ఒకసారి రుచి చూసాక, మానడం, వెనక్కు తిరగడం అంత సులువు కాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ భారీ సినిమాల బాట పట్టారు తమిళ దర్శకుడు శంకర్. వాస్తవానికి జెంటిల్ మన్ తీసినపుడే అప్పట్లో ఆ సినిమా బడ్జెట్ వార్తల్లో నిలిచింది. అలాంటిది 500 కోట్లు కేవలం సినిమాకు పెట్టి, రోబో 2.0 సినిమాను రూపకల్పన చేసాడు. తన తరువాత ప్రాజెక్టుగా ఇండియన్ (భారతీయుడు) సీక్వెల్ ను స్టార్ట్ చేసాడు శంకర్.
మూడేళ్లుగా రోబో 2.0 ప్రాజెక్టు మీద వర్క్ చేసినా, అస్సలు గ్యాప్ తీసుకోకుండా కమల్ హాసన్ తో ఇండియన్ 2 స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ కాస్ట్ రెండు కోట్లకు పైమాటే. ఓ సినిమా కోసం రెండు కోట్ల సెట్ వేయడం పెద్ద విషయం కాదు.
కానీ ఈ సెట్ స్పెషాలిటీ ఏమిటంటే, ఈ సెట్ మొత్తం గోల్డ్ కలర్ లో, బంగారు తళతళలతో వుంటుందట. పైగా ఈ సెట్ మెటీరియల్ మొత్తం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పక్కా గోల్డ్ సెట్ లా కనిపించడం కోసం చైనా సంస్థలకు ఆర్డర్ ఇచ్చారట మెటీరియల్ కు.
ఓ సెట్ కోసం ఇంత చేస్తున్నారు కానీ, ఈ సెట్ లో షూట్ చేసేది జస్ట్ రెండురోజులు మాత్రమేనని తెలుస్తోంది. సినిమాలోని కీలక సన్నివేశాలు కొన్ని ఈ సెట్ లో రెండు రోజుల పాటు షూట్ చేస్తారని తెలుస్తోంది. ఎంతయినా శంకర్ స్టయిల్ నే వేరు.