బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తయారవుతున్న అఖండ సినిమా టీజర్ యూ ట్యూబ్ లో సంచలనం నమోదు చేసింది. ఇప్పటికి ఇది 33 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఇది నిజంగానే జరిగింగా? లేక మార్కెటింగ్ మాయాజాలమా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే బాలయ్యకు ఈ లెవెల్ రెస్పాన్స్ అన్నది ఇప్పటి వరకు లేదు. భవిష్యత్ లో వుంటుందని గ్యారంటీ లేదు.
బాలయ్య సినిమాలకు ఇలా వుండే అవకాశం వుండి వుంటే ఎంతో హడావుడి జరిగిన సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ కే వచ్చి వుండాలి. కానీ రాలేదు. పోనీ ఇది బాలయ్య మ్యాజిక్ కాదు, బోయపాటి క్రేజ్ అనుకుంటే వినయ విధేయ రామ సినిమాకు వచ్చి వుండాలి. పైగా అక్కడ రామ్ చరణ్ లాంటి మెగా యంగ్ హీరో కూడా జోడీగా వున్నాడు. కానీ రాలేదు.
పోనీ ఏ సినిమాకు ఆ సినిమానే అనుకుందాం, ఇప్పుడు యూ ట్యూబ్ ట్రెండ్ నడుస్తోంది అనుకుంటే ఆచార్య లాంటి మరింత క్రేజ్ వున్న సినిమాలకు కూడా వచ్చి వుండాలి కదా? సరే, అయితే ఏం జరిగి వుంటుందని జనాల అనుమానం? యూ ట్యూబ్ లో సినిమా కంటెంట్ కు హిట్ రావాలి అంటే డిజిటల్ మార్గెటింగ్ మార్గాలు అనేకం వున్నాయి మిలియన్ వ్యూస్ కు ఇంత అని ఖర్చు అవుతుంది.
చాలా పెద్ద సినిమాలు ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాయి అన్నది పచ్చి వాస్తవం. అయితే అఖండ సినిమా విషయంలో ఇంకో మార్కెటింగ్ టెక్నిక్ కూడా తోడయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పెద్ద, మీడియం సినిమాల డిజిటల్ రైట్స్ ను టాలీవుడ్ లో ఓ సంస్థ మార్కెట్ చేస్తుంది. ఈ సంస్థ ముందుగా రైట్స్ ను ఓ రేటుకు అంచనా వేసి కొనేసుకుంటుంది. ఆ తరువాత తాను అమ్ముకుంటుంది. ఈ కొనుగోలు అమ్మకాల మధ్య వచ్చే మార్జిన్ ను లాభంగా తీసుకుంటుంది.
ఇప్పుడు ఆ సంస్థ అఖండ సినిమా రైట్స్ తీసుకుందని బోగట్టా. తిరిగి మాంచి రేటుకు అమ్మాలి అంటే సినిమాకు క్రేజ్ రప్పించాలి. అందులో భాగంగానే అఖండ కోసం ఈ హైప్ ను సృష్టించారని.టాక్ వినిపిస్తోంది. పైగా ఆ సంస్థకు స్వంత యూ ట్యూబ్ మార్కెటింగ్ వ్యవస్థ వుంది. అందువల్ల ఇదేమంత పెద్ద కష్టం కాదని బోగట్టా.
యూ ట్యూబ్ లో యాడ్ లు రన్ చేసారా? వ్యూస్ కొనుగోలు చేసారా? ఇవన్నీ ఎలా వున్నా, బాలయ్య ఫ్యాన్సు కు మాత్రం ఈ రికార్డు పూనకాలు రప్పిస్తోంది.