ఆంతా ఆన్ లైన్ లోనే ?

అవును మరి. బయట ఉన్నది కరోనా మహమ్మారి. గుమ్మం దాటి ఎవరు అడుగేసినా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. దాంతో మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కరోనా ఉధృతి నేపధ్యంలో తమకు తామే…

అవును మరి. బయట ఉన్నది కరోనా మహమ్మారి. గుమ్మం దాటి ఎవరు అడుగేసినా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. దాంతో మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కరోనా ఉధృతి నేపధ్యంలో తమకు తామే స్వీయ నిబంధనలు పెట్టుకుంటున్నారు.

ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ఉంటున్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. దాంతో ఆయన ఏకంగా వారం రోజుల పాటు తన కార్యాలయానికి సెలవు ఇచ్చేశారు. సందర్శకులు అసలు రావద్దు అని సూచించారు.

ఇక విశాఖ జిల్లాల్లో కూడా కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. దాంతో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కూడా తమ ఆఫీసులకు రావద్దు అని కోరుకుంటున్నారు. బయటకు వచ్చి కరోనా బారిన పడకండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే ఫోన్ల ద్వారానే తెలియచేస్తే మేము వాటిని పరిష్కరిస్తామని వారు చెప్పుకొచ్చారు.

ఇక ఇదే తీరున మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఎవరికైనా అత్యవసరమైన పనులు ఉంటే ఆన్ లైన్ లో కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించాలని కోరారు. అంతే తప్ప బయటకు వచ్చి మీరు చిక్కుల్లో పడి మమ్మల్ని పెట్టవద్దు అని గట్టిగానే కోరుకుంటున్నారు. మొత్తానికి కరోనా దూకుడుతో అంతా ఆన్ లైన్ లోనే అన్నట్లుగా సీన్ ఉంది మరి.