రోబో 2 కొనకుండా 4 కోట్ల లాభం

రోబో 2 సినిమా తెలుగు హక్కుల వివాదం మొత్తానికి ముగిసింది. ఏషియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు, తదితరులు కలిసి 82 కోట్లకు రోబో తెలుగు హక్కులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అడ్వాన్స్ ఇచ్చి…

రోబో 2 సినిమా తెలుగు హక్కుల వివాదం మొత్తానికి ముగిసింది. ఏషియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు, తదితరులు కలిసి 82 కోట్లకు రోబో తెలుగు హక్కులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అడ్వాన్స్ ఇచ్చి లైకాతో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో కూడా రిలీజ్ డేట్ ఏమీ లేదు.. ఏదో ఫలానా డేట్ కు వస్తామని అన్నారు అంతే. కానీ అలా రాలేదు.

దాంతో అడ్వాన్స్ వెనక్కు అడిగారు. లైకా సగానికి పైగా వెనక్కు ఇచ్చి, మిగిలినది విడుదలకు ఇస్తామని చెప్పింది. ఈ లోగా వేరే పార్టీ ఎంటర్ అయింది. రోబో 2 హక్కులు ఎన్వీప్రసాద్, దిల్ రాజు కలిసి వాళ్లకు వాళ్లకు నచ్చిన షరతుల మేరకు తీసుకున్నారు.

అంతవరకు బాగానే వుంది కథ. కానీ అక్కడే వచ్చింది అసలు చిక్కు. తమ అడ్వాన్స్ కు వడ్డీ ఎవరు ఇస్తారు అని ఏషియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ అడ్డం తిరిగినట్లు బోగట్టా. నిజానికి ఇండస్ట్రీలో అడ్వాన్స్ కు వడ్డీ ఇచ్చే సంప్రదాయం పెద్దగా లేదు. ఇచ్చినవాడి బలం, బలగాన్ని బట్టి తప్ప.

దగ్గుబాటి సురేష్ బాబు ను, ఏషియన్ సునీల్ ను కాదని, సినిమాను తెలుగునాట సగానికి పైగా ఏరియాల్లో విడుదల చేయడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే లైకా సంస్థ దిగివచ్చినట్లు బోగట్టా. వడ్డీగా నాలుగు కోట్లు చెల్లించడానికి ఒప్పుకుని సెటిల్ మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

రోబో 2 కొన్న వారికి ఏం లాభం వస్తుందో లేదో కానీ, అడ్వాన్స్ ఇచ్చి వెనక్కు తీసుకున్నందుకు నాలుగు కోట్లు ముట్టింది. నిజానికి వాళ్లకే సినిమా ఇచ్చి, అవుట్ రేట్ మీద తీసుకుని, సినిమా తేడా చేస్తే, రూపాయి రాదు. పైగా నష్టం వుంటుంది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా నాలుగు కోట్ల లాభం అన్నమాట.

ఏమైనా ఏషియన్ సునీల్, సురేష్ బాబు గట్టివాళ్లు.