టీకా కావాలంటే…అది త‌ప్ప‌ని స‌రి!

క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో టీకా వేయించుకోవాల‌నే కోరిక ప్ర‌తి ఒక్క‌రిలో రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. నిన్న మొన్న టి వ‌రకూ కోవిడ్ టీకా వేయించుకోండి అయ్య‌ల్లారా, అమ్మ‌ల్లారా అని వేడుకున్నా జ‌నం పెద్ద‌గా…

క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో టీకా వేయించుకోవాల‌నే కోరిక ప్ర‌తి ఒక్క‌రిలో రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. నిన్న మొన్న టి వ‌రకూ కోవిడ్ టీకా వేయించుకోండి అయ్య‌ల్లారా, అమ్మ‌ల్లారా అని వేడుకున్నా జ‌నం పెద్ద‌గా స్పందించ‌లేదు. ఇప్పుడు  టీకా వేయించుకుంటాం కుయ్యో మొర్రో అని వేడుకుంటున్నా… అది అందుబాటులో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డికి స్వీయ నియంత్ర‌ణ‌తో పాటు టీకా వేయించుకోవ‌డం ఒక్క‌టే ప్ర‌త్యామ్నాయ మార్గంలో వైద్య నిపు ణులు చెబుతున్నారు. మే 1వ తేదీ నుంచి మూడో ద‌శ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించ‌నుంది.  

దేశ వ్యాప్తంగా 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి క‌రోనా టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంద‌ర్భంగా కండీష‌న్స్ అప్లై అని స్ప‌ష్టం చేస్తోంది. 18–44 ఏళ్ల వయసున్న వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 28 నుంచి ప్రారంభం కానుంది.

టీకా డోసు కోసం అపాయింట్‌మెంట్‌ పొందడానికి కోవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అపాయింట్‌మెంట్ తీసుకున్న వారికే వ్యాక్సిన్లు వేయ‌డం ద్వారా సెంట‌ర్ల వ‌ద్ద ర‌ద్దీని అరిక‌ట్టొచ్చ‌ని ప్ర‌భుత్వం పేర్కొంటోంది.

45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి వ్యాక్సినేషన్‌ యథాతథంగా కొనసాగుతుందని, వారు నేరుగా వ్యాక్సిన్‌ కేంద్రానికి చేరుకొని, అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసుకొని టీకా వేయించుకోవచ్చని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా టీకా కోసం వస్తే ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమతించరు.