-తారక్ చుట్టూ కొమ్మలను నరికేస్తున్న బాబు!
-ఎన్టీఆర్‌కు భవిష్యత్ లేకుండా చేసే ప్లాన్
-నందమూరితో నారా కొత్త ఆట
-ఇదైనా వేస్తుందా లోకేష్ భవితకు బాట?
ఒకమనిషి చేతిలో ఒకసారి మోసపోవచ్చు.. రెండుసార్లు మోసపోవచ్చు.. కానీ పదే పదే మోసపోతూ ఉంటే.. తప్పు మోసం చేసేవాడిదా మోసపోయే వాడిదా! ఒకసారి పొరపాటు, రెండోసారి గ్రహపాటు.. పదే పదే అదే రిపీట్ అవుతూ ఉంటే. దాన్ని ఏమనాలి! నారా, నందమూరి కుటుంబాల మధ్య సాగుతున్న ఈ గేమ్‌ను చూస్తుంటే జనాల్లో ఈ ''సంభ్రమాశ్చర్యాలే'' వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు చేతిలో నందమూరి కుటుంబం అనేకసార్లు మోసపోయింది.
అటు కుటుంబాన్ని అంతా ఒకేసారి.. ఒక్కొక్కరిని ఒక్కోసారి చంద్రబాబు నాయుడు వెర్రి వాళ్లను చేసేసి ఆడుకున్నాడు. విశేషం ఏమిటంటే.. దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోతున్నా ఈ ఆట సాగుతూ ఉంది. ఈ ఆటలో నందమూరి కుటుంబీకులు పావులు అవుతూనే ఉన్నారు. ఒక్కోక్కసారి ఒక్కోరివంతు. పావులు తేడా.. చంద్రబాబు ఆట మాత్రం కామన్.
శ్రీనువైట్ల సినిమాలో బకరాల్లా..!
ఇదో మూడున్నర దశాబ్దాల సినిమా. అనేక మలుపుల సినిమా. ఈ ఆటలో చంద్రబాబు నాయుడు కామన్ పాత్రధారి. ఈ గేమ్‌లో చంద్రబాబు నాయుడు తనకు తాను హీరో. ఇక నందమూరి కుటుంబం మాత్రం శ్రీనువైట్ల సినిమాల్లో కమేడియన్లలా తన ప్రస్థానాన్ని సాగిస్తూ ఉంది. ఏదో ఒక ఇంట్లో చేరిపోయి.. ప్రధాన పాత్రధారి ఇంట్లో వాళ్లందరినీ బకరాలను చేసుకుని ఆడుకోవడం శ్రీనువైట్ల సినిమాల్లో కామన్‌గా కనిపించే కాన్సెప్ట్.
ఈ తరహా కథాంశాలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి తెలుగులో. నందమూరి కుటంబంతో చంద్రబాబు ఆడే ఆట కూడా ఆ కాన్సెప్ట్‌ల లాగే ఉంటుంది. అలాగే సాగుతూ ఉంది. సదరు సినిమాల్లో అయినా కుటుంబీకులకు తాము బకరాలం అయిపోయామనే రియలైజేషన్ ఎక్కడైనా ఉంటుందేమో కానీ.. నందమూరి కుటుంబానికి మాత్రం ఈ రియలైజేషన్ రాలేదు. బహుశా ఇక ముందు ముందు రాదు కూడా.
సీనియర్ ఎన్టీఆర్ టూ జూనియర్ ఎన్టీఆర్!
తన ఆషాడబూతి వేషంతో చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్‌తో ఆటాడేసుకున్నాడు. తన గేమ్‌ను అమల్లో పెట్టడానికి ఎన్టీఆర్ సంతానాన్ని అంతా రంగంలోకి దించాడు. ఎలాంటి వాడైనా తండ్రిని కాచుకుని చూసుకోవాల్సిన సంతానం.. ఆయనను అప్పటికే నానా రకాలుగా ముప్పుతిప్పలు పెట్టి.. చివరకు ఆయనను పదవీచ్యుతుడిని చేయడంలోనూ తమ పాత్రను సమర్థవంతంగా పోషించింది. వీళ్లు అలాంటివాళ్లే కాబట్టి.. చంద్రబాబు నాయుడు కూడా వీళ్లను అడ్డంపెట్టుకుని ఎన్టీఆర్‌ను పదవీభ్రష్టుడిని చేసి.. అదే సమయంలో వీళ్లనూ ఎందుకూ పనికిరాకుండా చేశాడు! తనపని పూర్తయిన తర్వాత ఒక్కొక్కరి భరతం పట్టాడు చంద్రబాబు నాయుడు.
తోడల్లుడు దగ్గుబాటిని, పురందేశ్వరిని ఒక తోపు తోశాడు. బాబు ఇచ్చిన ఝలక్‌కు వాళ్లు అల్లాడిపోయారు. చేసేది లేక కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కాస్త కలిసి వచ్చింది. ఇప్పటికీ బాబు మీద వాళ్లకు పీకల్దాకా ఉంది. ఆ తర్వాత హరికృష్ణతో చంద్రబాబు మార్కు గేమ్ మొదలైంది. మంత్రిపదవి ఇచ్చినట్టుగానే ఇచ్చి.. దాన్ని ఆరునెలల ముచ్చటగా చేశాడు. వెన్నుపోటు కత్తి తనవరకూ వచ్చాకా కానీ హరికి నొప్పి తెలియలేదు. తెలిసిన తర్వాత గగ్గోలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది.
ఇక ఎన్టీఆర్ మిగిలిన సంతానం మరింత వాజమ్మలు. పేరుకు చాలామందే ఉన్నా.. తండ్రి నేర్పరితనంలో వందోవంతు కూడా వాళ్లకు లేకుండా పోయింది. దీంతో వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా చంద్రబాబుకు లేకపోయింది. బాలకృష్ణ హీరోగా గుర్తింపు ఉన్నా.. బాబుతో ఢీకొట్టడానికి అప్పట్లో వెళ్లేంత సీన్ లేకపోయింది. బాలయ్యను ఆటలో అరటిపండుగా చూశాడు చంద్రబాబు.
బాలయ్య కూతురు ఎదిగొచ్చాకా.. అప్పటికి అధికారం కూడా చేతిలో లేకపోవడంతో చంద్రబాబుకు నందమూరి అవసరం మళ్లీపడింది. అందుకే బాలయ్యను వియ్యంకుడుగా చేసుకున్నాడు. అప్పటి వరకూ మేనరికాలు వద్దు అంటూ ప్రపంచానికి హితబోధ చేసిన ఆయనే కొడుక్కు మాత్రం మేనరికం వివాహం చేశాడు. దటీజ్ చంద్రబాబు. బాలయ్యను అలా సెట్ చేసేశాడు. అయితే అప్పటికీ నందమూరికి బాబు పోటు పవర్ ఏమిటో అర్థంకాలేదు. రెండువేల తొమ్మిది ఎన్నికల సమయంలో మళ్లీ బకారాలు కావడానికి ముందుకు వచ్చింది నందమూరి ఫ్యామిలీ.
ఆ ఎన్నికలు బాబుకు చావో రేవో అయ్యాయి. అప్పుడు ఓడిపోతే అంతే సంగతులు అని స్పష్టం అయ్యింది. దీంతో చేసేదిలేక నందమూరిని మళ్లీ రంగంలోకి దించాడు. తారక్ చేత ప్రచారం చేయించుకున్నాడు. దానికి కొంతమందు హరిని మళ్లీ చేరదీసి.. రాజ్యసభ సభ్యత్వాన్నీ ఇచ్చాడు. అలా సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ వాడుకోవడంలో పరిపూర్ణతను పూర్తిచేశాడు చంద్రబాబు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు అప్పట్లో ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇతడు ఎక్కడైతే బాగా ప్రచారం చేశాడో ఆ ప్రాంతంలో టీడీపీ నెగ్గలేకపోయింది. చిత్తుగా ఓడింది.
తారక్ ఏనాటికైనా ప్రమాదకరమే!
ఇదే చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం ఉన్న భయమంతా. ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబుకు ఇప్పుడు ఎవరితోనూ ప్రమాదంలేదు. బాలయ్యను తన వరండాలోకి తీసుకొచ్చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పిందానికి తలూపడం తప్ప బాలయ్య ఇక చేయగలిగింది ఏమీ కూడా లేదు. చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలనేది చంద్రబాబు ఫిలాసఫీ. అందుకే వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు కూడా టికెట్ ఇచ్చేదిలేదని అంటున్నారు.
అసలుకు గత ఎన్నికల్లోనే బాలయ్యను ఓడించేసి కథను ముగించేయాలని బాబు భావించాడు. ఎన్టీఆర్ కొడుకులకు ఏదీ చేతికి అందకుండా ఉంచాలని చూశాడు. అయితే బాలయ్యకు బుర్రలో ఈవిషయం వెలిగి.. తనే హిందూపురానికి మకాం మార్చి.. గెలవడం కోసం చాలా కష్టపడ్డాడు. రేపు కూడా అలాగే కష్టపడి గెలవగలనని బాలయ్య అనుకుంటున్నాడు. అయితే.. వచ్చేసారి బాలయ్యకు టికెట్ దక్కే అవకాశాలే లేవు అనే ప్రచారం సాగుతోంది. మరీ బాలయ్య అలిగి అరిచి గీపెడితే తప్ప టికెట్ ఇవ్వడానికి బాబు సుముఖంగా లేడని సమాచారం.
ఇక హరికృష్ణకు రెండోపోటు కూడా గట్టిగానే పొడిచాడు చంద్రబాబు నాయుడు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చినట్టుగానే ఇచ్చి దాన్ని ముగింపజేయడంలో చక్రంతిప్పాడు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో.. హరి రాజీనామా ఒక్కటే ఆమోదం పొందడం వెనుక చంద్రబాబు నాయుడి మంత్రాంగం ఉందనేది తెలిసిన విషయమే. ముందురోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ను చంద్రబాబు కలవడం, రెండోరోజు హరి రాజీనామా మాత్రమే ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. దీంతో హరికృష్ణకు, ఆయన తనయులకు చంద్రబాబు నాయుడు అంటే ఏమిటో పూర్తిగా అర్థం అయ్యింది.
బాలయ్య విషయంలోనే చంద్రబాబు నాయుడు ఒకింత అభద్రతాభావంతో ఉన్నాడు. అలాంటిది తారక్ విషయంలో ఇంకెంత భయంతో ఉంటాడో చెప్పనక్కర్లేదు. తారక్‌తో తనకు ప్రమాదంలేదు కానీ.. తన తనయుడు లోకేష్‌కు మాత్రం ఖాయంగా థ్రెట్ ఉంటుందనేది బాబు లెక్క. ఇందులో పెద్ద ఆశ్చర్యంలేదు కూడా. రాజకీయంగా లోకేష్ అసమర్థుడని ఇప్పటికే తేలిపోయింది. కనీసం మాట్లాడటం కూడా రాదు లోకేష్‌కు. ఫేస్‌వ్యాల్యూ, ఛరిష్మా, జనాలపై ప్చూపడం.. వీటన్నింటిలోనూ తారక్‌తో పోలిస్తే లోకేష్ జుజూపీ! చంద్రబాబు తదనంతరం టీడీపీకి లోకేష్ నాయకుడు అనేది జీర్ణించుకోవడం కమ్మ వాళ్లలోని వీర నారా భక్తులకే కష్టంగా ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు!
తారక్‌ను తొక్కేసే యత్నం!
ఇది ఇప్పటిది ఏమీకాదు. చాలా సంవత్సరాల కిందట మొదలైనదే. ఎప్పుడైతే రెండువేల తొమ్మిది ఎన్నికల సమయంలో తనను వాడుకుని.. తన మామ పక్కన పడేశాడో అప్పుడే తారక్‌కు బాబు పోటు రుచి అర్థం అయ్యింది. అందుకే ఆ తర్వాత అతడు సైలెంట్ అయ్యాడు. కాస్త మెచ్యూరిటీ వచ్చింది. చంద్రబాబు కోసం తను చాలామందిని శత్రువులుగా చేసుకుని సాధించేది ఏమీలేదని, బాబు తమను వాడిపారేసే టైపే కానీ.. అంతకు మించి బాబుకు బంధాలు, అనుబంధాలు, ఆపేక్ష ఉండవని తారక్‌కు అర్థం అయ్యింది. అందుకే బాబుకు దూరమై.. గత ఎన్నికలకు ముందే తన ప్రయత్నాలు తను మొదలుపెట్టాడు.
ఒకవేళ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి ఉంటే. వరసగా మూడోసారి బాబు నాయకత్వంలో టీడీపీ ఓడి ఉంటే.. ఈ పాటికి కథ మరోలా ఉండేదని చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు వచ్చేది. పార్టీ ఈ పాటికి జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లిపోయేది. టీడీపీలో నారా నాయకత్వానికి తెరపడేది. బాబుకు లక్ ఎక్కడో ఉండటంతో గత ఎన్నికల్లో అధికారం చేతికి అందింది. దీంతో పార్టీలో మళ్లీ నారానే సమస్తం అయ్యాడు. తనయుడిని పార్టీకి భవిష్యత్ ఆశాకిరణంగా చూపించడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇక ఈ నాలుగేళ్లలో లోకేష్ కూడా తన ప్రతిభాపాటవాలను చూపించడం మొదలుపెట్టాడు. అంతిమంగా తేలింది ఏమిటో అందరికీ తెలుసు.
లోకేష్‌తో కాదు.. లోకేష్ మాట్లాడితే నవ్వుకోవాలి తప్ప.. అంతకుమించి ఏమీ ఆలోచించకూడదని సొంత పార్టీ వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని మేధావిగా, విజనరీగా చూపించడానికి మీడియా ఎన్నికష్టాలు పడిందో, పడుతోందో.. అంతకు వెయ్యిరెట్లు కష్టపడినా లోకేష్‌ను హైలెట్ చేయలేదు మీడియా. అందులోనూ ఇది సోషల్ మీడియా యుగం. లోకేష్ ఇమేజ్ ఒక అడుగు పైకి పది అడుగులు కిందికి పడుతూ సాగుతోంది. ఈ పరిస్థితి చంద్రబాబుకు అర్థంకానిది ఏమీకాదు.
రేపు తన అనంతరం.. తన తనయుడిని ఎవ్వరూ పట్టించుకోరు అని.. కమ్మ లాబీ కూడా.. లోకేష్ నాయకత్వాన్ని లెక్క చేయదని బాబుకు అర్థం అయిపోయింది. ఎన్టీఆర్ అనంతరం తమవాడు ఒక లీడర్ అవసరం కాబట్టి.. కమ్మ లాబీ బాబును నిలబెట్టుకుంది. బాబును తమవాడిని చేసుకుంది. ఎన్టీఆర్‌కు బాబు చేసింది తీవ్రమైన ద్రోహమే అయినా.. చంద్రబాబు తప్ప మరో దిక్కులేదు కాబట్టి.. బాబునే సమర్థిస్తూ వచ్చింది. దీనికి తగ్గట్టుగా వారి ప్రయోజనాలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు కూడా సఫలం అయ్యాడు.
కమ్మ వాళ్లకు అపారామైన సేవలను అందించాడు. బీసీ ఓటు బ్యాంకును అడ్డంపెట్టుకుని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కమ్మవాళ్ల రాజ్యాన్ని నడిపించారు, నడిపిస్తున్నారు. ఇలా బాబు ఉన్నంత వరకూ ఫర్వాలేదు. బాబు తర్వాత లోకేష్.. అంటే మాత్రం కమ్మ వాళ్లే జావగారిపోతున్నారు.
కమ్మోళ్ల ఛాయిస్ లోకేష్ కాదు!
చంద్రబాబును వీరుడు, శూరుడు, విజనరీ అని పొగిడే వీర కమ్మభక్తులు కూడా.. లోకేష్ విషయంలో కామెడీగానే మాట్లాడుతున్నారు. లోకేష్ విషయంలో వారు కూడా జోకులే వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు సొంతక్యాస్ట్ వాళ్లకు ఏమాత్రం భరోసాను ఇవ్వలేకపోతున్నాడు. రాజశేఖర రెడ్డి పోతే.. ఆయన తనయుడు చాలా త్వరగా నాయకుడిగా ఎదిగాడు. ఒట్టి తమ కులపోళ్లలో మనోడనే భరోసాను ఇవ్వడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీనే సున్నాగా మార్చాడు. కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓటు బ్యాంకును సాంతం తనవైపుకు తిప్పుకున్నాడు.
జగన్ ఒకసారి ప్రతిపక్షంలో కూర్చోవచ్చు.. కానీ.. ప్రత్యామ్నాయంగా మాత్రం నిలిచాడు. చంద్రబాబు సైతం ఎంతోమంది కాళ్లూ గడ్డాలు పట్టుకంటే తప్ప జగన్‌ను నిలువరించలేకపోయాడు. రేపు మళ్లీ నిలువరించే పరిస్థితి కనిపించడం లేదు కూడా. ఇలా వైఎస్ లేకపోయినా.. వైఎస్ వారసుడు ఆ లోటును వందశాతం భర్తీచేసే దిశగా అడుగులేస్తున్నాడు. సొంత కులానికే కాదు.. సమాజానికి, ప్రజాస్వామ్యానికి అవసరమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా కూడా జగన్ రెడీ అయ్యాడు.
మరి లోకేష్‌కు అంతసీనుందా? వైఎస్ మరణించిన తరహా విపత్తు వచ్చిపడితే లోకేష్‌కు నిలిచి గెలిచే శక్తి, తెలివితేటలు ఉన్నాయా? అంటే.. సమాధానం చెప్పడం సులువే. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా లోకేష్ నాలుక మందమే తగ్గలేదు. సరిగా మాట్లాడటమే రావడంలేదు.. ఇతడు అందరినీ నడిపించేంత సమర్థుడు కాదని స్పష్టం అవుతోంది. అందుకే ఇప్పుడు కమ్మోళ్ల ఛాయిస్ కూడా లోకేష్ కాదు. బాబు అనంతరం తారక్ పట్ల మొగ్గుచూపుతున్నారు. చంద్రబాబు నాయుడులో చేవ తగ్గింది అనిపిస్తే.. కమ్మోళ్లు తారక్ దగ్గరకు క్యూ కడతారు కూడా.
చంద్రబాబు ఆఖరి ప్రయత్నం!
తారక్ విషయంలో బాబు, లోకేష్‌లు ఇప్పటికే కుటిలయత్నాలు మొదలుపెట్టారు. అతడి సినిమాకు థియేటర్లు దొరకనీయకపోవడంతో మొదలు చాలా ప్రయత్నాలే చేశాడు. అలాగే బాలయ్య కూడా తారక్ పట్ల కినుకతోనే ఉన్నాడు. పార్టీకి వీలైతే తను, తన అనంతరం అల్లుడు లోకేష్‌లే వారసులు కావాలనేది బాలయ్య లెక్క. బాలయ్యకు పీక సన్న ఆశ లావు. ఈయనకూ ముఖ్యమంత్రి కావాలనే ఉంది. బాబు అనంతరం తను సీఎం కావాలని, అనంతరం లోకేష్‌కు అనేది బాలయ్య లెక్క అంటారు. కాసేపు కూర్చుంటాను అన్నా బాలయ్యకు బాబు సీటు ఇవ్వడనుకోండి.
ఇక తారక్‌ను తొక్కడానికి బాబు ఆఖరి ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకోసం తారక్ చుట్టూ ఉన్న కొమ్మలను నరికేస్తూ వస్తున్నాడు. తారక్‌ను ఒంటరి చేయడానికి హరికష్ణ కూతురుకు తెలంగాణలో టికెట్ ఇచ్చాడు. ఆమె కాకినాడ కోడలు. వారి కుటుంబం కాకినాడ కేంద్రంగానే రాజకీయాలు చేసింది. మరి ఆమెకు టికెట్ ఇస్తే గిస్తే కాకినాడలో ఇవ్వాల్సింది. కానీ.. ఆమెను తెలంగాణ రాజకీయాల్లోకి ఎందుకు తెచ్చినట్టు? ఇక్కడే బాబు గేమ్ స్పష్టం అవుతోంది. ఆమె గెలిస్తే.. తనే ఉద్ధరించాను అని ప్రచారం చేసుకోవచ్చు.
ఓడిపోతే.. మళ్లీ నందమూరి వారి పేరు పార్టీలో వినపడినప్పుడల్లా ఆ ఉదాహరణ చెప్పవచ్చు. తను అవకాశం ఇచ్చినా నందమూరి వాళ్లను జనాలు తిరస్కరించారని.. పార్టీకి నారానే దిక్కు అని బాబు గట్టిగా ప్రచారం చేసుకుంటాడు. గెలిస్తే.. ఆమె ఎలాగూ తెలంగాణకే పరిమితం అవుతుంది. తన తనయుడిని ఆంధ్రాలో హైలెట్ చేసేయత్నంలో ఉన్నాడు బాబు. కాబట్టి.. నందమూరి వారు అలా తెలంగాణకు పరిమితం కావాలన్నమాట. ఇదీ బాబు స్కెచ్.
చూస్తూపోతున్న ఎన్టీఆర్!
మామ గేమ్స్ అన్నీ ఈ పాటికే తారక్‌కు కూడా అర్థమై ఉండాలి. నందమూరి కుటుంబంలో కాస్త గెలివైన(చురుకైన) వాడిగా కనిపిస్తున్నాడు ఈ హీరో. అందుకే.. నారా మామ గేమ్స్‌ను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు తను ఆరాటపడినా దక్కేదేమీ ఉండని అతడికి తెలుసు. బాబును కాదని తనకు సొంతవాళ్లు పట్టంకట్టరు. బాబు తర్వాత తనను ఆపే శక్తి ఎవరికీ లేదు. అంతవరకూ చూస్తూ ఉండటమే. ఈ లౌక్యాన్ని తారక్ బయటకు ప్రదర్శించకపోయినా.. ఈ లౌక్యంతోనే తను కామ్‌గా ఉన్నాడు.
తారక్ సైలెన్స్ చంద్రబాబును మరింత భయపెడుతూ ఉంది. ఒకవైపు పార్టీ అధికారంలో నిలపడానికి రేపు తనయుడిని నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు చాలాకష్టమే పడుతున్నాడు. తన సోదరిని గెలిపించాలని పెట్టిన ట్వీట్లో కూడా తాత, తండ్రిల ప్రస్తావన తెచ్చాడు కానీ.. జూనియర్ ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన తీసుకురాలేదు. ఇది చాలు.. తారక్ అసలు లెక్కలెలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. ఈ లెక్కలు వారసుడి విషయంలో బాబును మరింత టెన్షన్ పెడుతున్నాయి! అసలు కథ వచ్చే ఎన్నికల అనంతరం మొదలు కావొచ్చు!
కల్యాణ్ రామ్ ఇంతకీ ఎటువైపు..?
తారక్‌ను మాత్రమే చంద్రబాబునాయుడు, బాలకృష్ణలు పక్కనపెడుతూ వస్తున్నారు. అదే కల్యాణ్ రామ్‌ను మాత్రం అడపాదడపా అవసరం అయినప్పుడు దగ్గరగానే చూస్తున్నారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కల్యాణ్‌రామ్‌ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. నందమూరి కుటుంబీకులందరినీ ఆహ్వానించారు. ఎన్టీఆర్ తప్ప అందరూ అక్కడ కనిపించారు. ఇక కల్యాణ్‌రామ్ కూడా ఒకవైపు ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉంటూ.. మరోవైపు చంద్రబాబు, బాలయ్యలతో సాన్నిహిత్యాన్ని మెయింటెయిన్ చేస్తున్నాడు.
ఎన్టీఆర్ బయోపిక్‌లో హరి పాత్రలో నటిస్తుండటం కూడా అందుకు నిదర్శనం. ఈ సినిమా విషయంలో కూడా తారక్‌ను బాలయ్య పూర్తిగా పక్కనపెట్టాడు. కల్యాణ్ రామ్‌ను మాత్రం చేరదీశాడు.
-ఎల్.విజయలక్ష్మి
బాబు ముందు ఎన్టీఆర్ ఎంత?
ఎన్టీఆర్ అనే మహాపర్వాతాన్నే కూల్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు. అతడి క్రిమినల్ బ్రెయిన్‌ను తక్కువ అంచనా వేయొద్దు. చంద్రబాబు నాయుడు ముందు తారక్ ఎంత? దుర్మార్గులు తమదారికి అడ్డువచ్చిన వాళ్లందరినీ నరుక్కొంటూ వెళ్లారు. బాబు చాలా పెద్ద క్రిమినల్, అతడికి నందమూరి కుటుంబం ఒక లెక్కకాదు. దిగజారడంలో చంద్రబాబు నాయుడుకు హద్దులేదు.
ఎంతకు దిగజారి అయినా తన పనులు చేసుకుంటాడు. బాబు నీడ ఉన్నంత వరకూ లోకేష్ ఎన్నితప్పులు చేసైనా ఉండగలడు. బాబు అనంతరం.. లోకేష్ కన్నా ముందు భువనేశ్వరి రంగంలోకి దిగవచ్చు. అటువైపు పురందేశ్వరి బరిలోకి దిగవచ్చు.
-నందమూరి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ సతీమణి.
తారక్ పొలిటికల్ ఛరిష్మా ఎక్కడ?
ఎన్టీఆర్ తనయుల్లో హరికృష్ణను, బాలకృష్ణను చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నాడు. ఎన్టీఆర్ వారసత్వం విషయంలో వారిద్దరూ తనకు పోటీ అవుతారేమో అనే భయం బాబుకు అప్పుడు. వారిని తన వ్యూహాలతో బోల్తా కొట్టించాడు. చంద్రబాబుకు అరడజను మంది తోడళ్లుల్లు ఉన్నట్టున్నారు. అయితే వారిలో ఎవరితోనూ భయపడలేదు ఒక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు తప్ప. రాజకీయంగా వాళ్ల ఆసక్తులు, శక్తియుక్తులు తెలుసు కాబట్టి బాబు వారికి భయపడ్డాడు.
వారిని దెబ్బకొట్టడానికి వ్యూహాలను అమలు చేశాడు. కానీ తర్వాతి తరం విషయంలో కూడా బాబు అదే అభద్రతాభావంతో ఉంటాడని అనుకోలేం. తారక్ ఇప్పటికే రాజకీయాల్లోకి ఒకసారి పిక్నిక్లా వచ్చి వెళ్లాడు. అతడు ప్రచారం చేసిన చోట టీడీపీ ఓడిపోయింది.
ఆ తర్వాత కూడా టీడీపీలో ఎన్టీఆర్‌కు అవమానాలు జరిగాయి. అలాగని ఆ పార్టీకి ఎలాంటి నష్టమూ జరగలేదు. తారక్‌కు రాజకీయ ఛరిష్మా లేదని స్పష్టం అవుతోంది. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు, లోకేష్‌లు తారక్‌కు భయపడుతున్నారని అనుకోలేం.
-ఎమ్బీఎస్ ప్రసాద్, విశ్లేషకులు.
జనసేనలోకి ఫ్యాక్షన్ నేత..ఎమ్మెల్యేగా బరిలోకి?!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్