తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు కాక ఆగవని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తేల్చి చెప్పారు. దీంతో కరోనా కారణంగా ఆగిపోతాయని భావించిన మున్సిపల్ ఎన్నికలు యధాతథంగా నిర్వహిస్తారని స్పష్టత వచ్చింది.
ఈ నెల 30న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో అనూహ్యంగా విజృంభిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజారోగ్య దృష్ట్యా ఎన్నికలను నిలిపి వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికల నిర్వహణలో తాము జోక్యం చేసు కోలేమని అభ్యర్థనను హైకోర్టు సింగిల్ బెంచ్ తోసిపుచ్చింది. దీంతో ఆయన హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటిషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టంగా పేర్కొన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సూచన మేరకు యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తామని పార్థసారథి చెప్పడం గమనార్హం.