ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌లో త‌మిళిసై

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పోషిస్తున్నారు. పాత్ర అంటే సినిమాలో క్యారెక్ట‌ర్ అనుకుంటే పొర‌పాటే. ప్ర‌శ్నించ‌డానికే తాను జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని, అందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గొప్ప‌లు చెప్ప‌డం తెలిసిందే.…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పోషిస్తున్నారు. పాత్ర అంటే సినిమాలో క్యారెక్ట‌ర్ అనుకుంటే పొర‌పాటే. ప్ర‌శ్నించ‌డానికే తాను జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని, అందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గొప్ప‌లు చెప్ప‌డం తెలిసిందే. అయితే ప్ర‌శ్నించ‌డం సంగ‌తేమో గానీ, ప‌వ‌నే ప్ర‌త్య‌ర్థుల నుంచి ప్ర‌శ్న‌ల‌కు గురి అవుతున్నారు. ఎందుకంటే రాజ‌కీయ పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఇత‌ర పార్టీల కొమ్ము కాయ‌డానికి ప‌రిమిత‌మ‌య్యారు.

దీంతో ప‌వ‌న్ రాజ‌కీయ పంథా తీవ్ర విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంది. ప్ర‌శ్నించ‌డ‌మనే రాజ‌కీయ ఆయుధం ప‌వ‌న్ పుణ్యాన వెట‌కారానికి గురి అవుతోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కార్‌కు ఆర్టీసీ బిల్లు విష‌య‌మై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఐదు ప్ర‌శ్న‌లు సంధించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ, గ‌వ‌ర్న‌ర్ నుంచి సంత‌కానికి నోచుకుని రాక‌పోవ‌డంతో ర‌చ్చ మొద‌లైంది.

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ త‌న దగ్గర పెండింగ్ పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ హైద‌రాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు భారీ నిర‌స‌న‌కు దిగారు. రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డికి ఆర్టీసీ కార్మికులు పిలుపునివ్వ‌డంతో వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. దీంతో గ‌వ‌ర్న‌ర్ కూడా వ్యూహాత్మ‌కంగా ప్ర‌భుత్వానికి ఐదు ప్ర‌శ్న‌లు సంధించి తాను ఆర్టీసీ కార్మికుల ప‌క్షానే ఉన్నాన‌నే సంకేతాలు ఇచ్చారు.

గవర్నర్‌ కార్యాలయం శనివారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో విలీన బిల్లుకు సంధించిన ఐదు ప్ర‌శ్న‌లేంటో తెలుసుకుందాం.  
 
ఒక‌టి…1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతరత్రా సాయం గురించి ఎలాంటి వివ‌రాలు లేవు. రెండోది… రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీని విలీనం చేయ‌డంపై పూర్తి వివ‌రాలు లేవు. మూడోది…  ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులను పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం… వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా? వారి ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? నాలుగో ప్ర‌శ్న‌…   ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు అన్ని ప్రయోజనాలు స‌మ‌కూర్చేలా భ‌రోసా ఇచ్చే  వివరాలు ఇవ్వాలి. చివ‌రిగా ఐదో ప్ర‌శ్న‌… కండక్టర్, కంట్రోలర్  తదితర పోస్టులు ప్ర‌భుత్వంలో లేవు. అలాంటి ఉద్యోగుల ప్రమోషన్లు, వారి కేడ‌ర్‌ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌వ‌ర్న‌ర్ కోర‌డం విశేషం.  

ఆర్టీసీ కార్మికుల శ్రేయ‌స్సుకు సంబంధించిన ఐదు ప్ర‌శ్న‌ల‌ను వేయ‌డాన్ని నెటిజ‌న్లు స‌ర‌దాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌తో పోల్చుతున్నారు. గ‌వ‌ర్న‌ర్‌, కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌ధ్య చాలా కాలంగా వార్ న‌డుస్తోంది. ప్ర‌భుత్వం పంపిన పైళ్ల‌పై గ‌వ‌ర్న‌ర్ కొన్ని సంద‌ర్భాల్లో కొర్రీలు వేయ‌డం వివాదానికి దారి తీస్తోంది. అది ఇంతింతై అన్న‌ట్టుగా పెరుగుతూ రెండు వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య తీవ్ర అగాథానికి దారి తీసింది.