అమ్మా అమ్మా…ప‌ల‌క‌వేమ‌మ్మా?

అమ్మా అమ్మా… ఎక్క‌డున్నావ‌మ్మా? ఎంత‌కూ ప‌ల‌క‌వేమ‌మ్మా? ఎక్క‌డికి పోయావ‌మ్మా? అమ్మా అని అరిస్తే …బిడ్డ‌కు ఏ క‌ష్ట‌మొచ్చిందో అని ప‌రుగునా వ‌చ్చి అక్కున చేర్చుకునే దానివి. పుట్ట‌గానే అమృతం లాంటి చ‌నుబాలు ఇచ్చిన అమ్మ‌,…

అమ్మా అమ్మా… ఎక్క‌డున్నావ‌మ్మా? ఎంత‌కూ ప‌ల‌క‌వేమ‌మ్మా? ఎక్క‌డికి పోయావ‌మ్మా? అమ్మా అని అరిస్తే …బిడ్డ‌కు ఏ క‌ష్ట‌మొచ్చిందో అని ప‌రుగునా వ‌చ్చి అక్కున చేర్చుకునే దానివి. పుట్ట‌గానే అమృతం లాంటి చ‌నుబాలు ఇచ్చిన అమ్మ‌, ఆ త‌ర్వాత కొస‌రి కొస‌రి ప్రేమ‌తో క‌లిపిన గోరుముద్ద‌లు పెట్టి మురిపెంగా పెంచి పెద్ద చేసిన అమ్మ‌ను మాయ‌దారి మ‌హ‌మ్మారి మ‌న‌కు శాశ్వ‌తంగా దూరం చేస్తోంది.

అన్ని చోట్ల దేవుళ్లు ఉండ‌లేక‌… అమ్మ‌ను సృష్టించార‌ని చెబుతారు. ప్రేమ‌కు ప్ర‌తిరూపమైన కొన్ని వంద‌ల మంది త‌ల్లులు క‌రోనాకు బ‌లి అయ్యారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల త‌ల్లుల‌ను కోల్పోయిన బిడ్డ‌ల బాధ ఒక్కొక్క‌రిది ఒక్కో ర‌కం. అమ్మంటే ఎన్నెన్ని తీపి జ్ఞాప‌కాలు. పాలిచ్చి, లాలించి, జోకొట్టి, వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించి ….స‌ర్వకాల స‌ర్వావ‌స్థ‌ల్లోనూ తానున్నానంటూ అండ‌గా నిలిచే దేవుడి ప్ర‌తిరూప‌మే అమ్మ‌.

అమ్మంటే అపురూప‌మైన కావ్యం. అమ్మంటే ఒక న‌మ్మ‌కం, విశ్వాసం. ఈ సృష్టిలో క‌లుషితం లేని ప్రేమ ఏదైనా ఉందంటే …అది అమ్మ పంచే ప్రేమ‌, పాలు అని చెప్ప‌క త‌ప్ప‌దు. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు మొద‌లుకుని, ద‌గ్గ‌రుండి ఏడ‌డుగులు వేయించాల్సిన ద‌శ‌లో త‌ల్లుల‌ను పోగొట్టుకున్న వారి వేద‌న వ‌ర్ణ‌నాతీతం. అలాంటి వాళ్ల అవేద‌న‌ను ఈ క‌రోనా విప‌త్కాలంలో చూడొచ్చు. అమ్మ‌లేని లోటును ఎవ‌రూ తీర్చ‌లేరు.

క‌ష్ట‌మొస్తే, న‌ష్ట‌మొస్తే, క‌న్నీళ్లొస్తే ….అమ్మే గుర్తుకొస్తుంది. ఎందుకంటే అమ్మంటే ఓ సంజీవ‌ని. స‌ర్వ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అమ్మ ఓ దిక్సూచి. కార్బ‌న్‌డైఆక్సైడ్ పీల్చుకుని, మాన‌వాళికి ప్రాణ‌వాయువు ఇచ్చే ప‌చ్చ‌ని చెట్టులాంటిది అమ్మ‌. అందుకే అమ్మంటే అంద‌రికీ ప్రాణం. అందుకే అమ్మంటే అంత ఆపేక్ష‌. అందుకే అమ్మ‌కు దేవుళ్ల కంటే మొద‌టి స్థానం క‌ల్పించారు. 

మాతృదేవో భ‌వ, పితృదేవో భ‌వ‌, ఆచార్య దేవోభ‌వ అని మ‌న పెద్ద‌లు ఊరికే అగ్ర‌స్థానం క‌ల్పించ‌లేదు. అలాంటి అమ్మ‌ను మ‌హ‌మ్మారి క‌రోనా క‌బ‌ళిస్తుంటే… నిస్స‌హాయులుగా చూస్తుండి పోతున్నాం.

క‌రోనా కార‌ణంగా అమ్మ‌ల్ని పోగొట్టుకున్న వాళ్ల‌కు తిరిగి ఆ మాతృమూర్తిని తీసుకురాలేం. కానీ అమ్మ‌ను శాశ్వ‌తంగా పోగొట్టుకున్న బిడ్డ‌ల‌ను గుర్తించి, ఆ ప్రేమ‌ను పంచ‌డం మ‌న చేతుల్లోనే ఉంది. ఈ ప్ర‌పంచం చాలా పెద్ద‌ది. త‌ల్లుల‌ను పోగొట్టుకున్న బిడ్డ‌ల ఆవేద‌న‌ను అర్థం చేసుకుని, పెద్ద మ‌న‌సుతో త‌ల్లి ప్రేమ‌ను పంచాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంది. 

కావున నేడు ప్ర‌పంచ వ్యాప్తం గా మాతృదినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా ….అమ్మ‌ను పోగొట్టుకున్న వాళ్లెవ‌రూ అనాథ‌లు కార‌ని అక్కున చేర్చుకుందాం. అమ్మ లేక‌పోయినా, ఆ ప్రేమ‌ను పంచ‌డానికి తామున్నామ‌ని మ‌న హృద‌యంలో చోటు క‌ల్పిద్దాం. ఇదే అమ్మ‌కు మ‌న‌మిచ్చే నిజ‌మైన గౌర‌వం.

సొదుం ర‌మ‌ణ‌