ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ దందాపై క‌డ‌ప క‌లెక్ట‌ర్ కొర‌డా

ప్రైవేట్ ఆస్ప‌త్రుల దందాపై క‌డ‌ప క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ కొర‌డా ఝుళిపించారు. ప్ర‌భుత్వం కోవిడ్ రోగుల‌కు ఉచిత వైద్యం అందిం చేందుకు మ‌రెక్క‌డా లేని విధంగా వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ కింద చేర్చింది. అయితే ప్ర‌భుత్వ ఆశ‌యాన్ని…

ప్రైవేట్ ఆస్ప‌త్రుల దందాపై క‌డ‌ప క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ కొర‌డా ఝుళిపించారు. ప్ర‌భుత్వం కోవిడ్ రోగుల‌కు ఉచిత వైద్యం అందిం చేందుకు మ‌రెక్క‌డా లేని విధంగా వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ కింద చేర్చింది. అయితే ప్ర‌భుత్వ ఆశ‌యాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు య‌థేచ్ఛ గా నీరుగార్చుతున్నాయి. ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ కొర‌వ‌డ‌డంతో ప్రైవేట్ ఆస్ప‌త్రుల దందా కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీపై క‌డ‌ప క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ ఉక్కుపాదం మోపారు.

వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ కింద ఆస్ప‌త్రిలో చేరిన కోవిడ్ పేషెంట్ల నుంచి డ‌బ్బు వ‌సూలు చేసినందుకు ఒక్కో ఆస్ప‌త్రికి రూ.5 ల‌క్ష‌ల జ‌రి మానా విధించిన‌ట్టు క‌డ‌ప క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ తెలిపారు. రెండు ఆస్ప‌త్రుల‌కు ఫైన్ విధించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. కోవిడ్ మ‌హమ్మారి జ‌నానికి ప్రాణ సంక‌ట‌మైతే, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు మాత్రం కాసులు కురిపించే అవ‌కాశమైంది. 

ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఇష్టాను సారం రోగుల నుంచి దోచుకుంటున్నార‌ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు అందుతున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌జ‌ల నుంచి వాట్స‌ప్‌లో ఫిర్యాదు అందినా వెంట‌నే స్పందించే ఐఏఎస్ అధికారిగా క‌డ‌ప క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌కు మంచి పేరు ఉంది. 

ఈ నేప‌థ్యంలో క‌డ‌ప‌లో ఆరోగ్య‌శ్రీ కింద చేరిన రోగుల నుంచి భారీ మొత్తంలో డ‌బ్బులు దోచుకుంటున్న‌ట్టు క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయ‌న వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై  జేసీ (అభివృద్ధి) సాయికాంత్‌వ‌ర్మ‌ను విచార‌ణ‌కు ఆదేశించారు. క‌డ‌ప‌లో కోవిడ్‌కు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను ఆయ‌న త‌నిఖీ చేశారు.

ఈ విచార‌ణ‌లో ఆరోప‌ణ‌లు నిజ‌మ‌య్యాయి. ఆరోగ్య‌శ్రీ కింద ఆస్ప‌త్రిలో చేరిన త‌మ నుంచి అడ్మిష‌న్‌కు ముందే ల‌క్ష రూపాయ‌లు డిపాజిట్ చేయించుకున్నార‌ని, మందుల కోస‌మ‌ని రూ.55 వేలు వ‌సూలు చేశార‌ని కోవిడ్ బాధితులు జేసికి ఫిర్యాదు చేశారు. రోగుల స‌హాయ‌కులు కూడా జేసీకి త‌గిన ఆధారాలు స‌మ‌ర్పించారు. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ సీరియ‌స్ అయ్యారు. రోగుల నుంచి వసూలు చేసిన మొత్తానికి ఐదు రెట్లు చొప్పున ఒక్కో ఆస్ప‌త్రికి రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు.

క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ మాట్లాడుతూ కోవిడ్ రోగుల‌కు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు అనుమతి ఇచ్చే ముందు ఆరోగ్య‌శ్రీ కోసం 50 శాతం బెడ్లు కేటాయించేలా నిబంధ‌న‌లు విధించిన‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు. దానికి అంగీక‌రిస్తేనే అనుమ‌తి ఇచ్చి న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఒప్పందాల్ని ఉల్లంఘించి రోగులను హింసిస్తే ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌న లైసెన్స్‌ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ రించారు.

బెడ్లు ఉండి కూడా ఆరోగ్య‌శ్రీ కింద చేర్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీపై చ‌ర్య‌లు తీసుకుంటున్న క‌లెక్ట‌ర్‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌లెక్ట‌ర్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు త‌మ‌త‌మ ప‌రిధుల్లోని ప్రైవేట్ దందాపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.