హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో ఎన్నో సినిమాలకు వర్క్ చేశాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు. అలాగని, కాజల్‌ని అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టేస్తే ఎలా.? ఛాన్స్ ఇచ్చింది కదా అని అడ్వాంటేజ్ తీసుకుని.. ఛోటా కె నాయుడు అడ్డంగా బుక్కయిపోయాడు. షేక్ హ్యాండ్ వరకూ ఓకే. కాస్త చనువు వుంటే, హగ్ వరకూ ఫర్లేదేమో. ముద్దు పెట్టేయడమేంటి.? సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ఛోటా కె నాయుడుని సినీ పరిశ్రమ నుంచి బయటకు పంపేయాలంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.
'బ్యాన్ ఛోటా కె నాయుడు' అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌తో కూడిన యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో, ఛోటా కె నాయుడు డ్యామేజీ కంట్రోల్ చర్యలకు దిగాడు. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఛోటా కె నాయుడు 'బిహేవియర్'ని ఎవరూ సమర్థించలేని పరిస్థితి.
'కాజల్‌తో నాకు ఎప్పటినుంచో పరిచయం వుంది. ఆమె నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా భావిస్తుంది..' అంటూ తాజాగా వివరణ ఇచ్చాడు ఛోటా కె నాయుడు. ఇక్కడితో వివాదం ఆగిపోతుందా.? ఛాన్సే లేదు. చాలామంది హీరోలు, హీరోయిన్లు సినీ వేదికలపై పరస్పర అభివాదం చేసుకుంటుంటారు.
ఈ క్రమంలో ఒకరి మీద ఒకరు తమ అభిమానాన్ని, ప్రేమని చాటుకునేందుకు.. 'హగ్' ఇచ్చుకోవడం కూడా మామూలే. కానీ, ఛోటా కె నాయుడులా 'అతి' చేయడం మాత్రం అతి కొద్దిమందికే చెల్లుతుంది. పొరపాటుకి చింతిస్తున్నానని ఛోటా కె నాయుడు చెప్పివుంటే, బావుండేదేమో.
అసలే, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, టాలీవుడ్ అన్న తేడాల్లేకుండా 'మీ..టూ..' ఉద్యమానికి సినీ పరిశ్రమలన్నీ అతలాకుతలమైపోతున్నాయ్. 'ఛోటా' ఇష్యూ అని ఈ సినిమాటోగ్రాఫర్ లైట్ తీసుకోవచ్చుగానీ, ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యే ప్రమాదం లేకపోలేదు.
షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చెయ్యి అలా చాచడమే కాజల్ చేసిన నేరమైపోయింది. ఛోటా అలా చేస్తాడని ఊహించని కాజల్, 'ముద్దు' తర్వాత వెంటనే తేరుకుని, 'ఛాన్స్ పే డాన్స్' అంటూ లైట్ తీసుకున్నట్లు వ్యవహరించాల్సి వచ్చింది.