టిక్‌టాక్ స్టార్ ఫన్ భార్గవ్ అఘాయిత్యాలపై డేరింగ్ సింగర్ చిన్మయి సీరియస్‌గా స్పందించారు. ఇండస్ట్రీలోనూ, బయట సమాజంలోనూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై సోషల్ మీడియా వేదికగా ప్రముఖ గాయని చిన్మయి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
పలువురు సినీ ప్రముఖుల లైంగిక భాగోతాలపై పలు సందర్భాల్లో ఆమె బహిరంగంగానే స్పందించి వివాదాస్పద గాయనిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా 14 ఏళ్ల బాలికను ఫన్ భార్గవ్ లోబరుచుకుని గర్భవతిని చేయడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. భార్గవ్‌పై కేసు నమోదు చేసి కటకటాలపాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్మయి ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఘటనల్లో కూడా బాధితురాలైన అమ్మాయిలదే తప్పు అన్నట్టు క్రియేట్ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉదహరిస్తూ …ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తల్లి అతి గారాభం చేయడం, ఎక్కడికి వెళ్తుందో గమనించకపోడం, అమ్మాయికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో టిక్ టాక్ భార్గవ్‌తో ఆమె మరింత చనువుగా ఉంటూ వచ్చింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఓ మైనర్ బాలిక కామాంధుడి చేతిలో బలికావాల్సి వచ్చింది. దీనికి తోడు బాలిక తండ్రి దూరంగా ఉండటం వల్ల మంచి చెప్పేవారు ఎవరూ లేకుండా పోయారు' అంటూ ఒకవైపు అన్యాయానికి గురైందంటూనే, మరోవైపు అందుకు దారి తీసిన పరిస్థితులను నెగెటివ్‌గా రాయడంపై చిన్మయి అభ్యంతరం, అసహనం వ్యక్తం చేశారు.
అత్యాచారం జరిగితే దానికి అమ్మాయిని బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదని ఆమె సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఫన్ భార్గవ్ లాంటి కామాంధులు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో భార్గవ్ పాపులర్ కావడంతో అతని అఘాయిత్యాలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయన్నారు.
భార్గవ్ స్త్రీ లోలుడు అనే విషయాన్ని అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడాన్ని తాను చూశానన్నారు. భార్గవ్ లాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
ఇలాంటి వాళ్లు చాలా స్మార్ట్‌గా, కన్నింగ్‌గా అమ్మాయిని లోబర్చుకుంటారని, ఇందుకు వాళ్ల పేరెంట్స్‌తోనూ మంచిగా మాటలు కలుపుతారని చిన్మయి చెప్పుకొచ్చారు. స్త్రీలు ఇండస్ట్రీలోకి రావడం తప్పు కాదని, ఆయితే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలని ఆమె హితవు చెప్పారు.