వేటాడంలో కాదు, వేటగాళ్లను వేటాడంలో ఉన్న కిక్కే వేరు. రాజకీయాల్లో ఎప్పుడూ వేటగాళ్లను వేటాడే వాళ్లకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. పశ్చిమబెంగాల్‌లో హ్యాట్రిక్ విజయం సాధించిన మమతాబెనర్జీ గురించి ఈ వేళ దేశమంతా గొప్పగా చెప్పు కుంటున్నారంటే …. అందుకు కారణం ఆమె ప్రత్యర్థులు అత్యంత శక్తిమంతులు కావడమే.
మన దేశంలో తమ కత్తికి అడ్డే లేదని విజయయాత్ర సాగిస్తున్న మోడీ-అమిత్‌షా ద్వయానికి పశ్చిమబెంగాల్ ఫైర్ బ్రాండ్ మమతాబెనర్జీ తానున్నానని నిలువరించారు. వెన్నుచూపి హస్తినకు పారిపోయేలా చేశారు. అందుకే మమతాబెనర్జీ అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అభిమానించడమే కాదు, ఆరాధిస్తున్నారు. ఆమెలో కలకత్తా కాలికామాతను చూసుకుంటున్నారు.
పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ సాధించిన విజయం ఎంతో ప్రత్యేకం. భవిష్యత్ ఆశాకిరణంగా మమతాబెనర్జీ కనిపిస్తున్నారు. అసలు మోడీ -అమిత్‌షా ద్వయానికి అడ్డే లేదా అని ఆందోళన చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మమత రూపంలో ఓ ప్రత్యామ్నాయం తెరపైకి వచ్చింది. మోడీ-అమిత్‌షా ద్వయం ఓటమికి అతీతం కాదని పశ్చిమబెంగాల్‌లో మమత నిరూపించి, దేశానికి ఓ శుభసంకేతాన్ని పంపారు.
మమతను ఓడించడానికి మోడీ -అమిత్‌షా ద్వయం చేయని కుట్రలు లేవు. ప్రయోగించని అస్త్రాలు లేవు. కానీ ఆ మహిళా శక్తి ఎదుట వాళ్లిద్దరి అస్త్రాలు, శస్త్రాలు నీరుగారాయి. 200కు పైగా సీట్లు సాధించి పశ్చిమ బెంగాల్ పవర్ ఏంటో వరుస విజయాలు నమోదు చేసుకుంటున్న బీజేపీకి రుచి చూపించారామె.
తాజా తీర్పుతో భారత్‌ను బెంగాల్ రక్షించిందని ఆమె వ్యాఖ్యానించడం ఎంతో సముచితమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తీర్పు ద్వారా భారత్‌ను, మత సామరస్యాన్ని రాష్ట్రం రక్షించిందన్నారు. మోడీ, అమిత్ షా ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం గురించి ప్రచారంలో మాట్లాడారని, ఎన్నికల్లో తమ పార్టీ ‘డబుల్ సెంచరీ’ కొట్టిందని దెప్పి పొడిచారు.
మమతాబెనర్జీ అంటే సాహసానికి ప్రతీకగా నిలిచారు. ఒకప్పుడు తన ముఖ్య అనుచరుడైన సువేందు అధికారిపై పోటీకి దిగి సవాల్‌ను ఎదుర్కొన్నారు. జంగల్‌మహల్ ప్రాంతంలో దాదాపు 65-70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సువేందు అధికారి కుటుం బానికి పట్టు ఉన్నట్టు తెలుస్తోంది. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సువేందు విరిసిన సవాల్‌ను స్వీకరించి నందిగ్రామ్‌లో అతనితో తలపడ్డారు. స్వల్ప ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు.
కానీ ఆమె చాలెంజ్‌ను స్వీకరించడం, మరో చోట పోటీ చేయకపోవడం, అక్కడ వీరోచిత పోరాటం …ఇవన్నీ భారతీయుల మనసులను గెలుచుకున్నాయి. అందుకే మమతాబెనర్జీ ఈ వేళ దేశానికో దిక్సూచిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు.