‘సంగం’ ప్రక్షాళన జగన్ వల్ల అవుతుందా?

అచ్చెన్న అవినీతి బాగోతం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దేవినేని, కొల్లు  రవీంద్ర, జేసీ బ్రదర్స్.. ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కొక్క అవినీతి చేప బయటకొచ్చింది. తాజాగా ఈ లిస్ట్ లోకి టీడీపీ…

అచ్చెన్న అవినీతి బాగోతం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దేవినేని, కొల్లు  రవీంద్ర, జేసీ బ్రదర్స్.. ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కొక్క అవినీతి చేప బయటకొచ్చింది. తాజాగా ఈ లిస్ట్ లోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ నరేంద్ర కూడా చేరారు. సంగం డెయిరీని అడ్డం పెట్టుకొని కొన్నేళ్లుగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

కొన్నేళ్లుగా సంగం డెయిరీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు నరేంద్ర. డెయిరీలో ఆక్రమణలకు తెరదీశారని, కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి మరీ ఏసీబీ అధికారులు నరేంద్రను అరెస్ట్ చేశారు. 

గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం నుంచి నరేంద్రను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వంద మందికి పైగా పోలీసుల్ని మొహరించారు.

సంగం డెయిరీలో అసలేం జరుగుతోంది?

సహకార పాల డెయిరీ వ్యవస్థల్లో సంగం డెయిరీకి మంచి పేరుంది. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 10వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. 2వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్న ఈ సంస్థపై గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. 

ఎన్నో అవినీతి పనులు జరిగినప్పటికీ ఏదీ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో డెయిరీని ఆర్డినెస్స్ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు వైఎస్ఆర్ హయాంలోనే బీజం పడింది. అప్పట్నుంచి ఈ వ్యవహారం కోర్టులో నడుస్తూనే ఉంది.

ఈ క్రమంలో నరేంద్ర తన తెలివితేటలు చూపించారు. కొన్నేళ్ల కిందట సహకార సంఘంగా కొనసాగుతున్న డెయిరీని, కంపెనీల చట్ట పరిధిలోకి మార్చేశారు. తద్వారా సంస్థపై తన పట్టును పూర్తిస్థాయిలో పెంచుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో నిర్ణయాలు, నష్టాలు తెచ్చే చర్యలు తీసుకున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు.

గతేడాది దొంగతనం సంగతేంటి?

దీనికితోడు గతేడాది కరోనా పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో సంగం డెయిరీలో జరిగిన దొంగతనం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఓ వ్యక్తి డెయిరీకి చెందిన ఆఫీస్ లోకి వెళ్లడం.. 44 లక్షలు ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. 

లాకర్ లో 70లక్షలకు పైగా ఉన్నప్పటికీ.. ఏరికోరి మరీ పెద్ద నోట్లను ఎంచుకొని దొంగతనం చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. పోలీసులు దొంగను గంటల వ్యవథిలోనే పట్టుకున్నప్పటికీ విచారణ ఇంకా పూర్తవ్వలేదు.

సంస్థను హస్తగతం చేసుకునేందుకే వైసీపీ నేతలు ఇలా టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. సంగంలో జరిగిన అవినీతి వ్యవహారాల్ని కొట్టిపారేయలేం. ఒక దశలో సంగంలో జరిగిన కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా నరేంద్రను హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. 

అంతెందుకు..నరేంద్రకు మంత్రిపదవి కూడా అందుకే రాలేదనే విషయం స్థానికంగా ఓపెన్ సీక్రెట్. బంగారు బాతులాంటి సంగం డెయిరీ ఉండగా.. మంత్రి పదవి ఎందుకనే ఉద్దేశంతో నరేంద్ర కూడా వ్యవహరించారు.

టీడీపీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నరేంద్ర. అయితే గత ఎన్నికల్లో మాత్రం జగన్ ప్రభంజనం ముందు నిలవలేకపోయారు. వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా 2010 నుంచి సంగం డెయిరీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు నరేంద్ర. 

ఆయన పొజిషన్, చేసిన పనులు చూసి సొంత పార్టీ నేతలే ఓ దశలో కుళ్లుకునేవారు. వైఎస్ఆర్ కాలం నుంచి సంగం ప్రక్షాళన పని పెండింగ్ లోనే ఉంది. కనీసం జగన్ జమానాలోనైనా ఈ కార్యం పూర్తవుతుందేమో చూడాలి.