పవన్ కల్యాణ్ చేస్తున్న 'పింక్' రీమేక్ పట్ల బాలీవుడ్ లో పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో అలిసిపోయి సినిమాలతో సేదతీరడానికి, సంపాదించుకోవడానికి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత వస్తున్న తొలి సినిమా పింక్ రీమేక్. మామూలుగా అయితే పవన్ రీ ఎంట్రీ పట్ల బాలీవుడ్ అంత ఆసక్తితో ఉండేది కాదేమో కానీ, పింక్ రీమేక్ కావడంతో ఈ సినిమాపై అక్కడి జనాల ఆసక్తి ఉంది. పింక్ రీమేక్ లో వాటాదారు బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ బోనీ కపూర్. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు అర్జున్ కపూర్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను షేర్ చేశాడు.
దీనిపై అక్కడి మీడియా స్పందిస్తూ.. ఇంతకీ ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్న వారెక్కడ? అనే సందేహాన్ని వ్యక్తం చేసింది. పింక్ అంటే.. బాలీవుడ్ జనాల దృష్టిలో.. ఆ సినిమాలో నటించిన అమ్మాయిలే గుర్తుకు వచ్చినట్టున్నారు. ఆ సినిమాలో వెటరన్ స్టార్ అమితాబ్ ది పరిమితమైన పాత్రే. పింక్ ను అమ్మాయిలు లీడ్ చేసిన సినిమాగానే అక్కడి వారు భావిస్తున్నారు! అయితే పవన్ ది పేరుకు పింక్ కు రీమేకే అయినా… ఇక్కడంతా మార్చేసి ఉంటారని అక్కడి అమాయకులు అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు!
పింక్ అనే టైటిల్ నే వకీల్ సాబ్ అంటూ మార్చేశారంటే.. ఏ రేంజ్ లో మార్పులు చేసేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు! పవన్ రీ ఎంట్రీకి తగ్గట్టుగా పింక్ కథను ఒక మాస్ మసాలాగా మార్చేసి ఉండవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఫస్ట్ లుక్ ను చూసి బాలీవుడ్ జనాలకు తల తిరిగినట్టుగా ఉంది. పింక్ ఫస్ట్ పోస్టర్లో సినిమాలోని ప్రధాన పాత్రలైన అమ్మాయిల రోల్స్ ను చేసిన నటీమణుల ఫొటోలను బాలీవుడ్ మీడియా ఎక్స్ పెక్ట్ చేసింది! అయితే చూడబోతే..ఇదేదో ముఠామేస్త్రీ సినిమా రీమేక్ లుక్ లా ఉందాయె! ఇలాంటి నేపథ్యంలో.. ఇంతకీ ఆ అమ్మాయిలెక్కడ? అంటూ అక్కడి అమాయకులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడే ఏమైంది? అసలు సినిమా విడుదల అయితే.. పింక్ రీమేక్ కాస్త మరో కలర్ లోకి మారిపోయి కనిపిస్తుందేమో!