కులాల పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్న చంద్రబాబుకి గట్టి కౌంటరే పడింది. “బీసీలంటే జగన్ కి ఓర్వలేని తనం, బీసీలను అణగదొక్కేందుకు చూస్తున్నారు, మా పార్టీ బీసీ నాయకులపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు” అంటూ జగన్ ని టార్గెట్ చేయాలని చూస్తున్నచంద్రబాబుని చెడామడా వాయించేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
ఈఎస్ఐ వ్యవహారంలో అచ్చెన్నాయుడి పాత్ర ఉందని వస్తున్న వార్తలు.. వైసీపీ పుకార్లు అన్నట్టుగా చంద్రబాబు స్పందించారు. అచ్చెన్నాయుడు బీసీ కావడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ.. గతంలో తమ బీసీ నాయకుల్ని టార్గెట్ చేశారంటూ సంబంధం లేకుండా కులాల కుంపటి రాజేయాలని చూశారు. జగన్ ని బీసీ వ్యతిరేకిగా ముద్రవేయాలని గతంలో చాలాసార్లు ట్రై చేసి బొక్కబోర్లా పడ్డ బాబు.. మరోసారి అచ్చెన్నాయుడి వ్యవహారంతో రెచ్చిపోయారు.
కృష్ణా జిల్లాలకు వరదలు వచ్చిన సమయంలో ఓ పెయిడ్ ఆర్టిస్ట్ మంత్రి అనిల్ ని కులం పేరుతో దూషించారు. టీడీపీకి చెందిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అప్పుడు చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కులహంకారులు.. అలా చెడామడా వాగారు. అప్పుడు బీసీని కించపరిస్తే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు. అనిల్ పై చేసిన కుల విమర్శల్ని కనీసం ఖండించలేదు సరికదా.. అరెస్ట్ లు అన్యాయమంటూ అప్పుడు బాబు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయంలో బాబుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అప్పటి బాబు ప్రవర్తనని, ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడాన్ని కంపేర్ చేస్తూ మంత్రి అనిల్ కుల రాజకీయాలపై మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ని చంద్రబాబు వదిలిపెట్టాలని హెచ్చరించారు. గతంలో క్రికెట్ బెట్టింగ్ ల వ్యవహారంతో తనకి సంబంధం లేకపోయినా.. తన పేరు ఇరికించాలని చూశారని, తన తప్పు లేకపోవడంతో కేసు పెట్టలేకపోయారని అన్నారు. అప్పుడు బీసీ ఎమ్మెల్యేగా తాను చంద్రబాబుకి కనపడలేదా అని ప్రశ్నించారు అనిల్.
కులాల గురించి మాట్లాడటానికి చంద్రబాబుకి సిగ్గుండాలని అన్నారు. బీసీలకు మంత్రిపదవులిచ్చి ప్రోత్సహించే నాయకుడు జగన్ అని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పొలిటీషియన్ చంద్రబాబు అని అన్నారు అనిల్.