పెళ్లి కూతురి ముఖంలో ఏదో ఆందోళన. ఎవరి కోసమో ఎదురు చూపులు. పెళ్లి కొచ్చిన అందరి మొహాల్లో సంతోషం ఉంటుందే కానీ, పెళ్లి కూతురిలో మాత్రం టెన్షన్. ఇక భాజాభజంత్రీలు మోగించాలని పురోహితుడి సూచనతో ఆ తంతు మొదలవుతుంది. పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టడానికి వరుడు సిద్ధమవుతుంటాడు…అప్పుడే ఎదురుగా ఆరడుగుల అందగాడు ఆమెకి కనిపిస్తాడు. అంత వరకూ ఆమెలో కనిపించిన ఆందోళన ఆ క్షణాన ఆవిరవుతుంది. ఆమె కళ్లలో వెయ్యి ఓల్టుల కాంతి. మొహంలో అమితానందం. ఆ వెంటనే ఆమె నోటి వెంట ‘ఆపండి ఈ పెళ్లి….నా కిష్టం లేదు’ అని గట్టిగా అరుస్తుంది. దీంతో పెళ్లి మండపం అంతా భూకంపం వచ్చినంతగా దద్దరిల్లిపోతుంది….సహజంగా ఇలాంటి సీన్స్ మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ సినిమాను తలపించే ఇలాంటి ఘటన తెలగాంణలో శుక్రవారం చోటు చేసుకొంది. పీటలపై పెళ్లి ఆగిపోయింది.
తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లిలో పెళ్లి సందడి. కేవలం కొన్ని క్షణాలు గడిస్తే చాలు పెళ్లి తంతు ముగుస్తుంది. కానీ క్షణాల వ్యవధిలో పెళ్లి మండపంలో ఊహించని పరిణామంతో పెళ్లి ఆగిపోయింది. కొత్తకోట రూరల్ పరిధిలోని పామాపురం గ్రామానికి చెందిన నందినితో అదే మండలం చర్లపల్లికి చెందిన వెంకటేశ్‌కు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 28న శుక్రవారం ఉదయం 8.10 గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.
పెళ్లి ముహూర్త శుభ ఘడియలు రానే వచ్చాయి. పీటలపై వరుడు, వధువు ఆసీనులయ్యారు. పురోహితులు మంత్రాలు చదువుతూ సాంగ్యాలు ఒకొక్కటిగా పూర్తి చేస్తున్నారు. పెళ్లి కుమార్తె తలపై జీలకర్ర, బెల్లం పెట్టాలని వరుడిని పురోహితులు పురమాయించారు. ఆ క్షణాన్నే వధువుకు ఎదురుగా తన మేనబావ కనిపించాడు.
ఒక్కసారిగా ఆమె … ‘ఈ పెళ్లి ఆపండి…నాకిష్టం లేదు’ అని గట్టిగా అరుస్తూ లేచి నిలబడింది. ఆ అరుపులకు పెండ్లి కుమారుడు వెంకటేశ్ బెదిరిపోయాడు. పెండ్లి మండపం మార్మోగింది. పెళ్లికి వచ్చిన వారంతా ఏం జరిగిందో అర్థం కాక, అవాక్కయ్యారు. పెళ్లి కుమార్తెను తల్లిదండ్రులు పక్కకు తీసుకెళ్లి ‘ఏమైందని’ ఆరా తీశారు. తనకు మేనబావంటే ఇష్టమని, అతన్ని చేసుకుంటానని చెప్పింది. తాళి వరకు వచ్చిన పెళ్లిని కాదనవద్దని, కూతురికి సర్ది చెప్పేందుకు యత్నించారు. కానీ ఆమె వినిపించుకోలేదు.
పెళ్లి కుమార్తె బావపై వరుడి సంబంధీకులు దాడికి యత్నించారు. పెళ్లి కాస్తా రసాభాస అయ్యింది. ఈ లోపు సినీ పక్కీలో పోలీసులు ప్రవేశించారు. వధువుకు ఇష్టం లేని పెళ్లి చేయవద్దని ఇరువైపు పెద్దలను హెచ్చరించారు. ఆ తర్వాత పోలీసులు అందరికీ సర్ది చెప్పి అక్కడి నుంచి పంపి వేశారు. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఈ వార్త తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైంది.