అంతా వాళ్లే.. ‘అలా’ హీరో మారాడంతే

ఎట్టకేలకు మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రకటన రోజే రిలీజ్ ఎప్పుడనేది కూడా చెప్పేశారు. పనిలోపనిగా ఇప్పుడు నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక కూడా…

ఎట్టకేలకు మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రకటన రోజే రిలీజ్ ఎప్పుడనేది కూడా చెప్పేశారు. పనిలోపనిగా ఇప్పుడు నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక కూడా మొదలైంది.

సరిగ్గా ఇక్కడే మహేష్ సినిమాకు అల వైకుంఠపురములో సినిమాతో పోలిక వస్తోంది. ఎందుకంటే.. దాదాపు అల వైకుంఠపురములో సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్సే మహేష్ సినిమాకు కూడా వర్క్ చేయబోతున్నారు.

త్రివిక్రమ్-మహేష్ ప్రాజెక్టు కు అందరకంటే ముందు ఫైనలైజ్ అయిన వ్యక్తి తమన్. అల వైకుంఠపురములో మేజిక్ తో తమన్ ను ఇప్పట్లో వదిలేలా లేడు త్రివిక్రమ్. సో.. మహేష్ సినిమాకు కూడా అతడే రిపీట్ అవుతున్నాడు.

ఇటు తమన్ తో పాటు అటు పూజా హెగ్డేకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు త్రివిక్రమ్. మరోసారి ఆమెనే రిపీట్ చేయబోతున్నాడు. ఈ మేరకు పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కొన్ని కీలక పాత్రల కోసం రావురమేష్, మురళీ శర్మ, సునీల్ ను కూడా అనేసుకున్నాడు త్రివిక్రమ్.

ఇలా ఎట్నుంచి ఎటు చూసుకున్నా ఈ సినిమా మరో ''అల వైకుంఠపురములా'' అనిపిస్తోంది తప్ప కొత్తదనం కనిపించడం లేదు. టబు, సముత్తరఖనిని కూడా తీసుకుంటే లాంఛనం పూర్తయినట్టే. దీనికి మరింత బలం చేకూరుస్తూ ''అల'' టైపులోనే మహేష్ సినిమాకు కూడా ఫ్యామిలీ కథనే సెలక్ట్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఇక్కడ దర్శకుడు సెలక్ట్ చేశాడు అనేకంటే, మహేషే ఏరికోరి రాయించుకున్నాడనడం కరెక్ట్.

ఇలా నిర్మాత, దర్శకుడు, కథ, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్.. అంతా బన్నీ సినిమాకు పనిచేసిన యూనిట్టే మహేష్ మూవీకి కూడా రిపీట్ అవ్వబోతోంది. రిజల్ట్ కూడా అదే రిపీటైతే అందరూ హ్యాపీ. లేదంటే మరో విశ్వప్రయత్నం వృధా అయినట్టు అవుతుంది.