ఉక్కు మనసు లేదంటున్న అదానీ

విశాఖ ఉక్కు అదానీకి కట్టబెట్టడానికే అంటూ ఇటీవల కాలంలో విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్పోరేట్ శక్తులకు బంగారం లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేస్తున్నారు అని వామపక్ష…

విశాఖ ఉక్కు అదానీకి కట్టబెట్టడానికే అంటూ ఇటీవల కాలంలో విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్పోరేట్ శక్తులకు బంగారం లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేస్తున్నారు అని వామపక్ష సంఘాలు ఉద్యమ నాయకులు సైతం ఆరోపిస్తున్నాయి.

అదానీ చూపు విశాఖ ఉక్కు మీద ఉందని ఇప్పటికే రాయబేరాలు అసలు బేరాలు అన్నీ పూర్తి అయ్యాయని పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో అదానీ సంస్థకు అయితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని టేకోవర్ చేసే ఆలోచన లేదని అంటున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులే స్పష్టత ఇస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఆ ఉక్కు కర్మాగారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నడిపించాలన్న ధ్యాస కోరిక తమకు లేవని తేల్చి చెబుతోంది అదానీ గ్రూప్.

ఇప్పటికే విశాఖలోని గంగవరం పోర్టు అదానీ చేతుల్లో ఉంది. ఈ పోర్టు విషయంలోనే కార్మికుల ఉద్యమాలు నిరసనలతో యాజమాన్యం కిందా మీదా అవుతోంది. ఇపుడు కొత్తగా స్టీల్ ప్లాంట్ ని తీసుకుని మరిన్ని తలనొప్పులు పడాలా అన్న దాని మీదనే అదానీ గ్రూపు ఆలోచిస్తోంది అని అంటున్నారు.

తమకు ఆ ఇంటరెస్ట్ అయితే ఈ రోజుకి లేదని అదాని గ్రూప్ క్లారిటీ ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న మాట. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం అదానికే ఇస్తోందని వార్తలు వ్యాపించిన క్రమంలో అదానీ నుంచి ఈ రకమైన రియాక్షన్ రావడం విశేషం. ఇంతకీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం ఆలోచనను కేంద్రం వచ్చే ఎన్నికల దాకా వాయిదా వేసుకుంటోందని ప్రచారం కూడా ఉంది.

2024లో మోడీ ప్రభుత్వం మూడవ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి అప్పటికి అన్నీ అనుకూలం అయితే అదానీ మనసు మార్చుకోవచ్చేమో. ప్రస్తుతానికి అయితే ఉక్కు మక్కువ లేదని బిగ్ కార్పోరేట్ దిగ్గజం అంటోంది. బీజేపీ ఎత్తుగడలలో భాగమే ఇదంతా అని కార్మిక లోకం అంటోంది. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ ఉక్కు కర్మాగారం మీద ప్రైవేటీకరణ కత్తి మాత్రం అలా వేలాడుతూనే ఉంది.