ఎవరొస్తారా అని కాచుకొని ఉంటారు …!

గోతికాడ నక్కలు అంటారే… ప్రస్తుతం బీజేపీ నాయకులు ఆ టైపులో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో వారు గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు. ఎవరు దొరికితే వారిని పార్టీలో చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. పార్టీ ఫిరాయింపులను…

గోతికాడ నక్కలు అంటారే… ప్రస్తుతం బీజేపీ నాయకులు ఆ టైపులో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో వారు గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు. ఎవరు దొరికితే వారిని పార్టీలో చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బీజేపీ ఎప్పుడూ ముందే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మట్టి కురిపించాలని ఆ పార్టీ లక్ష్యం కదా.

అందుకే కేసీఆర్ వ్యతిరేకులను బీజేపీలోకి లాగడమే పనిగా పెట్టుకున్నారు ఆ పార్టీ నాయకులు. బీజేపీ నాయకులు అప్పుడే ఈటల రాజేందర్ మీద కన్నేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఈటలకు పడటం లేదని అందరికీ ఎప్పటినుంచో తెలుసు. కేసీఆర్ ఆయన్ని ఏదో ఒకటి చేస్తాడని కూడా తెలుసు. నిన్న సాయంత్రమే ఆయనపై ఆరోపణలు టీఆర్ఎస్ బయటపెట్టింది. కేసీఆర్ ఈరోజు ఆయన మంత్రి పదవి కూడా తాను తీసేసుకున్నారు.

ప్రస్తుతం ఆయన పదవిలేని మంత్రి. త్వరలో మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఈటల మీద కన్నేశారు. ఈటల కేసీఆర్ కు ఇప్పుడు శత్రువైపోయాడు కాబట్టి ఆయన్ని పార్టీలో చేర్చుకొని ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. 

ఈటల రాజేందర్ వస్తే పార్టీలో చేర్చుకునే విషయమై పార్టీ నాయకత్వం ఆలోచిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అప్పుడే కామెంట్ చేశాడు. దీన్నిబట్టి చూస్తే వాళ్ళు ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడానికి ఎంతగా ఆరాటపడుతున్నారో అర్థమవుతుంది. బీజేపీ వాళ్లకు టీఆర్ఎస్, కాంగ్రెస్ అనే తేడా ఏమీలేదు. ఆ రెండు పార్టీల నుంచి ఎవరు బయటకు వచ్చినా చేర్చుకుంటారు. 

కేసీఆర్ వ్యతిరేకులైతే చాలు. కొంతకాలం కిందట కాంగ్రెస్ కురువృద్ధుడు జానా రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి బలమైన అభ్యర్థి దొరకలేదు. బలమైన అభ్యర్థి అంటే టీఆర్ఎస్ అభ్యర్థిని ఢీ కొట్టగల సత్తా ఉన్న అభ్యర్థి అన్నమాట.

అప్పుడు జానా రెడ్డి పేరు తెరపైకి తెచ్చారు బీజేపీ నాయకులు. కొంతకాలం కిందట కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరతాడనే ప్రచారం జరిగింది. జానా రెడ్డి, కొండా విషయంలో ఏమీ కాలేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ పైన పడ్డారు. వాస్తవానికి ఈటల ఇంకా టీఆర్ఎస్ లోనే ఉన్నాడు. పార్టీ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి పంపించలేదు. ఈటల తనకు తానై బయటకు రాలేదు. అసలు ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో తెలియదు.

వాస్తవానికి ఈటలకు సొంత పార్టీ పెట్టగల సత్తా ఉంది. ఆయన బీజేపీలో చేరతాడని ఎవరూ ఊహించడంలేదు. బీజేపీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈటలకు బీజేపీ వల్ల ప్రయోజనం కలుగుతుందని అనుకోలేం. కానీ బీజేపీ వాళ్ళు ఆరాటపడిపోతున్నారు. చూడాలి మరి ఈటల రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో.