కుక్కను చంపాలంటే దానికి పిచ్చికుక్క అని పేరు పెట్టాలి. అప్పుడు చంపినా సమస్య ఉండదు. తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. నిజానికి ఈటల వ్యవహారం ఇప్పటికిప్పుడు హఠాత్తుగా పుట్టి పెరగలేదు.
ఈటల విషయంలో ఏమైనా జరగవచ్చని కొంతకాలంగా అనుకుంటున్నదే. ఈటల అప్పుడప్పుడు కేసీఆర్ ను పరోక్షంగా ఏదో ఒకటి అనడం, దీనిపై మీడియాలో వెంటనే ధిక్కార స్వరం వినిపిస్తున్నాడని వార్తలు రావడం సర్వ సాధారణమైపోయింది.
దీనికి తగ్గట్లుగానే కొందరు ప్రతిపక్ష నాయకులు ఈటలను సమర్ధించడం, కేసీఆర్ ను విమర్శించడంతో ఈటలకు ఏదో ఒకరోజు మూడుతుందని జనం అనుకుంటూనే ఉన్నారు. చిరిగి చిరిగి చింకి చాప అయిందని తెలుగులో ఒక సామెత. చాప ఒక్కసారి చిరగడం మొదలైతే అది మరింతగా చిరిగిపోతుంది.
ఈటల వ్యవహారం కూడా ఇలాంటిదే. ఇద్దరి మధ్య పొరపచ్చాలు ఏర్పడకుండానే ఉండాలి. వాళ్ళు రాజకీయ నాయకులు కావొచ్చు. మామూలు మనుషులు కావొచ్చు. ఒక్కసారి విభేదాలు రావడం మొదలైతే అవి మరింతగా పెరిగిపోతాయి. రాజకీయాల్లో నాయకులకు వారి స్వప్రయోజనాలే ప్రధానం కాబట్టి అందుకోసం కొందరు బలికాక తప్పదు.
ఈటల రాజేందర్ నిజంగా భూకబ్జాలు చేశాడో చేయలేదో తెలియదు. నిజంగానే ఆయన చేయలేదని అనుకుందాం. అయినప్పటికీ వేటు వేయాలనే నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ ను ఎవ్వరూ ఆపలేరు. ఈటల భూకబ్జాలపై విచారణ చేసే అధికారులు కేసీఆర్ అభిమతానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వలేరుగా.
ఇక్కడ కేసీఆరే కాదు ఆయన స్థానంలో మరొకరు సీఎంగా ఉన్నాఇలాగే జరుగుతుంది. ఈటల భూకబ్జాలు గురించి నమస్తే తెలంగాణా పత్రికతోపాటు, టీఆర్ఎస్ న్యూస్ ఛానెల్ టీ న్యూస్ లో, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా మరో మూడు టీవీ ఛానెళ్ళలోనో ఏకకాలంలో వార్తలు ప్రసారమయ్యాయి.
కాబట్టి ఈటలకు పిచ్చికుక్క అని పేరు పెట్టడానికి పక్కా ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోపణల ముద్ర వేసి తొలగించబోతున్న రెండో మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అప్పట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ రాజయ్యను తొలగించారు. ఆయనపై అప్పట్లో యేవో ఆరోపణలు వచ్చాయి.
అవేమిటో ఇప్పడు జనాలకు గుర్తు కూడా లేదు. అప్పట్లో రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినా జనం పట్టించుకోలేదు. పెద్దగా స్పందించలేదు. రాజయ్య కూడా గమ్మున ఉండిపోయాడు. కానీ ఈటల వ్యవహారం అలా కాదు. ఒకవేళ ఈటలను తొలగిస్తే రాజకీయ ప్రకంపనలు కలిగే అవకాశం ఉంది.
మంత్రులను ఉంచుకోవాలా, తొలగించాలా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం . ప్రతిపక్షాలకు సంబంధం ఉండకూడదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొందరు మంత్రుల పట్ల ప్రతిపక్షాలు సానుభూతి చూపిస్తున్నాయి. అలాంటివారు ఇద్దరు కనబడుతున్నారు. ఒకరు ఈటల రాజేందర్, మరొకరు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు.
నిజంగా సీఎం కేసీఆర్ అవినీతిని సహించడని అనుకుందాం. కొంతమంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ వారిమీద వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలేమిటో ఏనాడైనా నిగ్గుతేల్చారా ? ఈ విషయం జనాలకు తెలియదు.
ఎందుకంటే … ఆయన సొంత మీడియాలోనూ, ఆయనకు అనుకూల మీడియాలోనూ వార్తలు రాలేదు. మిగతా పత్రికల్లో వచ్చినా ఆయన పట్టించుకోడు కదా. మంత్రులు గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి …వారందరి మీద భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏనాడూ కేసీఆర్ స్పందించిన దాఖలాలు లేవు. స్వయంగా కేటీఆర్ పైనే ఆరోపణలు వచ్చాయి. రాజకీయాల్లో ఆరోపణలు రావడం సహజం.
కానీ అవి నిజమో అబద్ధమో తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి బాధ్యత ఈటల విషయంలోనే గుర్తుకొచ్చింది. ఎవరినైతే వదిలించుకోవాలనుకుంటాడో వారి విషయంలోనే విచారణ జరుపుతారు. నిజానికి ఈటలను మంత్రివర్గం నుంచి తీసేయాలని అనుకుంటే తీసేయొచ్చు. అందుకు కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈటల అవినీతి చేశాడు అని ముద్ర వేయాలనేది కేసీఆర్ ఆలోచన కావొచ్చు.