ఉంది.
మిషన్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నలుగుర్ని అనుకొని, ఫైనల్ గా రష్మికకు ఫిక్స్ అయ్యాడట దర్శకుడు శాంతను. దీనికి అతడు చెప్పే రీజన్ డియర్ కామ్రేడ్ సినిమా. ఆ సినిమాలో రష్మిక లుక్స్, యాక్టింగ్ నచ్చి తన హిందీ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నానని వెల్లడించాడు.
స్పై థ్రిల్లర్ గా వస్తున్న మిషన్ మజ్నులో హీరోయిన్ పాత్రకు అమాయకమైన లుక్స్ ఉండాలి. అదే టైమ్ లో కథ ప్రకారం.. ఓ దశలో షాకిచ్చే వేరియేషన్ కూడా చూపించాలి. దీనికితోడు గ్లామరస్ గా కూడా ఉండాలి. ఈ లక్షణాలన్నీ డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మికలో తను చూశానని, అందుకే మరో ఆలోచన లేకుండా జూమ్ కాల్ లో రష్మికను సంప్రదించి, ఆమెను తీసుకున్నామని తెలిపాడు.
డియర్ కామ్రేడ్ సినిమా సౌత్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఎవ్వరికీ ఈ సినిమా కలిసిరాలేదు. కానీ రష్మికకు మాత్రం ఏకంగా బాలీవుడ్ ఆఫర్ అందించింది. రష్మికను అంతా అదృష్టవంతురాలు అనేది ఇందుకే. ఫ్లాప్ సినిమాతో ఏకంగా బాలీవుడ్ ఆఫర్ పట్టేసింది.