ఎమ్బీయస్ : ‘బేగమ్’ మమతా బెనర్జీ?

బెంగాల్ ఎన్నికలలో బిజెపి, మమత బెనర్జీ పాలనలో పాలనాలోపాల కంటె ఆమె ముస్లిములను బుజ్జగిస్తోందన్న ఆరోపణనే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఆమెను బేగమ్ అని సంబోధిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది చర్చించే వ్యాసమిది.…

బెంగాల్ ఎన్నికలలో బిజెపి, మమత బెనర్జీ పాలనలో పాలనాలోపాల కంటె ఆమె ముస్లిములను బుజ్జగిస్తోందన్న ఆరోపణనే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఆమెను బేగమ్ అని సంబోధిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది చర్చించే వ్యాసమిది.

బెంగాలీయులు స్వతహాగా ఆవేశపరులు. చిన్న విషయాలకు కూడా పేచీ పెట్టుకుని భీకరంగా వాదించుకుంటారు. వ్యక్తిగతంగా ధైర్యం పెద్దగా లేకపోయినా, సామూహికంగా హింసకు పాల్పడతారు. గుంపుగా ప్రవర్తించినప్పుడు అత్యంత కిరాతకమైన పనులు చేయగలరు. వారిని రెచ్చగొట్టడం సులభం. ఆఫీసుల్లో కూడా ఫుట్‌బాల్ గురించో, రాజకీయాల గురించో వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదించుకుంటూ వుంటారు. సగటు బెంగాలీ రాజకీయ పరిజ్ఞానం సగటు భారతీయుడి కంటె ఎక్కువే. దేశవిభజనకు ఏడాది ముందు జిన్నా దృష్టి పెట్టిన ప్రధాన రాష్ట్రాలు పంజాబ్, బెంగాల్. మతకలహాలు జరిపించి, పాకిస్తాన్ డిమాండ్‌ను నెగ్గించుకోవడానికి 1946 ఆగస్టులో డైరక్ట్ యాక్షన్ ప్రకటించినపుడు దానికి తొలిగా స్పందించిన కలకత్తా, నయాఖాలీ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో వుంది) బెంగాల్ లోనివే. ఇరుపక్షాల నుంచి అనేక దారుణాలు జరిగాయి.

విభజన ప్రకటించాక జరిగిన అల్లర్లలో కూడా బెంగాల్‌దే అగ్రస్థానం. మహాత్మా గాంధీ ఒక్కడూ వెళ్లి అక్కడ అల్లర్లు చల్లార్చారు. ఈ ‘వన్ మాన్ ఆర్మీ’ బెంగాల్ రావడంతో, అటు పంజాబ్‌లో హింసను అరికట్టేవాళ్లు ఎవరూ లేకపోయారు. అందువలన పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. స్వాతంత్ర్యం వచ్చాక మన వాటాకు వచ్చిన పశ్చిమ బెంగాల్ పాలకులు విభజన నాటి వాస్తవాలను బాగా గుర్తుపెట్టుకున్నారు. అందువలన హిందూ, ముస్లిము రాడికల్స్‌ను ప్రోత్సహించలేదు. ఎందుకంటే బెంగాల్‌లో మూఢనమ్మకాలు ఎక్కువే. పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న సందేహంతో కొందర్ని చావగొట్టేసిన సందర్భాలున్నాయి. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఆనందమార్గీయులను సజీవదహనం చేసిన ఘటనలున్నాయి. ఇస్కాన్ వాళ్లపై కూడా దాడులు చేసిన ఘట్టాలున్నాయి.

అందువలన నిప్పు రాజేస్తే, అది ఆర్పలేనంత స్థాయికి వస్తుందని భయపడి బెంగాల్‌ను పాలించిన కాంగ్రెసు, లెఫ్ట్ ముఖ్యమంత్రులు మతభావాలు ప్రజ్వరిల్లకుండా చూస్తూ వచ్చారు. రాజకీయాలను, మతాన్ని కలపలేదు. కులాల ప్రసక్తి కూడా లేకుండా రాజకీయాలు నడిపారు. అయితే తృణమూల్ అధికారంలోకి వచ్చాక మమత, తనకంటూ అంకితమైన ఓటు బ్యాంకు కావాలనుకుని జనాభాలో దాదాపు 27% వున్న ముస్లిములను బుజ్జగిస్తూ, వారి ఓట్లను గంపగుత్తగా పొందానికి ప్రయత్నించ సాగింది. ఎందుకంటే 294 సీట్లలో 74 సీట్లలో ముస్లిం జనాభా 40-60% వరకు వుంది. 130 సీట్లలో వాళ్లు ఫలితాలను ప్రభావితం చేయగలరు.

బిజెపి బెంగాల్‌పై దృష్టి సారించినపుడు, యిది వాళ్లకు అనువుగా తోచింది. మమత ‘ముస్లిముల తుష్టీకరణ’ (బుజ్జగింపు)కు పాల్పడుతోందని, ఆమెను ‘బేగమ్’ అని పిలవడం సముచితమని పెద్దయెత్తున ప్రచారం ప్రారంభించారు. ‘మీరు బేగమ్‌కు ఓటేస్తే, యిక్కడ మినీ పాకిస్తాన్ ఏర్పడుతుంది. దావూద్ ఇబ్రహీం వచ్చి యిక్కడ తిష్ట వేస్తాడు’ అని ప్రస్తుతం నందిగ్రామ్‌లో శుభేందు అధికారి అన్నట్లు ఫిర్యాదు నమోదైంది. ‘మన యింటి ఆడవాళ్లు బొట్టు పెట్టుకోవాలంటే, మన పిల్లలు స్కూళ్లలో సరస్వతీ పూజ చేయాలంటే, బిజెపిని అధికారంలోకి తేవాల్సిందే. లేకపోతే ఇది పశ్చిమ బంగ్లాదేశ్‌ అయిపోతుంది’ అని చెప్తున్నారు. ప్రస్తుతం బిజెపి అధికారంలో లేదు. అయినా యీ పనులన్నీ జరుగుతున్నాయి కదా, బిజెపి ఓడిపోతే ఎవరైనా వీటిని నిషేధిస్తారా?

ఈ ప్రచారం కారణంగా హిందువుల్లో కొందరు బిజెపికి దగ్గరయ్యారు. ముస్లిములు యిన్నాళ్లూ తమ రాజకీయభావాల పరంగానే ఓటేస్తూ వచ్చారు. 2011, 2016లో హిందువుల లాగానే వాళ్లూ లెఫ్ట్ నుంచి తృణమూల్‌కు మారారు. 2019లో బిజెపితో తలపడినప్పుడు మమతకు మద్దతుగా నిలబడ్డారు. వారు గణనీయమైన సంఖ్యలో వున్న 130 సెగ్మెంట్లలో 99 సెగ్మెంట్లలో తృణమూల్‌కే ఆధిక్యత వుంది. మతపర రాజకీయాలకు యిన్నాళ్లూ అతీతంగా వున్న బెంగాల్‌ సమాజంలో యిప్పుడు బిజెపి మతాన్ని సాధనంగా చేసుకుని ముందుకు సాగుతోంది. వారి ఆరోపణల్లో నిజానిజాలెంత? మమత నిజంగానే హిందువులను నష్టపరిచి, ముస్లిములకు మేలు చేస్తోందా? పశ్చిమ బెంగాల్‌ను మినీ పాకిస్తాన్‌గా మార్చేస్తోందా? అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి.

మొదటగా చూడవలసినది బంగ్లాదేశ్ నుంచి ముస్లిము అక్రమవలసదారులు వచ్చి బెంగాల్‌ను ముంచెత్తుతున్నారా లేదా అన్న విషయం. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో 10% మంది అంటే 10 కోట్లలో ఒక కోటి మంది అక్రమవలదారులున్నారు. వాళ్లు 1951 నుంచి అలా వస్తూనే వున్నారు. ఇది నిజమే అయితే సెన్సస్ వారి లెక్కల ప్రకారం బెంగాల్ జనాభా క్రమేపీ పెరుగుతూ పోవాలి. పోతోందా? దేశజనాభా పెరుగుదల రేటు కంటె బెంగాల్ జనాభా రేటు ఎక్కువగా వుండాలి. ఉందా? 1951-61 మధ్య జాతీయ జనాభా పెరుగుదల రేటు 21% వుంటే బెంగాల్‌లో 32% వరకు వుంది. అప్పుడు తూర్పు పాకిస్తాన్ నుంచి వలసలు యిబ్బడిముబ్బడిగా వున్నాయన్నమాట.

1961-71 దశకంలో జాతీయ రేటు 25%కు కాస్త తక్కువలో వుంటే బెంగాల్ రేటు కాస్త ఎక్కువగా 26 వుంది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ తర్వాత నుంచి చూస్తే 1971-81, 1991-2001, 2001-11, 2011-21 దశకాల్లో బెంగాల్ రేటు జాతీయ రేటు కంటె 3-5% తక్కువే వుంది. కేవలం 1981-91లో మాత్రం 1% ఎక్కువుంది. 2001లో హిందూ జనాభా గ్రోత్ రేట్ 14.2% వుంటే, అది 2011 నాటికి 10.8 అయింది. ముస్లిముల విషయంలో నైతే అది 25.9, 21.8 వుంది. బంగ్లాదేశ్‌ను ఆనుకుని వున్న ప్రాంతాల్లో చూసినా 2001-2011 మధ్య హిందువుల గ్రోత్ రేట్ 6.75% తగ్గగా, ముస్లిముల గ్రోత్ రేట్ 4.27% తగ్గింది. వలసలుంటే పెరగాలి, పెరగకపోగా తగ్గుతోందంటే బంగ్లాదేశ్ ఏర్పడ్డాక, బెంగాల్‌కు వలస వచ్చేవాళ్లు తగ్గారని అర్థం. వాళ్లు అసాంకు వెళ్లారేమో, ఆ అంకెలు వేరే చూడాలి. బెంగాల్ వరకు యిదీ పరిస్థితి.

ఇక ముస్లిము జనాభా యిబ్బడిముబ్బడిగా పెరిగిపోతోందన్న వాదనలో నిజమెంత? ఒక వాస్తవమేమిటంటే హిందువుల కంటె ముస్లిములలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువ. దీనికి ప్రధానకారణం మతం కంటె విద్యార్జన, వికాసం లేకపోవడం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలలో హిందువులు, ముస్లిముల యిద్దరి జనాభా పెరుగుదల రేటు సగటు కంటె తక్కువగా వుంటోంది. చెందని ప్రాంతాల్లో యిద్దరిలోనూ ఎక్కువ వుంటోంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, బీదవారు అభివృద్ధి చెంది అవగాహన పెంచుకుంటున్న కొద్దీ, జనాభా పెరుగుదల రేటు తగ్గుతోంది. ప్రాంతాల ప్రకారం చూస్తే దక్షిణ భారతంలో విద్య, ఆరోగ్యం వంటి అభివృద్ధి ఎక్కువ కాబట్టి జనాభా పెరుగుదల రేటు తక్కువగా వుంటోంది. ఉత్తర భారతంలో అవి తక్కువ కాబట్టి, ఆ రేటు ఎక్కువ వుంటోంది. అయితే అక్కడ కూడా గతంతో పోలిస్తే  పెరుగుదల రేటు తగ్గింది. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య తేడాలాగానే హిందూ, ముస్లింల మధ్య తేడా వుంది.

బెంగాల్ పరంగా గణాంకాలు చెప్పాలంటే, ఫెర్టిలిటీ రేటు విషయంలో బెంగాల్ సగటు 2001, 2011, 2015-16లలో లో 2.6, 2.2, 1.9 వుంటే, హిందువుల్లో అది 2.2, 1.7, 1.6 వుంది. ముస్లిములలో అది 4.4, 2.2, 2.1 గా వుంది. దీని ప్రకారం బెంగాల్ ముస్లిములలో ఫెర్టిలిటీ రేటు 2001-16 మధ్య 4.4 నుంచి 2.3 తేడాతో 2.1కి పడిపోయింది. హిందువులకు వచ్చేసరికి ఆ తేడా 0.6 మాత్రమే. ఇవన్నీ సెన్సస్ 2011, నేషనల్ హెల్త్ సర్వే 2015-16 నుంచి తీసుకున్నవి. 2011 సెన్సస్ ప్రకారం బెంగాల్‌లో 22 లక్షల మంది తమ జన్మస్థలం బంగ్లాదేశ్‌లో వుందని చెప్పారు. వీరిలో 50% మంది నాడియా, ఉత్తర 24 పరగణాల జిల్లాలకు చెందినవారు. వీరిలో అధికాంశం హిందువులు, వారిలో అత్యధికులు వెనకబడిన జాతుల వారు.

ఇక బెంగాల్ ముస్లిములు ఏ మాత్రం ఉద్ధరింపబడ్డారు అనే విషయం. ముల్లాలకు జీతాలు పెంచారు, హజ్‌కు సబ్సిడీ యిచ్చారు, ఇఫ్తార్ విందులు యిచ్చారు అనగానే ముస్లిములకు దోచిపెడుతున్నారనే అభిప్రాయానికి వచ్చేస్తాం. గుడి పూజారులకు జీతాలు పెంచారు అనగానే హిందువులందరికీ ప్రజాధనం పంచిపెట్టేసినట్లా? కనీసం బ్రాహ్మణులందరికీ మేలు చేసినట్లు కూడా కాదు. బెంగాల్‌లో 30 లక్షల మంది బ్రాహ్మణులున్నారనుకుంటే 8 వేల మంది పూజారులకు నెలకు వెయ్యి రూపాయలు స్టయిపెండ్ యిస్తే ఏం ఒరగబెట్టినట్లు? ఇది కూడా మమత గత సెప్టెంబరులో యిచ్చింది. 2012లోనే ఇమామ్‌లకు నెలకు 2500, మువాజ్జిన్‌లకు వెయ్యి చొప్పున యిచ్చింది. ‘వేలాది దుర్గాపూజ మండపాలకు మీరు ఏటా 25-40 వేలు యిస్తున్నారు కదా, మాకు జీతాలు పెంచరేం?’ అని ఇమామ్‌లు 2018లో డిమాండ్ చేశారు. 2.70 కోట్ల మంది ముస్లిములుంటే కొన్ని వేల మంది ఇమామ్‌లకు జీతాలిస్తే, పూజా మండపాలకు, పూజారులకు, డబ్బిస్తే ఆయా కమ్యూనిటీలను బాగుపరిచినట్లు కాదు. వాళ్లు ఏ మేరకు ఆర్థిక ప్రగతి సాధించేరన్నదే ముఖ్యం.

మనం చూడాల్సింది బెంగాల్‌లో వున్న ముస్లిము సగటు భారతీయ ముస్లిము కంటె మెరుగ్గా వున్నాడా? అని. బెంగాల్ ముస్లిములలో 13% మందికి మాత్రమే రెగ్యులర్‌గా జీతం వచ్చే ఉద్యోగం వుంది. వారి సగటు నెల ఆదాయం రూ. 9500. జాతీయస్థాయిలో ముస్లిములలో 22.1% మందికి ఉద్యోగాలున్నాయి. వారి సగటు నెల ఆదాయం రూ. 13 వేలు. జాతీయ స్థాయిలో ముస్లింలలో 52.7% మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్. బెంగాల్‌లోనూ అంతే. అయితే అలా వున్నవారి ఆదాయం విషయానికి వస్తే జాతీయ సగటు రూ.10 వేలైతే, బెంగాల్‌లో సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ముస్లిం ఆదాయం 6 వేలు. జాతీయ స్థాయిలో ముస్లిములలో 26% మంది కాజువల్ లేబరర్స్‌గా పని చేస్తూ వుంటే, బెంగాల్‌ ముస్లిములలో 34% మంది ఆ పని చేస్తున్నారు. ఇవన్నీ లేబర్ ఫోర్స్ సర్వే 2018-19 గణాంకాలు. ఇలా చూస్తే బెంగాల్ ముస్లిములు బావుకున్నదేముంది?

ఏది ఎలా వున్నా, మమత ముస్లిములకే దోచి పెడుతోందన్న బిజెపి ప్రచారం ఓటర్లను ప్రభావితం చేసిందని 2019 పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి. మోదీ గ్లామర్, జాతీయ స్థాయి రాజకీయాలు, యిత్యాది అంశాలెన్ని వున్నా, లెఫ్ట్, తృణమూల్ సమర్థకుల్లో హిందువులు కొంతమంది బిజెపికి ఓటేశారనేది నిర్వివాదాంశం. అందుకే 2016లో 10.2% ఓట్లు తెచ్చుకున్న బిజెపి, 2019లో 40.3% తెచ్చుకుంది. 2019లో ఎదురుదెబ్బ తగిలేవరకు మతకోణాన్ని పెద్దగా పట్టించుకోని మమత తర్వాతి రోజుల్లో చాలా సీరియస్‌గా తీసుకుని హిందూత్వంలో తానెవరికీ తీసిపోనని నిరూపించుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు. 

తాను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వనితనని, చండీ మంత్రం పఠించనిదే యింట్లోంచి బయటకు కాలు పెట్టనని చాటుకుంటూ సభల్లో మంత్రాలు, శ్లోకాలు చదువుతూ, తనతో సమానంగా చదవమని మోదీ, అమిత్‌లకు సవాళ్లు విసరసాగారు. మానవత్వం చూపడమే అసలైన హిందూమతమని, రామకృష్ణ పరమహంస చెప్పిన ‘జొతొ మత్, తొతొ పథ్’ (భగవంతుడి గురించి ఎన్నిరకాల అభిమతాలుంటే, అభిప్రాయాలుంటే అన్ని రకాల పథాలు (దారులు) వుంటాయి) చెప్పిన సూక్తిని తాను నమ్ముతానని చెప్పుకుంటున్నారు. మరి యిలాటి పరిస్థితుల్లో ముస్లిములు మమతను నమ్మగలరా? వారి ఎదుట వున్న ప్రత్యామ్నాయాలేమిటి? వచ్చే వ్యాసంలో. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

[email protected]