ప్రపంచంలోనే అత్యథికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా రికార్డు సృష్టించింది ఇండియా. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు కోకొల్లలు. ఇలాంటి టైమ్ సెలబ్రిటీలు ఏం చేయాలి?
తమకు తోచిన సాయం చేయకపోయినా ఫర్వాలేదు కానీ ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు కొంతమంది సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా ఇలాంటి టైమ్ లో విహార యాత్రలకు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్? ఇదే అంశాన్ని తప్పుబడుతోంది హీరోయిన్ శృతిహాసన్.
విహారయాత్రలకు వెళ్లే హక్కు, డబ్బు వాళ్లకున్నప్పటికీ ఇలాంటి టైమ్ లో అలాంటి పనులు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదంటోంది శృతిహాసన్. కరోనాతో పోరాడుతున్న కొంతమంది వ్యక్తులకు ఇది చాలా కఠినమైన సమయమని, ఇలాంటి టైమ్ లో కొంతమంది తారలు విహారయాత్రలకు వెళ్లడం భావ్యం కాదంటూ సున్నితంగా విమర్శలు చేసింది.
ప్రజల మనోభావాలను గుర్తించాలని, వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీలు చేసుకోవడం, హాలిడేస్ కు వెళ్లడం మంచిది కాదంటున్న శృతిహాసన్.. తన వంతుగా ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి సమాచారాన్నైనా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది.
ఆమధ్య కరోనా కల్లోలం తగ్గిన కొత్తల్లో సెలబ్రిటీలంతా విహార యాత్రలకు క్యూ కట్టారు. ఎక్కువమంది మాల్దీవుల్లోని ఫైవ్ స్టార్ రిసార్ట్స్ లో సేదతీరితే, మరికొంతమంది దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్లారు. అయితే సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత కూడా కొంతమంది తారలు విహారయాత్రలకు వెళ్తున్నారు.
ఓవైపు ప్రజలు కరోనాతో చావుబ్రతుకుల మధ్య పోరాడుతుంటే.. రణబీర్, అలియా, జాన్వి, సారా, దిశా పటానీ లాంటి సెలబ్రిటీలు మరోసారి హాలిడేస్ కు వెళ్లడాన్ని అంతా తప్పుపడుతున్నారు.