తిరుపతి ఉప ఎన్నికలో గెలుస్తాం.. అంటూ ధీమాను వ్యక్తం చేసే దగ్గర నుంచి మొదలయ్యాయి బీజేపీ మాటలు. ఉప ఎన్నిక అనివార్యం అయిన దగ్గర నుంచినే బీజేపీ హడావుడి మొదలైంది. నాలుగైదు నెలల కిందటే బీజేపీ కార్యకలాపాలన్నీ తిరుపతికి మారిపోయాయి.
జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడే బీజేపీ అక్కడ రచ్చ చేసింది. ఆ పై హిందూ దేవాలయాలపై దాడులంటూ కూడా తిరుపతి వేదికగానే బీజేపీ-జనసేనలు జాయింటు కార్యక్రమం ఒకటి నిర్వహించాయి. ఇలా తమ అస్త్రమైన మతాన్ని బీజేపీ తిరుపతిలో గట్టిగా ప్రయోగించింది.
ఇక బీజేపీ ఏపీ విభాగం తిరుపతి నియోజకవర్గం ఉప ఎన్నికకు ఎంతో కసరత్తు చేసింది. నెలల తరబడి సమయం కూడా దొరికింది. అయితే అభ్యర్థి ఆఖరి వరకూ ఖరారు కాలేదు. చివరకు పేరున్న అభ్యర్థినే తెచ్చినా.. ఇప్పుడు తిరుపతిలో బీజేపీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయనే చర్చ జరుగుతూ ఉంది.
బీజేపీకి గెలిచేంత సీన్ లేదని పోలింగ్ తర్వాత పూర్తి స్పష్టత వచ్చింది. గెలుపుపై ఆశలు ఉంటే.. పోలింగ్ ను రద్దు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. రద్దు అంటున్నారంటేనే.. గెలుపుపై ఆశలు లేవని లెక్క. అంతకు మించిన విషయం ఏమిటంటే.. బీజేపీ రమారమీ యాభై వేల ఓట్లకు మించి పడి ఉండకపోవచ్చనేది.
ఒకవేళ ఫలితాల్లో కమలం పార్టీ రేంజ్ 50 వేల స్థాయికి పరిమితం అయితే అంతే సంగతులు. ఇప్పటికే బీజేపీ అన్ని అస్త్రాలనూ సంధించేసింది. ఒక్క తిరుపతి ఉప ఎన్నిక కోసం మతం, పవన్ కల్యాణం, జనసేనతో పొత్తు.. ఇవన్నీ వాడేసిన అస్త్రాలు అవుతున్నాయి. మరి అంత వాడితే, నాలుగైదు నెలలు కసరత్తు చేస్తే వచ్చిన ఓట్లు యాభై వేల చిల్లర అయితే.. బీజేపీది పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది.
ఈ నేపథ్యంలో.. కొన్ని నెలల కిందట ఏపీ బీజేపీ విభాగం అధ్యక్షుడిగా నియమితం అయిన సోము వీర్రాజుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఎంతో ఊహించుకుంటే, చివరకు యాభై వేల ఓట్ల స్థాయికి పరిమితం అయితే అది బిగ్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు.
అయితే ఈ విషయంలో వీర్రాజును అని ఏం ప్రయోజనం లేదు కూడా, ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హామీని తుంగలోకి తొక్కి, ఆ విషయంలో వెకిలిగా మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ముగిసిన అంకమంటూ బీజేపీ అధినాయకత్వం తీరుకు ప్రతిఫలమే తిరుపతి ఉప ఎన్నికలో ఆ పార్టీకి దక్కే ట్రీట్ మెంట్. దానికి తోడు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి పూనుకోవడం, మోడీ హయాంలో ధరల పగ్గాలు జారిపోవడం వంటి కారణాలకు సంబంధించి ప్రజా స్పందన మేరకే బీజేపీకి ఓట్లు పడి ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు.