అంబానీ కూడా చంద్ర‌బాబు చేజారిన‌ట్టేనా!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు, ఆయ‌న కోట‌రికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  చాలా స‌న్నిహితుడు అనే ప్ర‌చారం ఇప్ప‌టిది కాదు. చంద్ర‌బాబు నాయుడు వివిధ సంద‌ర్భాల్లో అంబానీ రెఫ‌రెన్స్ ను ఉప‌యోగించుకున్నార‌నే…

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు, ఆయ‌న కోట‌రికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  చాలా స‌న్నిహితుడు అనే ప్ర‌చారం ఇప్ప‌టిది కాదు. చంద్ర‌బాబు నాయుడు వివిధ సంద‌ర్భాల్లో అంబానీ రెఫ‌రెన్స్ ను ఉప‌యోగించుకున్నార‌నే ప్ర‌చార‌మూ కొత్త‌ది కాదు. ఇటీవ‌లి ఐటీ రైడ్స్ త‌ర్వాత కూడా చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను చుట్టుముట్టిన ఇబ్బందుల‌ను అంబానీ ద్వారా త‌ప్పించుకుంటార‌నే ప్ర‌చార‌మూ ఒక‌టి సాగింది. మోడీ వ‌ద్ద ముఖేష్ అంబానీకి మంచి ప‌లుకుబ‌డి ఉండ‌టం, ఆ అంబానీకి చంద్ర‌బాబు నాయుడు బంటులాంటి వ్య‌క్తి అనే ప్ర‌చారం ఉండ‌టం..ఇలాంటి నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో కూడా చంద్ర‌బాబు నాయుడును ఎవ‌రూ ఏం చేయ‌లేర‌నే అభిప్రాయాలున్నాయి!

ఇవ‌న్నీ తెలుగు రాజ‌కీయ స‌ర్కిల్స్ లో ఉన్న అభిప్రాయాలు. క‌ట్ చేస్తే.. ముఖేష్ అంబానీ వెళ్లి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయ్యారు. అదేదో రాజ్య‌స‌భ సీటు వ్య‌వ‌హారం అని, త‌న స‌న్నిహితుడికి రాజ్య‌స‌భ సీటును ఇప్పించుకోవ‌డానికి ముఖేష్ స్వ‌యంగా క‌దిలి వ‌చ్చారనేది టాక్. అటు బీజేపీ ద్వారా కూడా ముఖేష్ అడిగించ‌డంతో జ‌గ‌న్ ఓకే చెప్పార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. అవ‌స‌రం అంబానీది.. దీంతో ఆయ‌నే క‌దిలివ‌చ్చారు.

త‌నే స్వ‌యంగా వ‌చ్చి అడిగారంటే.. ఈ రాజ్య‌స‌భ సీటు ఆయ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో కూడా అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి నేప‌థ్యంలో.. ఆ అవ‌కాశం క‌ల్పిస్తే జ‌గ‌న్ కు కూడా అంబానీ సానుకూలుడు కావొచ్చు. అది రాష్ట్రానికి ఉప‌యోగ‌ప‌డితే మంచిదే.  అయితే ఇది తెలుగుదేశం పార్టీకి మాత్ర‌మ మింగుడు ప‌డే అంశం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కూ అంబానీ అంటే చంద్ర‌బాబు నాయుడుకు ఒక ర‌హ‌స్య వార‌ధి అనే అభిప్రాయాలు ఉన్నాయి. చంద్ర‌బాబును ఆయ‌న కాపాడుకుంటార‌నే టాక్ ఉండేది. ఇప్పుడు ఆయ‌నే వెళ్లి త‌న అవ‌స‌రం మేర‌కు జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఇలాంటి నేప‌థ్యంలో చంద్ర‌బాబు విలువ అంబానీ  వ‌ద్ద మ‌రింత ప‌డిపోయిన‌ట్టే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. చంద్ర‌బాబును ఏ అర్ధ‌రాత్రి అయినా అంబానీ ర‌క్షించేస్తాడు అనే అభిప్రాయాలు  వీగిపోతూ ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.