వైద్యం, ఆరోగ్యం కేసీఆర్‌కే…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్వ‌యంగా రుచి చూస్తున్నారు. అది ఎంత చేదో ఇప్పుడిప్పుడే రాజేంద‌ర్ అనుభ‌వంలోకి వ‌స్తోంది. ఈట‌ల నుంచి వైద్య‌, ఆరోగ్య‌శాఖ నుంచి…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్వ‌యంగా రుచి చూస్తున్నారు. అది ఎంత చేదో ఇప్పుడిప్పుడే రాజేంద‌ర్ అనుభ‌వంలోకి వ‌స్తోంది. ఈట‌ల నుంచి వైద్య‌, ఆరోగ్య‌శాఖ నుంచి పీకి ప‌డేశారు. అంతేకాదు, కీల‌క‌మైన ఆ శాఖ‌ను కేసీఆర్ త‌న‌కు బ‌దిలీ చేయించుకున్నారు.

మంత్రి ఈట‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. క‌నీసం 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌నే రాజేంద‌ర్‌కు సంబంధించిన ప‌రిణామాలు శ‌ర‌వేగంగా చోటు చేసుకుంటున్నాయి. రాజేంద‌ర్‌పై క‌బ్జా ఆరోప‌ణ‌లు దాదాపుగా నిజ‌మేన‌ని విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు ప్రాథ‌మికంగా తేల్చారు.

ఈ మేర‌కు నివేదిక‌ను ముఖ్య‌మంత్రికి సీఎస్‌, ఏసీబీ డీజీ అందించారు. ఒక్క నిమిషం కూడా ఆల‌స్యం చేయ‌కుండా రాజేంద‌ర్‌ను వైద్య‌, ఆరోగ్య‌శాఖ నుంచి త‌ప్పించ‌డంతో పాటు త‌న‌కు బ‌దిలీ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్‌కు సీఎం సిఫార్సు చేశారు. 

సీఎం కోరిక మేర‌కు గ‌వ‌ర్న‌ర్ వైద్య‌, ఆరోగ్య‌శాఖ నుంచి త‌ప్పించారు. అలాగే సీఎంకు బ‌ద‌లాయించారు. దీంతో రాజేంద‌ర్‌కు కోర‌లు పీకిన‌ట్టైంది. ఎలాంటి శాఖ‌లేని మంత్రిగా ఈట‌ల మిగిలిపోయారు.

త‌న శాఖ మార్పుపై రాజేంద‌ర్ స్పందిస్తూ …తన శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసిందన్నారు. ఇందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానన్నారు. ప్లాన్‌ ప్రకారమే త‌న‌పై భూకబ్జా ఆరోపణలు చేశారన్నారు.