మహర్షి సినిమా షూట్ చకచకా జరుగుతోంది. మార్చిలో విడుదల. అంటే అప్పటి నుంచి మహేష్ ఫ్రీ అవుతారు. కానీ ఆ తరువాత ఏమిటి? అన్నదే ఇంకా ఫిక్స్ కాలేదు. సినిమాలు అయితే ఖరారు అయ్యాయి. మైత్రీ-సుకుమార్ కాంబినేషన్ లో ఒకటి. సందీప్ వంగా డైరక్షన్ లో ఏషియన్ సునీల్ నిర్మాతగా మరోటి. కానీ దేనికి ఇంకా స్క్రిప్ట్ ఓకె కాలేదు.
సుకుమార్ ముందుగా రజాకార్ల నేపథ్యంలో ఓ కథ చెప్పారు. అయితే తాను పీరియాడిక్ ఫిల్మ్ చేయనని మహేష్ చెప్పేసారని వార్తలు వినవచ్చాయి. తరువాత మరో కథ చెప్పారు కానీ, అది ఇంకా పూర్తిగా సమ్మతి కాలేదని వినిపిస్తోంది. వాస్తవానికి సుకుమార్ లైన్ ఆఫ్ హిట్స్ ఎక్కువగా లేవు. అటు ఇటు వుంటూ వచ్చాయి. అందుకే మహేష్ స్క్రిప్ట్ విషయంలో చాలా పట్టుదలగా వున్నట్లు వినిపిస్తోంది.
ఇదే టైమ్ లో సందీప్ వంగా చేత కథ నెరేట్ చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ అతగాడు కూడా సెకండాఫ్ ఇంకా చెప్పలేదు. దాంతో ఇప్పుడు మహేష్ ఆల్టర్ నేటివ్ ఆలోచనలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కొరటాల శివ మెగా క్యాంప్ లో లాక్ అయ్యారు. లేదూ అంటే మళ్లీ మహేష్ తో మరో సినిమా చేసేవారే.
సైరా సినిమా సమ్మర్ ను దాటి వెనక్కు వెళ్లిపోయింది. దసరా అని వినిపిస్తుంటే, రామ్ చరణ్ తన సన్నిహితులు కొందరితో సంక్రాంతి 2020కి వస్తామని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చిరంజీవి ఎప్పుడు ఖాళీ అవుతారు.
పోనీ ఆయన పార్ట్ పూర్తికావాలన్నా, కనీసం మే వరకు కుదరదు. ఆ తరువాత కూడా మళ్లీ సైరా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వుంటాయి. ఇవన్నీ చిరంజీవి పర్యవేక్షణలోనే జరగడం తప్పనిసరి. అందువల్ల అంతవరకు కొరటాల ఖాళీగా వుంటారా?
మార్చి నుంచి మొదలు పెట్టి ఆరునెలల్లో మహేష్ తో ఓ సినిమా చేస్తారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న క్వశ్చను. మహర్షి వ్యవహారం ఓ కొలిక్కి వస్తే, దీనికి సమాధానం దొరికేస్తుంది.