8 కిలోమీటర్లకు 82 వేల రూపాయలు ఛార్జీ

ప్రపంచంలో ఎక్కడా ఇంత ఖరీదైన ప్రయాణం ఉండదేమో. బహుశా ఈ దూరానికి ప్రైవేట్ జెట్ లో కూడా ఇంత వసూలు చేయరు. కానీ హైదరాబాద్ లో అంబులెన్స్ కు మాత్రం ఈ రేటు ఇచ్చుకోవాల్సిందే.…

ప్రపంచంలో ఎక్కడా ఇంత ఖరీదైన ప్రయాణం ఉండదేమో. బహుశా ఈ దూరానికి ప్రైవేట్ జెట్ లో కూడా ఇంత వసూలు చేయరు. కానీ హైదరాబాద్ లో అంబులెన్స్ కు మాత్రం ఈ రేటు ఇచ్చుకోవాల్సిందే. కరోనా కల్లోలంలో ప్రైవేట్ అంబులెన్సుల దందాకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది.

ఓ కరోనా రోగి ప్రైవేట్ హాస్పిటల్ కు వస్తే ఎలా దోచుకుంటున్నారో అందరం చూస్తున్నాం. ఈ విషయంలో ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్ అనే తేడా లేదు. అందరూ ఒక్కటే. దొరికినంత దోచుకోవడమే. అయితే చాలామంది ఇంతవరకు మాత్రమే చూస్తున్నారు. హాస్పిటల్ లో కరోనా రోగి చనిపోయిన తర్వాత సంగతేంటి?

ఇక్కడ మరో దందా మొదలవుతుంది. అదే ప్రైవేటు అంబులెన్సుల దందా. మృతదేహాన్ని అంబులెన్స్ లో స్మశాన వాటికకు తరలించాలంటే వేలల్లో సమర్పించుకోవాల్సిందే. కరోనా రోగి మృతదేహం కాబట్టి ఇంటికి తీసుకెళ్లడానికి వీల్లేదు. హాస్పిటల్ నుంచి నేరుగా స్మశాన వాటికకు తీసుకెళ్లాలి. సరిగ్గా ఇక్కడే తమ రాక్షసత్వం చూపిస్తున్నాయి ప్రైవేట్ అంబులెన్సులు. కనీస మానవత్వం, కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి.

మొన్నటికిమొన్న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా రోగి చనిపోతే ప్రైవేట్ అంబులెన్స్ తో మృతదేహాన్ని తరలించడానికి బంధువులు అక్షరాలా 82 వేల రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చింది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్ నంబర్-1 నుంచి హైటెక్ సిటీ స్మశాన వాటికకు 15 నిమిషాల ప్రయాణం. ఇంకా చెప్పాలంటే 8 కిలోమీటర్ల దూరం. ఆ దూరానికే 82 వేల రూపాయలు ఛార్జ్ చేశారు ప్రైవేట్ అంబులెన్స్ యాజమాన్యం.

మరో ఘటనలో గాంధీ హాస్పిటల్ నుంచి ఎర్రగడ్డ స్మశాన వాటికను కరోనా మృతదేహాన్ని తరలించడానికి అక్షరాలా 80వేల రూపాయలు కట్టింది మరో కుటుంబం. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా వెతలకు అంతులేదు. ఆ కష్టాలకు ఫుల్ స్టాప్ లేదు. కొంతమంది ప్రైవేట్ అంబులెన్సులైతే హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడే స్మశానంలో అంత్యక్రియలకు కూడా కలిపి ప్యాకేజీ కింద లక్షల్లో వసూలు చేస్తున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో ప్రస్తుతం 428 అంబులెన్సులు (108) అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ కరోనా వేళ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. తాజాగా జీవీకే సంస్థ మరో 79 అంబులెన్సుల్ని పెంచింది. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా ఉచిత అంబులెన్సు సర్వీస్ ప్రారంభించింది. అయినప్పటికీ రోజుకు 350 నుంచి 400 కాల్స్ వస్తున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య కొంతమంది ప్రైవేట్ అంబులెన్సుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా వేలల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది.