తెలుగు రాష్ట్రం కాస్తా రాష్ట్రాలుగా మారిన తరువాత మీడియాకు ఓ వెసులుబాటు వచ్చింది. ఎక్కడ ట్యూన్ అక్కడ తమకు అనుకూలంగా వినిపించుకోవచ్చు. నిజానికి ఈ సదుపాయం జిల్లా ఎడిషన్లు వచ్చాకే వచ్చింది.
శ్రీకాకుళంలో ఏదో అయిపోతోంది అంటూ కర్నూలు ఎడిషన్ లో రాస్తారు. కడపలో ఏదో జరిగిపోతోందని విశాఖలో టముకేస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రజలందరినీ గొర్రెలను చేసి తమకు కావాల్సిన మార్గంలోకి అదలించుకోవచ్చు. కానీ ఖర్మ ఏమిటంటే సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చి ఇలాంటి టక్కు టమార విద్యలు అన్నీ జనాలకు అర్థం అయిపోయాయి.
అయితే రెండు రాష్ట్రాలు, రెండు ఎడిషన్లు, రెండు రకాల వార్తానివేదనలు అన్నవి మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఇష్టం, అభిమానం లేదా భయం వున్న దగ్గర ఒకలా…కోపం, బాధ, కిట్టనితనం వున్న చోట ఒకలా వార్తలు అందిస్తున్నారు.
చిత్రమేమిటంటే ఓ ఎడిషన్ లో ప్రాధాన్యత సంతరించుకుని తాటికాయంత అక్షరాలతో వున్న వార్తలు ఇంకో ఎడిషన్ లోకి వచ్చేసరికి చిన్నబోతాయి.
తెలంగాణ ఎడిషన్ తొలిపేజీలు అన్నీ మోడీ, లేదా కేంద్రం తప్పిదాలతో నిండిపోతాయి. ఆ పేజీ చదివితే కేంద్రం మీద కోపం అరికాలి నుంచి పుట్టుకువస్తుంది. కానీ ఆంధ్రకు వచ్చేసరికి ఆ వార్తలు అన్నీ చిన్నగా మారి అక్కడా అక్కడా సర్దుకుంటాయి.
జగన్ మీద, అతని ప్రభుత్వం మీద వండి వార్చిన వార్తలు అన్నీ పెరిగి అమాంతం తొలిపేజీ ని ఆక్రమించుకుని కూర్చుంటాయి. ఇవి చదివిన వారికి జగన్ మీద కోపం అమాంతం పెరిగిపోవాలి.
కానీ మళ్లీ ఖర్మ ఏమిటంటే ప్రింట్ ఎడిషన్లు చదివేవారి సంఖ్య కన్నా డిజిటల్ ఎడిషన్లు చదివేవారి సంఖ్య రాను రాను పెరుగుతోంది. మొబైళ్లలో తెల్లవారకుండానే అన్ని రకాల ఈపేపర్లు వచ్చి పడుతున్నాయి. దాంతో జనాలకు ఈ ట్రిక్కు బాగానే అర్థం అయిపోతోంది.
ఎటోచ్చి ఇంకా ప్రింట్ పేపర్ ను పట్టుకుని చదివేవారికి అర్థం కావాల్సి వుంది. కానీ వాళ్లకు కూడా పత్రికలు వాటి అనుబంధాలు, వాటి రాజకీయాలు, వాటి వ్యాపారాలు, వాటి యజమానులు, వారి వారి సామాజిక బంధాలు అన్నీ అర్థం అయిపోయాయి.
అందువల్ల కంఠశోష తప్ప ఒరగేదేమీ లేదు.