మంత్రి పదవికోసం చండీయాగం

రాజకీయ జీవితంలో ఎవరికైనా మంత్రి పదవి అంటేనే మోజు. దాని కోసమే గోడలు దాటుతారు. పార్టీ హద్దులను కూడా చెరిపేస్తారు. ఎన్నో ఎన్నెన్నో చేస్తారు. ఇక మరో ఆరు నెలలలో జగన్ తన మంత్రివర్గాన్ని…

రాజకీయ జీవితంలో ఎవరికైనా మంత్రి పదవి అంటేనే మోజు. దాని కోసమే గోడలు దాటుతారు. పార్టీ హద్దులను కూడా చెరిపేస్తారు. ఎన్నో ఎన్నెన్నో చేస్తారు. ఇక మరో ఆరు నెలలలో జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారు అన్నది బహిరంగ రహస్యమే. దాంతో ఇప్పటి నుంచే బెర్త్‌లను కన్‌ఫర్మ్ చేసుకోవడానికి నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. 

శ్రీకాకుళం జిల్లా వైసీపీకి చెందిన పెద్దాయన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. నిజానికి ఆయన ఏడు పదులు దాటిన ఈ వయసులో పోటీ చేసింది కూడా మరోసారి మంత్రిగా దర్జా చలాయించాలనే. ఆయన చంద్రబాబు ప్రభుత్వాలలో మంత్రిగా చేశారు. 

గత రెండు దశాబ్దాలుగా ఆయన రాజకీయం తారుమారు అయింది. వైసీపీలో ఎట్టేకలకు గెలిచిన తమ్మినేని మంత్రి కావాలని అనుకుంటున్నారు. జిల్లాలో సామాజిక సమీకరణల నేపధ్యంలో ఆయనకు స్పీకర్ పదవిని జగన్ ఇచ్చారు. అయితే విస్తరణ నేపధ్యంలో ఆయనలో కొత్త ఆశలు మళ్లీ మొగ్గతొడుగుతున్నాయని అంటున్నారు. 

ఈ మధ్యన ఆయన హఠాత్తుగా చండీయాగాన్ని జరిపించారు. లోక కళ్యాణం కోసం ఈ యాగమని పైకి చెబుతున్నా తన కోరికలు ఈడేరాలని గట్టిగా మొక్కుతూ చేసిన యాగంగా సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తమ్మినేని తన మంత్రి పదవి విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారని అర్ధమైపోతోంది. జగన్ ఆయన విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.