తూర్పు ఆసియా దేశాల్లో కరోనా ప్రభావం కనిపిస్తూ ఉంది. చైనాలో మొదలైన ఈ వైరస్ అనేక దేశాలకు వ్యాపించింది. చైనాకు చుట్టుపక్కల దేశాల్లో కరోనా తీవ్రత కనిపిస్తూ ఉంది. అటూ ఇటూ వ్యాపించి.. ఏకంగా సౌత్ కొరియా వరకూ కరోనా వైరస్ గట్టిగానే చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. కరోనా గురించి వాస్తవాలు ఏ మేరకు ప్రచారానికి నోచుకుంటున్నాయో కానీ, రూమర్లు మాత్రం తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఒక ప్రముఖుడికి కరోనా వైరస్ సోకినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
ఆయన మరెవరో కాదు.. జాకీ చాన్. ఈ మార్షల్ ఆర్ట్స్ వీరుడికి కరోనా వైరస్ సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ ఉంది. ఏ హాంకాంగ్ జనాలో ఈ ప్రచారాన్ని మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. జాకీ కి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, దీంతో వాళ్లంతా సానుభూతి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అంతే కాదట.. జాకీచాన్ కు మాస్క్ లు పంపారట కొంతమంది. అలాగే ఇంకొందరు గెట్ వెల్ సూన్ అంటూ సందేశాలు పంపసాగారట. ఈ నేపథ్యంలో జాకీ ఈ విషయంలో స్పందించారు. తనకు కరోనా వైరస్ సోకిందనేది అబద్ధపు ప్రచారం అని ఆ హీరో స్పష్టం చేశాడు.
తనపై అందరూ చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని, అయితే తను కరోనా వైరస్ బారిన పడలేదని, అది ఫేక్ ప్రచారమే అని ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేశాడు జాకీ చాన్. ఇలా తనపై వెల్లువెత్తుతున్న సానుభూతి విషయంలో జాకీ స్పందించాడు. ఇలాంటి కొత్త తరహా వైరస్ లు, సమస్యలు వచ్చినప్పుడు సగం అబద్ధాలు తీవ్ర ప్రచారానికి పొందడం జనాల్లో కామనే. బయటి ప్రపంచం ఎలా చూస్తోందంటూ.. చైనీయులు, ఆ చుట్టుపక్కల దేశాల వారంతా కరోనా వైరస్ కు గురి అయినట్టుగా చూస్తున్నారు. దీంతో ఆ దేశాల్లో తమకు తెలిసిన జాకీ చాన్ లాంటి వాళ్లకు కూడా కరోనా సోకే ఉంటుందన్నట్టుగా తయారైంది జనాల తీరు!