ప్రపంచంలోనే కోవిడ్ కేసుల నమోదులో మనదేశం ఫస్ట్ ప్లేస్‌లో ఉండడానికి అనేక కారణాలున్నాయి. ఈ పాపంలో కొన్ని వ్యవస్థల పాత్ర కీలకమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కోవిడ్ వ్యాప్తికి దోహదం చేశాయనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అంతెందుకు, స్థానిక సంస్థల ఎన్నికల విషయమై నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పట్టుదలకు పోయి …తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు.
ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానాలు కూడా నిస్సహాయత వ్యక్తం చేశాయి. అంతిమంగా ప్రజలకు బాధ్యత వహించాల్సింది మాత్రం ప్రభుత్వాలే కదా! ఈ నేపథ్యంలో శివసేన మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎన్నికల సంఘంపై చేసిన ఘాటు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రలో కరోనా అంతకంతకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువ, తక్కువలనే తేడాలు ఉండొచ్చు కానీ, కోవిడ్ సెకండ్ వేవ్ మాత్రం అత్యంత ప్రమాదకరంగా దూసుకొస్తోందనేది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మహిళా ఎంపీ ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు.
ఎన్నికల సంఘం అధికారులు కరోనా నిబంధనల గురించి ప్రబోధించడం మానుకోవాలని ఆమె హితవు పలికారు. ప్రస్తుత సమయంలో వేల మంది మరణిస్తున్నా, లక్షల మంది బాధపడుతున్నా మీరు ఎన్నికలు నిర్వహించడానికే మొగ్గు చూపారని ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టారు. మహమ్మారి ఉధృతిలో మీ పాత్రనూ చరిత్ర మర్చిపోదని ఘాటు విమర్శలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె విమర్శలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.