కోవిడ్‌లో అగ్రపథాన దూసుకుపోతున్న మన దేశ పౌరులకు… కైలాసానికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. అది కూడా మన దేశం నుంచి పారిపోయిన వివాదాస్పద మత గురువు నిత్యానంద స్వామి ఈ నిషేధాజ్ఞలు విధించడం గమనార్హం.
లైంగిక ఆరోప ణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి 2019లో మన దేశాన్ని విడిచి పారిపోయారు. లైంగిక ఆరోపణల్లో ఆయన పేరు బలంగా వినిపిస్తుండడంతో, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన పలాయన చిత్తగించారు.
ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని రూపొందించారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు వార్తలొచ్చాయి.
ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్సైట్ పేర్కొంది. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
హిందూత్వని ప్రచారం చేస్తున్నందు వల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపిన వినతి పత్రంలో నిత్యా నంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్సైట్లో పేర్కొ న్నారు.
ఈ నేపథ్యంలో తానున్న ప్రాంతానికి భారతీయులకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలివ్వడంపై చర్చకు తెరలేచింది. మన దేశంతో పాటు బ్రెజిల్, ఐరోపా సంఘం, మలేసియా దేశాల నుంచి కూడా రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు తన ప్రెసిడెన్షియల్ మ్యాం డేట్లో ప్రకటించారు. కోవిడ్ నుంచి తన దేశాన్ని రక్షించుకునేందుకు నిషేధిత చర్య చేపట్టినట్టు ట్విటర్ వేదికగా ప్రకటించారు. నిత్యానందా మజాకా అనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.