ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మైతే, టీడీపీని మూసేసుకోవాలి!

చెప్ప‌రా చెప్ప‌రా బోలిగా అంటే.. తాటికొండ మిరియాలు తాటికాయ‌లంత అన్నాడ‌ట‌! అదేంటో మ‌రి తెలుగుదేశం అధినేత ఏం ఆరోప‌ణ‌లు చేసినా ఇలానే ఉంటాయి. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ తిరుప‌తి ఉప ఎన్నిక గురించి చంద్ర‌బాబుగారు…

చెప్ప‌రా చెప్ప‌రా బోలిగా అంటే.. తాటికొండ మిరియాలు తాటికాయ‌లంత అన్నాడ‌ట‌! అదేంటో మ‌రి తెలుగుదేశం అధినేత ఏం ఆరోప‌ణ‌లు చేసినా ఇలానే ఉంటాయి. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ తిరుప‌తి ఉప ఎన్నిక గురించి చంద్ర‌బాబుగారు చేస్తున్న ఆరోప‌ణ‌లు. 

అక్క‌డ రెండు ల‌క్ష‌ల దొంగ ఓట్లు పోల్ అయిన‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. ఇంత‌కీ అదెలా జ‌రిగింది? అంటే.. ఫేక్ ఐడెంటిటీ కార్డుల‌ను ముద్రించేసి, వాటిని ప‌ట్టుకెళ్లి ఓటేశార‌ట‌! చంద్ర‌బాబు నాయుడు త‌న ప‌చ్చ మీడియాకు ఇలాంటి ముచ్చ‌ట్లు చెప్పి ఉంటే, వాటిని అవి పెద్ద పెద్ద అక్ష‌రాల్లో ఒత్తేసేవేమో కానీ, ఈసీకి ఇచ్చిన కంప్లైంట్ ఇలా ఉంటే.. దాన్ని తీసుకునే వారు అయినా కాస్త ఆలోచిస్తారు క‌దా!

ఊరికే ఐడెంటీ కార్డులు ముద్రేస్తే.. తీసుకెళ్లి ఓటేసేయ‌వ‌చ్చా? ఇంత ఈజీగా దొంగ ఓట్లు వేసేసేట్టు అయితే ఈ ప్ర‌జాస్వామ్యం ఇలా కూడా ఉండేది కాదేమో! అదేమంటే.. ఊర్ల‌లో లేని వాళ్లు, చ‌నిపోయిన వాళ్ల పేర్ల‌తో ఫేక్ ఐడీలు ముద్రేశార‌ట‌! అంటే ఒక్క తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో చ‌నిపోయిన వారు అంత మంది ఉంటారా? వారితో క‌లిపి ఊర్ల‌ను వ‌దిలేసి వెళ్లిన వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు ఉంటుందా? ప‌చ్చ‌మీడియాకు ఈ ముచ్చ‌ట్లు చెప్పి, ఈసీకి ఇచ్చే కంప్లైంట్ అయినా కాస్త లాజిక‌ల్ గా ఉంటే స‌రిపోయేదేమో!

అయినా ఇక్క‌డ మ‌రో ప్ర‌ధాన‌ సందేహం ఏమిటంటే..ఇంత‌కీ పోలింగ్ స్టేష‌న్లోని టీడీపీ ఏజెంట్లు ఏంచేశారు ఇంత జ‌రుగుతుంటే? అనేది. తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప్ర‌తి బూత్ లోనూ టీడీపీ ఏజెంట్లున్నారు. పోలింగ్ రోజున ఏ ఒక్క పోలింగ్ బూత్  లో కూడా ఏజెంట్ల‌ను రానివ్వ‌లేదు అనే కంప్లైంట్ లేదు!

ప్ర‌తి బూత్ లోకీ ఏజెంట్లు వెళ్లారు. కేవ‌లం టీడీపీ ఏజెంట్లే కాదు.. బీజేపీ ఏజెంట్లూ, కాంగ్రెస్, క‌మ్యూనిస్టు పార్టీ ఏజెంట్లు కూడా ప్ర‌తి బూత్ లోనూ కూర్చున్నారు. ఏ ఒక్క చోట‌.. ఒక్క‌చోట  అంటే ఒక్క చోట కూడా ఈ పార్టీల పోలింగ్ ఏజెంట్ల‌ను లోప‌ల‌కు రానివ్వ‌లేద‌ని కానీ, అడ్డుకున్నార‌ని కానీ, కొట్టి బ‌య‌ట‌కు పంపించార‌ని కానీ చిన్న ఫిర్యాదు కూడా లేదు!

ప్ర‌తి చోటా ఇన్ని పార్టీల ఏజెంటున్నారు. దొంగ‌గా ఎవ‌రో ఓట్లేసి వెళ్తుంటే ఏజెంట్లు ఊరికే ఉండ‌రు క‌దా! ఏ పార్టీకి ఏజెంట్ గా లోప‌ల‌కు వెళ్లే వాడు అయినా., హార్డ్ కోర్ అయ్యి ఉంటాడు. పోలింగ్ ప్ర‌క్రియ తేడా గా క‌నిపిస్తే ర‌చ్చ‌రచ్చ చేస్తాడు. స‌రే ఒక పార్టీ  ఏజెంట్ అంటే అమ్ముడుపోయే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ, క‌మ్యూనిస్టు పార్టీలు.. ఇంత మంది ఏజెంట్లు అమ్ముడు పోతారా?

వీళ్లంద‌రి టార్గెట్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే క‌దా. దొంగ ఓట్లు ప‌డుతుంటే ఒక్క‌రైనా అభ్యంత‌రం చెప్ప‌రా? ఒక్క తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వర్గం ప‌రిధిలోనే టీడీపీకి 200 మంది ఏజెంట్లు ఉండి ఉంటారు. మిగ‌తా పార్టీల‌కూ అదే ఎత్తున లెక్క వేస్తే.. క‌నీసం ఏడెనిమిది వంద‌ల మంది హార్డ్ కోర్ కార్య‌క‌ర్త‌లు ఆయా పార్టీల త‌ర‌ఫున పోలింగ్ బూత్ ల‌లో కూర్చున్నారు. 

పోలింగ్ బూత్ ల‌లో కూర్చున్న వాడికి వ‌చ్చేవాడెవ‌రో పోయేవాడెవ‌రో కనీస జ్ఞానం ఉంటుంది. ఇలాంటి నేప‌థ్యంలో.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగా రెండు ల‌క్ష‌ల దొంగ ఓట్లు న‌మోద‌వుతూ ఉంటే వీళ్లంతా చూస్తూ కూర్చుంటారా?

ఏ బీజేపీ వాళ్లో, క‌మ్యూనిస్టులో, కాంగ్రెస్ వాళ్లో చూస్తూ కూర్చున్నారంటే ఆ పార్టీల‌కు శ‌క్తి లేద‌ని అనుకోవ‌చ్చు. మ‌రి తెలుగుదేశం ఏజెంట్లు చేసిన‌ట్టు? ఒక‌వేళ అంత రిగ్గింగ్ జ‌రిగి, దాన్ని కూడా టీడీపీ ఏజెంట్లు చూస్తూ కూర్చున్నారంటే, తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లాలో అలా జ‌రిగి ఉంటే.. ఇక టీడీపీ ఆఫీసుల‌కు తాళాలు వేసుకుని, మూసుకోవ‌డం మంచిదేమో!