తమిళ సాహితీరంగంలో సుజాత రంగరాజన్ కు వున్న పేరు తక్కువేమీ కాదు. విపరీతంగా సాహితీ వ్యవసాయం చేసిన రచయిత. వందకు పైగా నవలలు, 250కి పైగా కథలు, సైన్స్ మీద పదికి పైగా పుస్తకాలు, నాటకాలు, ఇలా ఒకటేమిటి చాలా చాలా చేసారు.
అన్నింటికి మించి శంకర్, మణిరత్నం అందించిన అనేక హిట్ లకు కథలు, కథా సహకారం అందించినవాడు. జెంటిల్ మన్, అపరిచితుడు, భారతీయుడు, శివాజీ, ఆఖరికి రోబో వెనుక కూడా సుజాత కృషి వుంది. రోజాకు మాటలు అందించింది, దిల్ సే, తిరుడా తిరుడా (దొంగ దొంగ) కోసం మణిరత్నంకు తోడయ్యింది ఈ సుజాతనే.
ఇప్పుడు శంకర్ కు తెలుస్తోంది సుజాత లేని లోటు. సుజాత మరణించిన తరువాత రెండు సినిమాలు అందించాడు శంకర్. ఒకటి ఐ, రెండవది రోబో 2. రెండింటితోనూ శంకర్ ప్రేక్షకుల నుంచి పూర్తిస్థాయి ప్రశంసలు అందుకోలేకపోయారు. ముఖ్యంగా కథ విషయంలో రోబో 2 అసంతృప్తిని మిగిల్చింది. టెక్నికల్, విజువల్ వండర్ గా పేరు తెచ్చుకుంది.
శంకర్ నే కాదు, సినిమా రంగంలో చాలామంది దిగ్దర్శకులు తమకు రైట్ హ్యాండ్ గా వుండే రచయితలు ఏదో కారణం వల్ల దూరం అయిన తరువాత ఫ్లాపులే ఇచ్చారు తప్ప హిట్ లు ఇవ్వలేకపోయారు. కారణం దర్శకుల పాయింట్ ను విస్తరించి, సరైన మాటలు ఇచ్చి నడిపించడంలో ఆయా రచయితల పాత్ర తక్కువకాదు.
టాలీవుడ్ లో కూడా 1980వ దశకం నుంచి ఇప్పటి వరకు అనేకానేక పెద్ద దర్శకుల వైఫల్యాల వెనుక ఇలా రచయితలు దూరం కావడం, లేదా అసిస్టెంట్ లు దూరంకావడం అన్న పాయింట్ వుంటుంది. ఓపిగ్గా వెదుక్కోగలిగితే చాలామంది పేర్లు స్ఫురిస్తాయి.
తెలంగాణ ఓటరు నాడి… ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?… చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్